90వ దశకంలో భారత్ తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణల్లో నాటి ప్రధాని పీవీ నరసింహారావుతో పాటు అప్పటి ఆర్థికశాఖ మంత్రి మన్మోహన్ సింగ్ పాత్ర మరువలేనిది. ఓ వైపు గల్ఫ్ సంక్షోభం, మరోవైపు విదేశీ మారక నిల్వలు తగ్గిపోయి దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మన్మోహన్సింగ్… ‘సమయం వచ్చినప్పుడు భారత్‌ను ఎవరూ ఆపలేరు’ అని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. ఆయన అన్నట్టుగానే నాడు భారత ఆర్థికవ్యవస్థ అనతి కాలంలోనే నిలదొక్కుకున్నది. ఆర్థికపరంగా గాడితప్పిన దేశాన్ని అభివృద్ధి పట్టాలు ఎక్కించిన ఆ ర్థిక యోధుడికి భారతీయ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారు. ముఖ్యంగా మన తెలంగాణ సమాజం ఆయనను ఎన్నటికీ మరువదు. ఎందుకంటే, 60 ఏండ్ల స్వరాష్ట్రం కల సాకారమవ్వడంలో ఆయన కృషి ఎనలేనిది.
2004లో కాంగ్రెస్‌తో కలిసి పోటీచేసిన తెలంగాణ రాష్ట్ర సమితి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, కేంద్రంలోని యూపీఏ కూటమి సర్కార్‌లోనూ చేరింది. కూటమికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్‌ను ప్రధానమంత్రిగా ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనకు కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పూర్తి మద్దతునిచ్చింది. మన్మోహన్సింగ్ మంత్రివర్గంలో కేసీఆర్‌తో పాటు ఆలె నరేంద్ర చేరారు. ఆ తర్వాత జరిగిన మొదటి మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ ఏర్పాటుపై చర్చ జరిగింది. దానికి నాటి ప్రధాని మన్మోహన్సింగ్ చాలా సానుకూలంగా స్పందించారు. ఆయన అనుకూల వైఖరి వల్లే రాష్ట్రపతి ప్రసంగంలోనూ తెలంగాణ ప్రస్తావన వచ్చిచేరింది.
సోనియాగాంధీ నాయకత్వంలో ఉన్న యూపీఏ కూటమి తమ కామన్ మినిమం ప్రోగ్రాం (సీఎంపీ)లో కూడా తెలంగాణ అంశాన్ని చేర్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము సుముఖంగా ఉన్నామని యూపీఏ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐదుగురు ఎంపీలతో తెలంగాణ రాష్ట్ర సమితి మన్మోహన్సింగ్ను ఎప్పుడు కలిసినా ఆశాభావంతో ఉండాలని ఆయన చెప్పేవారు.
తెలంగాణ ఎంపీలు మన్మోహన్సింగ్ను ఎప్పుడు కలిసినా మన ప్రాంత సమస్యలను అడిగి తెలుసుకునేవారు. వాటి పరిష్కారం పట్ల సానుకూలంగా స్పందించేవారు. అలాగే మొదట కేసీఆర్‌కు నౌకాయాన శాఖ ఇవ్వాలని మన్మోహన్ సింగ్ నిర్ణయించారు. కేసీఆర్ తన కార్యాలయంలో పూజ కూడా పూర్తిచేసుకున్నారు. కానీ, అప్పటి డీఎంకే ఎంపీలు ఆ శాఖ తమ పార్టీకే ఇవ్వాలని మన్మోహన్‌సింగ్‌పై ఒత్తిడి తెచ్చారు. ఈ విషయమై మన్మోహన్సింగ్ దగ్గరికి వెళ్లిన కేసీఆర్ ఒక్కటే మాట చెప్పారు. ‘మాకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యం.
మంత్రి పదవులపై మాకు మక్కువ లేదు. మీరు ఏ శాఖ ఇచ్చినా తీసుకుంటా. కానీ, తెలంగాణ ఇవ్వండి’ అని మన్మోహన్‌కు స్పష్టం చేశారు. దాంతో పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు కేసీఆర్ భుజం తట్టి అభినందించిన మన్మోహన్… తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకున్నారు. నౌకాయాన శాఖను వదులుకున్న కేసీఆర్.. మన్మోహన్సింగ్ మంత్రివర్గంలో సుమా రు 10 నెలల పాటు ఎలాంటి శాఖ లేకుండా పనిచేశారు. ఆ తర్వాత నాటి కేంద్రప్రభుత్వం కేసీఆర్‌కు కార్మిక శాఖను కేటాయించింది.
2019 ఏప్రిల్ 8న ప్రొఫెసర్ సీహెచ్ హనుమంతరావు రచించిన ఓ పుస్తకాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీలో ఆవిష్కరించారు. ఆ సభలో తెలంగాణ అభివృద్ధి, ముఖ్యంగా రైతుబంధు, రైతుబీమా పథకాలపై ఆయన నాతో చర్చించడమే కాకుండా, ఆ పథకాలను కొనియాడుతూ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభినందించారు.
మన్మోహన్సింగ్ నేతృత్వంలో కార్మిక శాఖ మంత్రిగా రెండేండ్లు పనిచేసిన కేసీఆర్ అనేక సంస్కరణలు చేపట్టారు. అంతేకాదు, తెలంగాణకు అనేక అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకువచ్చారు. ముఖ్యంగా కేసీఆర్ కృషి వల్లే హైదరాబాద్-కరీంనగర్ (మనోహరాబాద్-కొత్తపల్లి) రైల్వే లైన్‌కు పునాదులు పడ్డాయి. పెద్దపల్లి-కరీంనగర్-జగిత్యాల -నిజామాబాద్ రైల్వే లైన్ కోసం కేసీఆర్ సహా తెలంగాణ ఎంపీలు పలుసార్లు నాటి ప్రధాని మన్మోహన్సింగ్ను కలిసి వెంటనే భూసేకరణ, సర్వే పూర్తి చేసేలా ఒత్తిడి తీసుకువచ్చారు. అంతేకాదు, గోదావరిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మింస్తున్న బాబ్లీ ప్రాజె క్టు, కృష్ణా జలాల పంపకంపై అప్పటి ఏపీ ముఖ్యమంత్రి రోశయ్య నేతృత్వంలో ప్రధాని మన్మోహన్ సింగ్‌ను అఖిలపక్ష నాయకులుగా మేం కలిశాం. కృష్ణా జలాల పంపకంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని లేవనెత్తితే సావదానంగా విన్న మన్మోహన్సింగ్ నిష్పక్షపాతంగా జలాల పంపిణీ జరుగుతుందని హామీ ఇచ్చారు.
ఇక తెలంగాణ నుంచి గొప్ప ఆర్థికవేత్తగా ఎదిగిన మా మేనమామ డాక్టర్ సీహెచ్ హనుమంతరావు, మన్మోహన్ సింగ్ కలిసి పనిచేశారు. ఏడో ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్‌గా పనిచేసిన మన్మోహన్‌సింగ్‌తో సీహెచ్ హనుమంతరావు సభ్యులుగా పనిచేశారు. చాలా ఆర్థిక విధానాల్లో ఇరువురు కలిసి మేధోమథనాలు జరిపేవారు. ఆర్థిక సంఘం సభ్యుడిగా పనిచేసిన హనుమంతరావు సమర్థతను మన్మోహన్సింగ్ దగ్గరుండి చూశారు. అందుకే మన్మోహన్సింగ్ సర్కార్ 2004లో హనుమంతరావును పద్మభూషణ్ పురస్కారంతో సము న్నతంగా సత్కరించింది.
తెలంగాణ ప్రకటన నుంచి మొదలుపెడితే పార్లమెంట్లో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు వరకు అప్పటి ప్రధానిగా మన్మోహన్ ఎంతో సహకరించారు. ముఖ్యంగా రాజ్యసభలో ఎదురైన అడ్డంకులను చాకచక్యంగా పరిష్కరించారు. రాజ్యసభలో వెంకయ్యనాయుడు విభజన బిల్లులో కొన్ని సవరణలు సూచించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరారు. లేకుంటే విభజన బిల్లును అడ్డుకుంటామని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ఒకవేళ రాజ్యసభలో ఆ బిల్లు ఆమోదం పొందకపోతే మళ్లీ లోక్‌సభకే తిరిగి వెళ్లేది. తెలంగాణ ప్రజల నోటికాడి బుక్క కింద జారిపడే పరిస్థితి. ఈ అత్యయిక పరిస్థితులను గమనించి కేసీఆర్‌తో పాటు నేను సోనియాగాంధీ, నాటి ప్రధాని మన్మోహన్సింగ్ను ప్రత్యక్షంగా కలిశాం. రాజ్యసభలో విభజన బిల్లు ఆమోదం పొందేలా చూడాలని మన్మోహన్సింగ్ను కోరాం. మా వినతి మేరకు మరునాడు ఉదయమే ఆయన రాజ్యసభకు చేరుకొని వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ తదితరుల డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఏపీ విభజన బిల్లుకు మద్దతు ఇవ్వాలని వారిని కోరారు.
బిల్లు ఆమోదానికి ముందు ప్రసంగించిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రస్తావిస్తూ ఈ దేశం ఎలాంటి క్లిష్ట నిర్ణయాలైనా తీసుకోగలదని పేర్కొన్నారు. కేసీఆర్‌కు మాట ఇచ్చినట్టుగానే మన్మోహన్సింగ్ చివరి వరకు రాజ్యసభలోనే ఉండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందేలా చూశారు. తద్వారా తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకార మైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
– (వ్యాసకర్త: న్యాయవాది, పార్లమెంట్ మాజీ సభ్యులు)
బోయినపల్లి వినోద్‌కుమార్