భారత రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన అత్యంత కీలకమైన రక్షణల్లో ఆస్తి హక్కు ఒకటి. రాజ్యాంగంలోని అధికరణ 300-A ప్రకారం ‘చట్టబద్ధమైన అధికారం లేకుండా పౌరులను తమ ఆస్తి నుంచి దూరం చేయరాదు‘. ఇక్కడ ’చట్టం’ అంటే ప్రజాప్రాతినిధ్య శాసనసభలు చేసిన శాసనమే తప్ప, రెవెన్యూ అధికారుల అంతర్గత సర్క్యులర్లు, ఎగ్జిక్యూటివ్ మెమోలు లేదా రాతపూర్వక లేఖలు కావు. అయినా వాటికి దిక్కులేకుండా పోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసిన చట్టంలో ఈ సెక్షన్ చాలా భయంకరంగా తయారైందని 2012లో హైకోర్టు తీవ్రంగా విమర్శించింది. తీర్పులో కఠినమైన ఆదేశాలు జారీ చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 2012లో దాఖలైన మొత్తం 35,000 రిట్ పిటిషన్లలో 3,360 పిటిషన్లు (దాదాపు 10% కేసులు) కేవలం సబ్ రిజిస్ట్రార్లు సెక్షన్ 22-A పేరుతో దస్తావేజులను తిరస్కరించడానికి సంబంధించినవే. అప్పుడు ప్రభుత్వం ఒకవైపు వేలాది ఎకరాల రిజిస్ట్రేషన్లను అడ్డుకుంటూ ప్రజలను వేధిస్తూ ఉండింది. మరోవైపు లక్షలాది రూపాయల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో రావాల్సిన ప్రభుత్వ ఖజానా ఆదాయాన్ని కోల్పోతున్నది. అంతిమంగా ప్రభుత్వానికి దక్కిన ప్రజాభూమి రక్షణ శూన్యం, ప్రజలకు మిగిలిన వేధింపులు అనంతం. ఈ విపత్కర పరిస్థితుల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జున్‌రెడ్డి చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు. కానీ రిజిస్ట్రేషన్ చట్టం, 1908లోని ’సెక్షన్ 22-A’ అనే ఒకే ఒక్క ఉప నిబంధన ఇవాళ అవినీతి, ప్రజల నిస్సహాయత, అధికారుల నిరంకుశత్వానికి పరాకాష్టగా మారింది.
సెక్షన్ 22-A చదివితే దాని వెనుక ఉన్న శాసన ఉద్దేశం చాలా స్పష్టమైనదని అనుకుంటున్నాం. ప్రభుత్వ భూములు, దేవాదాయ, ధర్మాదాయ, వక్ఫ్ ఆస్తులు, సీలింగ్ చట్టాల కింద ప్రభుత్వానికి మిగులు భూములు, ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాలు అన్యాక్రాంతం కాకుండా, ప్రైవేట్ వ్యక్తుల పేర్లతో నకిలీ దస్తావేజులు పుట్టకుండా కాపాడేందుకు మాత్రమే దీనిని ఒక ’చట్టబద్ధ రక్షణ కవచం’గా ప్రవేశపెట్టారని అన్నారు. కానీ కాలక్రమేణా ఇది సామాన్య ప్రజలను దోపిడీ చేసే ఒక ’పరిపాలనా వేధింపుల అస్త్రం’గా మారిపోయింది. స్పష్టమైన యాజమాన్య హక్కులు ఉండి, 1930, 1940 నుంచీ చట్టబద్ధమైన రిజిస్టర్డ్ దస్తావేజులు కలిగి ఉండి, ప్రభుత్వానికి భూమి శిస్తు చెల్లిస్తూ, చట్టబద్ధమైన పట్టాదార్ పాసుపుస్తకాలు ఉన్న సాధారణ రైతులు, పౌరులు తమ ఆస్తిని అమ్ముకోలేని పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. ఏకపక్ష ’నిషిద్ధ జాబితాల’ కారణంగా లక్షలాది కుటుంబాలు నరకయాతనను అనుభవిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో వందేండ్లకు పూర్వం (1909) నాటి రీసెటిల్మెంట్ రిజిస్టర్లలో పట్టాదార్ పేరు కాలమ్‌లో ఖాళీగా ఉండటం లేదా కేవలం చుక్కలు పెట్టడం వల్ల, వాటిని రెవెన్యూ యంత్రాంగం ఏకపక్షంగా ’ప్రభుత్వ భూమి’గా రికార్డుల్లో నమోదు చేసింది. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ’చుక్కల భూముల చట్టం’ చేయాల్సి వచ్చిందంటే, పరిపాలనా వైఫల్యం ఎంతటి తీవ్ర స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. సెక్షన్ 22-A దుర్వినియోగం కేవలం ఒక న్యాయపరమైన వివాదం మాత్రమే కాదు, ఇది లక్షలాది కుటుంబాల జీవనాధారాన్ని దెబ్బతీసిన సామాజిక, ఆర్థిక సంక్షోభం. సామాన్య మధ్యతరగతి పౌరుడికి లేదా రైతుకు తన జీవితకాలంలో సంపాదించుకున్న ఆస్తి, భూమిని అమ్ముకుందామనుకుంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఆ దస్తావేజును స్వీకరించడానికి తిరస్కరిస్తుంది. ఆ సర్వే నంబర్‌ను నిషిద్ధ జాబితాలో చేర్చారనో లేదా అది ఏడబ్ల్యూడీ (అసెస్డ్ వేస్ట్ డ్రై) అనో స్థానిక తహసీల్దార్ కారణం చూపుతారు.
రిజిస్ట్రేషన్ చట్టం, 1908లో ఎక్కడా ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్” అనే భావనే లేదు. కానీ సబ్ రిజిస్ట్రార్లు ప్రజలను రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లి ఎన్వోసీ తీసుకురావాలని ఆదేశిస్తారు. ఇటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, అటు తహసీల్దార్ /కలెక్టర్ కార్యాలయాల మధ్య పౌరులు ఏండ్ల తరబడి చెప్పులరిగేలా తిరగాల్సి వస్తున్నది. దేశ రక్షణలో సేవలందించిన మాజీ సైనికులకు ప్రభుత్వాలు భూములు కేటాయించాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 ఏండ్ల లాక్ ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత వీరు ఈ భూములను అమ్ముకోవడానికి పూర్తి చట్టబద్ధమైన హక్కు ఉన్నది. అయినప్పటికీ అధికారులు దశాబ్దాల తర్వాత కూడా వీటిని సెక్షన్ 22-A కింద బ్లాక్ చేసి వారి కుటుంబాలను వేధించారు. స్వాతంత్య్ర సమరయోధులకు కేటాయించిన భూములను ఎటువంటి షరతులు లేకుండా అమ్ముకోవచ్చు. వీరి వారసులను కూడా అక్రమంగా నిషేధిత జాబితాల్లో చేర్చి అధికారులు ఇబ్బందులకు గురిచేశారు. 1958 (తెలంగాణ ప్రాంతం), 1954 (ఆంధ్ర ప్రాంతం) కంటే ముందు ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్లలో ఎటువంటి ’అమ్మకం నిషేధ నిబంధనలు’ లేవు. 1977లో వచ్చిన అసైన్డ్ భూముల బదిలీ నిషేధ చట్టం (ACT 9 of 1977) ఈ పాత పట్టాలకు వర్తించదు. అయినా అధికారులు భూముల రిజిస్ట్రేషన్లను అడ్డుకున్నారు.
1. ఆర్ఎస్ఆర్ కాలమ్స్‌లోని చుక్కలు: 1909 నాటి రీ-సెటిల్మెంట్ రిజిస్టర్లలోని ఖాళీలను ప్రభుత్వ భూమిగా పరిగణించడం. 80-90 ఏండ్లుగా రిజిస్టర్డ్ దస్తావేజులు ఉన్న భూములను కూడా ఎటువంటి న్యాయ విచారణ లేకుండా ప్రైవేట్ వ్యక్తుల నుంచి లాక్కోవడం.
2. అసెస్డ్ వేస్ట్ డ్రై (ఏడబ్ల్యూడీ): ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్న భూములను కేవలం రికార్డులో ’ఏడబ్ల్యూడీ’ అని ఉన్నదని కారణం చూపి రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం. నిజంగా ప్రభుత్వ భూమి అయితే సివిల్ కోర్టులో దావా వేసి భూమిని స్వాధీనం చేసుకోవాలి కానీ, రిజిస్ట్రేషన్లను అడ్డుకుని పౌరులను బ్లాక్మెయిల్ చేయడం దారుణం.
3. గెజిట్ నోటిఫికేషన్లను తుంగలో తొక్కడం: చట్టం ప్రకారం సెక్షన్ 22-A(1)(e) కింద నిషేధం విధించాలంటే ప్రభుత్వం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ అధికారులు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా, కేవలం తహసీల్దార్ పంపిన లెటర్ హెడ్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు.
4. న్యాయ తీర్పుల ధిక్కరణ: హైకోర్టు ఒక సర్వే నంబర్‌పై రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, తదుపరి డాక్యుమెంట్‌కు అదే అభ్యంతరాన్ని మళ్లీ లేవనెత్తి పౌరులను నిరంతరం కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు.
సెక్షన్ 22-A శాసన పరిణామక్రమం ఈ దౌర్జన్యకరమైన చట్టం ఎలా ఉద్భవించిందో అర్థం చేసుకోవడానికి దాని శాసన న్యాయ చరిత్రను పరిశీలించాలి. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జున్‌రెడ్డి తీర్పులో అనేక ప్రధానమైన తీర్పులు ఉటంకిస్తూ, ఈ భయానకమైన కష్టాలను పేర్కొన్నారు. ప్రభుత్వం 1999లో ఆంధ్రప్రదేశ్ చట్టం 4/1999 ద్వారా రిజిస్ట్రేషన్ చట్టంలో సెక్షన్ 22-Aను చేర్చింది. అందులో ‘ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైనది‘ అని ప్రభుత్వం భావించే ఏ డాక్యుమెంట్‌నైనా రిజిస్ట్రేషన్ చేయకుండా నోటిఫికేషన్ ద్వారా నిషేధించే విస్తృత అధికారాన్ని కార్యనిర్వాహక వర్గానికి ఇచ్చారు.
స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ బసంత్ నహతా (2005) కేసులో భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) రాజస్థాన్ ప్రభుత్వం తెచ్చిన ఇటువంటి నిబంధనను రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. ఒక శాసనసభ తన చట్ట నిర్మాణ విధానాన్ని కార్యనిర్వాహక వర్గం ఇష్టానుసార విచక్షణకు అప్పగించరాదని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2005 డిసెంబర్లో 1999 నాటి సెక్షన్ 22-Aను పూర్తిగా కొట్టివేసింది. పాత చట్టం రద్దయిన తర్వాత, ప్రభుత్వం 2007లో ఆంధ్రప్రదేశ్ చట్టం 19/2007 ద్వారా సరికొత్త నిబంధనలతో సెక్షన్ 22-Aను పునర్నిర్మించింది.
ఇందులో నిషేధిత ఆస్తులను ఐదు స్పష్టమైన వర్గాలుగా విభజించారు. మొదటిది 22-A(1)(a): కేంద్ర లేదా రాష్ట్ర శాసనాల ప్రకారం స్పష్టంగా నిషేధించిన బదిలీలు (ఉదా: సీలింగ్, అసైన్డ్ ల్యాండ్స్ చట్టం). 22-A(1)(b): కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని భూములను అనధికార వ్యక్తులు బదిలీ చేయాలనుకున్నప్పుడు. 22-A(1)(c) : దేవాదాయ ధర్మాదాయ లేదా వక్ఫ్ బోర్డుకు చెందిన ఆస్తులను 10 ఏండ్లకు మించి లీజు/విక్రయం చేసినప్పుడు. 22-A(1)(d) : అర్బన్ ల్యాండ్ సీలింగ్ లేదా అగ్రికల్చరల్ ల్యాండ్ సీలింగ్ చట్టాల కింద మిగులు భూమిగా ప్రకటించినవి. 22-A(1)(e) : కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల ప్రయోజనాలు ముడిపడి ఉన్న ఇతర ఏవైనా ఆస్తులు.
సెక్షన్ 22-A(2) ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ తప్పనిసరి. శాసనసభ అత్యంత జాగ్రత్తగా రూపొందించిన రక్షణ సెక్షన్ 22-A(1)(e) కింద ఏదైనా భూమిని రిజిస్ట్రేషన్ కాకుండా నిరోధించాలంటే, సెక్షన్ 22-A(2) ప్రకారం జిల్లా కలెక్టర్ సవివరమైన కారణాలతో ప్రతిపాదన పంపాలి. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించాలి. కానీ క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రార్లు ఈ గెజిట్ నోటిఫికేషన్ నిబంధనను పూర్తిగా గాలికొదిలేశారు. తహసీల్దార్ తన లెటర్‌హెడ్‌పై రాసి పంపిన అనధికార లిస్టులను చూసి సబ్ రిజిస్ట్రార్లు లక్షలాది డాక్యుమెంట్లను ఆపేయడం ప్రారంభించారు.
అధికార యంత్రాంగం సాగిస్తున్న ఈ బరితెగింపును, నిరంకుశత్వాన్ని అడ్డుకోవడానికి ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జున్‌రెడ్డి, రావి సతీశ్, ఇతరులు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సమగ్రమైన, అన్ని జిల్లాల అధికారులను కట్టడి చేసే బైండింగ్ డైరెక్షన్స్ జారీ చేశారు. రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్లను సమర్పించినప్పుడు రెవెన్యూ అధికారుల నుంచి ’నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్’ తేవాలని సబ్ రిజిస్ట్రార్లు పౌరులను నిర్బంధించకూడదు. కేవలం తహసీల్దార్ లేదా కలెక్టర్ పంపిన సాధారణ లేఖలు, ఎక్సెల్ షీట్ జాబితాల ఆధారంగా డాక్యుమెంట్లను తిరస్కరించడానికి వీల్లేదు.
ఆర్ఎస్ఆర్ చుక్కలు లేదా ఏడబ్ల్యూడీ పేరుతో ఉన్న అనధికార జాబితాలకు చట్టబద్ధత లేదు. సెక్షన్ 22-A(1)(e) పరిధిలోకి వచ్చే భూములను రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపాలంటే, ప్రభుత్వం సెక్షన్ 22-A(2) ప్రకారం గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించి ఉండాలి. గెజిట్ లేని ఏ భూమినైనా సబ్ రిజిస్ట్రార్ తక్షణమే రిజిస్ట్రేషన్ చేసి తీరాలి. ఆంధ్రా ప్రాంతంలో 18-06-1954 కంటే ముందు అసైన్ చేసిన భూములపై ఎటువంటి బదిలీ నిషేధ నిబంధన లేదు. తెలంగాణ ప్రాంతంలో 25-07-1958 కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్లకు ఎలాంటి అమ్మకం నిషేధాలు లేవు. ఈ తేదీల కంటే ముందు నాటి భూములను అసైన్డ్ భూముల చట్టం (Act 9 of 1977) కింద అడ్డుకోవడం చట్టవిరుద్ధం.
ఏ సబ్ రిజిస్ట్రార్ కూడా డాక్యుమెంట్‌ను నోటిమాటతో తిరస్కరించి వెనక్కి పంపకూడదు. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయలేకపోతే రిజిస్ట్రేషన్ చట్టంలోనిసెక్షన్ 71 కింద స్పష్టమైన కారణాలతో కూడిన లిఖితపూర్వక తిరస్కరణ ఉత్తర్వు జారీ చేయాలి. ఒకవేళ పౌరుల రిజిస్టర్డ్ ఆస్తిని సబ్ రిజిస్ట్రార్ సెక్షన్ 22-A కింద నిరాకరిస్తే ఈ మార్గాలను అనుసరించి, సమస్యను పరిష్కరించుకోవచ్చు. డాక్యుమెంట్‌ను తిరస్కరించే అధికారం నేరుగా సబ్ రిజిస్ట్రార్‌కు లేదు. దస్తావేజును ప్రజెంట్ చేసి, ప్రజెంటేషన్ ఫీజు చెల్లించి రసీదు డిమాండ్ చేయాలి. రిజిస్ట్రేషన్ నిరాకరిస్తే కారణాలను లిఖితపూర్వకంగా ఉత్తర్వుల రూపంలో ఇవ్వాలని లిఖితపూర్వకంగా కోరాలి. సదరు సర్వే నంబర్ సెక్షన్ 22-A(1)(e) లో ఉంటే, దానికి సంబంధించిన ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ చూపించమని సవాలు చేయాలి.
రావి సతీశ్ కేసులో హైకోర్టు ఇచ్చిన బైండింగ్ మార్గదర్శకాలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తే, సదరు అధికారులపై వ్యక్తిగతంగా కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయవచ్చు. ఆస్తిపై హక్కు అనేది ఒక వ్యక్తి ఆర్థిక స్వేచ్ఛకు, గౌరవప్రదమైన జీవనానికి ప్రాతిపదిక. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల సమన్వయ లోపం, అవినీతి, నిరంకుశత్వం వల్ల లక్షలాది మంది సామాన్య ప్రజలు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా అనధికార నిషేధిత జాబితాలను రద్దు చేయాలి. గెజిట్ లేని 22-A(1)(e) సర్వే నంబర్లను వెంటనే డి-నోటిఫై చేయాలి, రావి సతీశ్ తీర్పును అమలు చేయని అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలి. అప్పుడే రాజ్యాంగ అధికరణ 300-A కు, న్యాయవ్యవస్థ ఆదేశాలకు నిజమైన అర్థం లభిస్తుంది. పెద్దగా చేయవలసిందేమీలేదు. ఈ తీర్పు అమలు చేస్తే చాలు. కాని ప్రభుత్వానికి ఆ ధైర్యం ఉందా అనేది ప్రశ్న.
– (వ్యాసకర్త: న్యాయ నిపుణుడు)
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్