ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కాంగ్రెస్ దోహదపడిందనేది ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ పలువురు రాజకీయ పండితులు చేసిన వ్యాఖ్యానం. ఆ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 45.56 శాతం ఓట్లతో 48 సీట్లను గెలుచుకొని అధికారంలోకి రాగా, 11 ఏండ్లుగా ప్రభుత్వాన్ని నడుపుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 43.57 శాతం ఓట్లతో కేవలం 22 సెగ్మెంట్లకే పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. గెలిచిన బీజేపీ, ఓడిన ‘ఆప్’కి మధ్య ఓట్ల తేడా రెండు శాతం మాత్రమే. ఆ పార్టీతో పొత్తు వద్దని ఒంటరిగా బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ 6 శాతం ఓట్లతో డిపాజిట్లు కోల్పోయింది.
Congress | కాంగ్రెస్ పార్టీ 1998 నుంచి 2013 వరకు వరుసగా 15 ఏండ్లపాటు ఢిల్లీని పాలించింది. ఆ తర్వాత వరుసగా ఓడిపోతూ క్రమంగా ఉనికి కోల్పోతున్నది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లోనూ ఆ పార్టీకి పరాభవం తప్పలేదు. కర్ణాటక, తెలంగాణల్లో గెలిపించిన సంక్షేమ పథకాలు, గ్యారెంటీలు ఆ రాష్ర్టాల్లో బెడిసికొట్టాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఐదు గ్యారెంటీల మంత్రం పనిచేయలేదు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 నియోజకవర్గాలుండగా కాంగ్రెస్ పార్టీ 101 స్థానాల్లో పోటీ చేసి కేవలం 16 స్థానాల్లో మాత్రమే గెలిచింది. గతంలో ఎన్నడూ లేనంతగా అక్కడ కేవలం 12.42 శాతం ఓట్లకే పరిమితమైంది.
కాంగ్రెస్ కూటమి నమ్ముకున్న గ్యారెంటీల వ్యూహం కర్ణాటక, తెలంగాణల్లో ఫలించింది కానీ, హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీల్లో బెడిసికొట్టింది. కర్ణాటక, తెలంగాణల్లో గ్యారెంటీలతో గెలిచిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటి అమలులో విఫలం కావడంతో ఆ పార్టీ విశ్వసనీయత దెబ్బతిన్నది. తెలంగాణలో రేవంత్‌రెడ్డి పాలనను చూపించి ఇతర రాష్ర్టాల్లో గట్టెక్కాలనుకున్న కాంగ్రెస్ కుయుక్తుల్ని అక్కడి ఓటర్లు నమ్మలేదు. ఝార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమి గెలిచినప్పటికీ అక్కడ పెద్దన్న పాత్ర జేఎంఎం పార్టీదే. హేమంత్ సోరెన్‌ను జైలుకు పంపడంతో గిరిజనుల్లో ఆయన పట్ల వెల్లువెత్తిన సానుభూతితో జేఎంఎం కూటమి గెలిచిందే తప్ప అక్కడ కాంగ్రెస్ చేసిన మ్యాజిక్ ఏమీ లేదు. ఇక, మహారాష్ట్రలో కాంగ్రెస్ దారుణ ఓటమి నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు ‘ఆప్’ ముందుకు రాలేదు. కాంగ్రెస్ ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌ల్లో మాత్రమే అధికారంలో ఉన్నది. ఈ మూడు రాష్ర్టాల్లోనూ ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఆపసోపాలు పడుతున్నది. హిమాచల్ ప్రదేశ్‌లో అయితే ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేనంతగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.
కర్ణాటకలో ‘ముడా’ (మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) భూ కేటాయింపుల కేసు, వాల్మీకి స్కాంలో కాంగ్రెస్ కూరుకుపోవడం, వాల్మీకి స్కాంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకూ సంబంధం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కమిషన్లు అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతున్నది. ఇలా నానాటికీ ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటున్న కాంగ్రెస్ మరోసారి గెలవడం అంత సులభం కాదని అర్థమవుతున్నది.
క్షేత్రస్థాయిలో పరిస్థితులు కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఉండగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం మొన్నటి లోకసభ ఎన్నికలు సెమీఫైనల్స్ మాత్రమేనని, 2029లో జరిగే ఎన్నికలు ఫైనల్స్ అని, అందులో గెలిచి రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారంటూ పగటి కలలు కంటున్నారు. 2009 తర్వాత తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో వరుసగా రెండోసారి కాంగ్రెస్ గెలిచిన దాఖలాలు లేవు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో ఏర్పడిన రెండు రాష్ర్టాల్లోనూ కాంగ్రెస్ గెలవలేకపోయింది. అంతకు ముందు వరుసగా రెండుసార్లు గెలిచిన కాంగ్రెస్ ఆ తర్వాత ఏపీలో కనుమరుగైంది. ఢిల్లీలో వరుసగా మూడుసార్లు గెలిచిన కాంగ్రెస్ 2013 నుంచి ఉనికినే కోల్పోయింది. అసోంలోనూ వరుసగా మూడుసార్లు గెలిచిన హస్తం పార్టీ ఆ తర్వాత వరుసగా రెండుసార్లు ఓడిపోయింది. 2023 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో అధికారాన్ని నిలబెట్టుకోలేక పోయింది. అంతకు ముందు పంజాబ్‌లో సైతం అలాగే చతికిలపడింది.
మహారాష్ట్ర, యూపీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, బీహార్, ఏపీ, ఒడిశా, ఝార్ఖండ్, ఢిల్లీ వంటి రాష్ర్టాల్లో కాంగ్రెసు పార్టీ ఉనికి నామమాత్రమే. ఈ రాష్ర్టాల్లో మిత్రపక్షాలపై ఆధారపడి కొన్ని సీట్లలో పోటీ చేసి గెలుస్తున్నదే తప్ప స్వయంగా గెలిచే బలాన్ని ఎప్పుడో కోల్పోయింది. ఒకప్పుడు అధికారంలోనో, ప్రధాన ప్రతిపక్షంగానో ఉన్న ఈ పెద్ద రాష్ర్టాల్లో ఇప్పుడా పార్టీ స్థానాన్ని ప్రాంతీయ పార్టీలో, బీజేపీనో ఆక్రమించాయి. ఢిల్లీలో ‘ఆప్’, ఏపీలో ‘వైసీపీ’, ఒడిశాలో బీజేపీ ఆ స్థానాన్ని లాక్కున్నాయి. ఇప్పుడు ఇదే పరిస్థితి తెలంగాణలో ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. ఢిల్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 2013 ఎన్నికల్లో ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది. ఇదే పరిస్థితి తెలంగాణలోనూ ఎదురయ్యే అవకాశం ఉన్నది.
కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుండటంతో, ఎన్నికల్లో ఓడిపోతున్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ కోలువడం లేదు. ఢిల్లీ, ఒడిశా ఉదంతాలు దీనిని రుజువు చేస్తున్నాయి. రాష్ర్టాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంగా ఉండి పుంజుకుంటుందే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనపడదు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీల ఉనికి బలీయమైనది. తమిళనాడులో అయితే కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలు అక్కడ బలంగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలలో ఏదో ఒకదానితో పొత్తుపెట్టుకోవాల్సిందే తప్ప, మరో దారి లేకుండా పోయింది. ప్రాంతీయ సెంటిమెంట్లు బలంగా ఉండే ఈ రాష్ర్టాల్లో స్థానిక పార్టీలు కొన్ని సందర్భాల్లో ఒడిదొడుకులకు లోనుకావచ్చు కానీ, ఉనికికి మాత్రం ఢోకా లేదు. రేవంత్ సర్కారు ఇలాగే వైఫల్యాల బాటలోనే సాగితే వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో కాంగ్రెస్ పుట్టి మునగడం ఖాయం. అప్పుడు యూపీ, బెంగాల్, తమిళనాడు, బీహార్, ఏపీ, ఒడిశా, ఝార్ఖండ్, ఢిల్లీ రాష్ర్టాల్లో మాదిరి ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది.