సామాజిక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలంటే లెక్కలు పక్కాగా ఉండాలి. ఏ సామాజిక వర్గం జనాభా ఏమేరకు ఉందనేది తేలితేగానీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ఆ వర్గాలకు అందించడం వీలుపడదు. అందుకు కులగణన తప్పనిసరి. కానీ ఈ భావన పట్ల రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ చిత్తశుద్ధి ఎప్పుడూ అనుమానాస్పదమే. కేంద్రంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నప్పుడు దీనిని ఏమాత్రం పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీ మతరాజకీయాలకు పోటీగా ఈ భావనను ఇటీవలి కాలంలో ఎత్తుకున్నది. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందే దృష్టితోనే ఇలా చేసిందని పైకి తెలుస్తూనే ఉన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీలకు రిజర్వేషన్ 23 నుంచి 42 శాతానికి పెంచుతామని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
శాస్త్రీయమైన పద్ధతిలో సేకరించిన గణాంకాలు లేకుండా దీనిని అమలు చేయడం సాధ్యం కాదనేది తెలిసిందే. దాంతో మొక్కుబడిగా సర్వేను ఓ తంతులాగా పూర్తి చేసింది. ఆ సర్వే జరుగుతున్నప్పుడే లోటుపాట్ల గురించి తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. బీసీ సంఘాలు సర్వే తీరుతెన్నులపై అనుమానాలు వ్యక్తం చేశాయి కూడా. అన్నిటినీ బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా సర్వే జరిపింది కాంగ్రెస్ సర్కార్. ఇప్పుడు గందరగోళపు లెక్కలతో నివేదికను వండివార్చింది.
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సర్వే నివేదిక ఆ అనుమానాలన్నీ నిజమేనని చాటిచెప్పింది. అప్పుడెప్పుడో ఏడాదిన్నర క్రితం చేపట్టిన లోపభూయిష్టమైన సర్వేపై సర్కార్ వండివార్చిన నివేదిక తప్పులతడకగా ఉందనే విమర్శలు అన్నివైపుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. జనాభా పెరుగుదల లెక్కలే ఈ విమర్శలకు ప్రధాన మూలంగా నిలుస్తున్నాయి. 2011-2024 మధ్యకాలంలో సుమారు 13 ఏండ్లలో 1.35 శాతం వృద్ధిరేటు ప్రకారం రాష్ట్ర జనాభా 70 లక్షలకు పైగా పెరగాలి. కానీ పెరిగింది కేవలం 20 లక్షలే. 2014లో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటంబ సర్వే ప్రకారం రాష్ట్ర జనాభా 3,68,76,544. అదేవిధంగా 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం రాష్ట్ర జనాభా 3,70,77,544. అంటే పదేండ్లలో పెరిగిన జనాభా బొటాబొటీగా రెండు లక్షలే అని చూపడం వింతల్లోకెల్లా వింత. ఇక బీసీ జనాభా విషయమై నివేదికలో కాకిలెక్కలు చోటుచేసుకున్నాయి.
ముస్లిం బీసీలు లేకుండానే బీసీ జనాభా 51 శాతం కంటే ఎక్కువగా ఉంటుందనేది అందరూ ఆమోదించే అంచనా. కానీ, ప్రభుత్వ తాజా నివేదికలో రెండింటినీ కలిపి 56 శాతం మాత్రమేనని చూపడం పలు అనుమానాలకు తావిస్తున్నది. పైగా ముస్లిం రిజర్వేషన్లు కలిపి చూపడంపై బీసీ సంఘాలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మొత్తంగా పెండ్లిళ్ల సంఖ్య, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారుల సంఖ్య, పంపిణీ అయిన కేసీఆర్ కిట్ల సంఖ్యలతో పోలిస్తే ప్రభుత్వం చూపిన బీసీ జనాభా పెరుగుదల నమ్మశక్యంగా లేదు. అసలు ఎవరూ పిల్లలను కనడం లేదా అనే ప్రశ్న ఈ సందర్భంగా ఉత్పన్నమవుతున్నది. అసలు బీజీ జనాభా అంచనాల్లో ఇంతటి వ్యత్యాసం ఎందువల్ల వచ్చింది? ఇంకా బీసీల్లో సగం కులాల్లో పెద్దగా వెనుకబాటుతనం లేదని చెప్పడం కుట్రపూరితమే. కులం తెలిపేందుకు నిరాకరించిన వారిని ఓసీల్లో కలుపడం, అన్ని సామాజిక వర్గాల్లో ఓసీల లెక్కలు తీయడం ఎందుకు? మరోవైపు ఎస్సీల జనాభా తగ్గినట్టు చూపడం మరీ విడ్డూరం. నివేదికలోని లెక్కలు నిర్హేతుకంగా ఉన్నాయనేది తెలిసిపోతున్నది.
ఈ నివేదికను డాటా ప్రైవసీ పేరిట దాచేసి, అవసరమైన సందర్భాల్లో అసెంబ్లీకి సమర్పించకుండా తొక్కిపెట్టి, ఇప్పుడు ఆగమేఘాల మీద అర్ధరాత్రి బయటపెట్టడం ఎందుకు అనేది ప్రశ్న. ఓవైపు జగిత్యాలలో కేసీఆర్ నేతృత్వంలో ఈనెల 20న భారీ బహిరంగ సభ జరుగబోతున్న తరుణంలో, మరోవైపు కేంద్రం డీలిమిటేషన్ ఎజెండాను ఎత్తుకున్న సమయంలో హడావుడిగా సర్వే నివేదికను సందట్లో సడేమియా అన్నట్టుగా బైటపెట్టడంపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. డీలిమిటేషన్ను మహిళల 33 శాతం కోటాకు ముడిపెట్టి మహిళా ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తుంటే, బీసీలకు ఏదో ఒరగబెట్టినట్టు ప్రచారం చేసుకునేందుకు కాంగ్రెస్ తాపత్రయపడుతున్నది. రెండు పార్టీలది ఎన్నికల తాపత్రయమే. బీసీలనైనా, మహిళలనైనా మభ్యపెట్టడమే వారి నైజం.