తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడంలో పలు రాజకీయ పార్టీల కుట్రలకు, కుతంత్రాలకు ఏ మాత్రం తీసిపోకుండా తన వంతు పాత్ర పోషించింది ఓ వర్గం మీడియా. తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి చూపించడం మొదలుకొని ఉద్యమాన్ని తప్పుబట్టే ప్రశ్నలు రాసిచ్చి అడిగించడం దాకా అన్ని ప్రయత్నాలు చేసింది. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ప్రతి పోరాటాన్నీ పత్రికల్లో, చానళ్లలో కనిపించకుండా అణచిపెట్టిన సందర్భాలకు లెక్కే లేదు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని , ఆత్మగౌరవాన్ని సగర్వంగా చాటి చెప్పేలా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పటిష్ఠ చర్యల వల్ల ఈ మీడియా సంస్థలు వెనక్కి తగ్గక తప్పలేదు. అయినప్పటికీ దాదాపు దశాబ్ద కాలం పాటు ఈ తెలంగాణ ద్రోహులంతా నివురుగప్పిన నిప్పులాగానే ఉన్నారు. ఇప్పుడు అధికార మార్పిడి జరిగిన మొదటి రోజు నుంచీ ఇన్నేండ్లు దాచుకున్న అక్కసునంతా వెళ్లగక్కుతున్నారు. ‘ఇసుంట రమ్మం టే ఇల్లంతా నాదే’ అంటున్నారు. పూటకో కొత్త కుట్రతో తెలంగాణను దోచుకొని ఆగం చేయడమే తక్షణ కర్తవ్యంగా వ్యవహరిస్తున్నారు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని అడవి, వన్యప్రాణి పరిరక్షణ నుంచి కేవలం రాజకీయ సమస్యగా మార్చే కుట్ర ఇప్పుడు జరుగుతున్నది. రేవంత్ సర్కార్ బుల్డోజర్లతో కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల అటవీ భూమిని నామరూపాల్లేకుండా చేసే ప్రయత్నం మొదలుపెట్టిన దగ్గరి నుంచి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసిన, పనిచేస్తున్న మీడియా సంస్థల ద్వారా ఈ కుట్రలు మరింత ఊపందుకున్నాయి. సాక్షాత్తు సుప్రీంకోర్టు ‘కంచ గచ్చిబౌలి ఫారెస్ట్’ అని ప్రస్తావించినా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటిలాగే అబద్ధాల ప్రచార అస్ర్తాన్ని సంధిస్తూ వస్తున్నది.
ఏప్రిల్ 16న కేసు విచారణ జరగనున్న నేపథ్యంలో కంచ గచ్చిబౌలిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి నివేదిక ఇవ్వడానికి కేంద్ర సాధికార కమిటీ హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మూడు పార్టీలు కమిటీకి చుక్కలు చూపించాయని ఓ చానల్లో ‘బర్నింగ్ టాపిక్’ అనే ప్రోగ్రామ్‌లో కథనాలు ప్రదర్శించారు. ఇది ముమ్మాటికీ రాజకీయ అంశంగా ముద్ర వేసే కుట్రే. ఇందులో భాగంగానే ఒకవైపు పార్టీల వాదనలు అని చెప్తూనే, కాంగ్రెస్ మీద ఆరోపణలతో పాటు ఇందులోకి బీజేపీని లాగేసింది బీఆర్ఎస్ అనే తన ఉద్దేశాన్ని ఆపాదించే ప్రయత్నం చేసింది ఆ చానల్. దేశమంతటికి, జాతీయ మీడియాకు ఇది పర్యావరణ కోణంలో కనిపించగా.. తెలంగాణలో చాలా మీడియా సంస్థలకు ఇది రాజకీయ కోణంగా మాత్రమే ఎందుకు కనిపిస్తుందనేది అసలు ప్రశ్న.
ఒకవైపు కంచ గచ్చిబౌలి భూములు ముమ్మాటికీ వర్సిటీకి చెందినవేనని సాధికార కమిటీ ఎదుట బీఆర్ఎస్ గట్టిగా వాదించిందని అంటూనే, మరోవైపు ఈ వ్యవహారంలో బీజేపీ మధ్యేమార్గంగా వర్సిటీ వైపు ఉందని ఎల్లో మీడియా చెప్పింది. భూములు యూనివర్సిటీకి చెందినవేననే మాటకు.. వర్సిటీ వైపు ఉండటానికి వ్యత్యాసం ఏంటో వాళ్లకే తెలియాలి. యూనివర్సిటీ వైపు బీజేపీ ఉండటమనేది మధ్యేమార్గం ఎలా అవుతుందో రాసిన వాళ్లకే తెలియాలి. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద గట్టిగా పోరాడేది కానీ ఇక్కడ విచిత్రంగా కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ మీదే బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. దీని వెనక ఉన్న ఉద్దేశాన్ని కవర్ చేయడానికి సదరు చానల్ గట్టిగానే ప్రయత్నించింది. రూ.10 వేల కోట్ల కుంభకోణం ఆరోపణలు కాంగ్రెస్‌తో పాటు తన మీదికి వచ్చేదాకా కంచ గచ్చిబౌలి భూముల విషయంలో బీజేపీ అంటీముట్టనట్టుగానే ఉందని ఇదే ప్రోగ్రామ్‌లో ఒక వ్యాఖ్య చేయడం కొసమెరుపు.
మీడియా కథనాల్లో విశ్వసనీయతపై కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదైనా కీలక సంఘటన జరిగినప్పుడు సంబంధిత డేటాను, డాక్యుమెంట్లతో సహా సంపాదించి వార్తలు ప్రసారం చేసే ఆ చానల్‌కు కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి డేటా, డాక్యుమెంట్లు కనిపించలేదా? లేక ఈ అంశాన్ని రాజకీయ అంశంగా మార్చడానికి వాస్తవాలు దాచిపెట్టారా? అనేది తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ అనుకూల చానళ్ల విషయంలో ఈ సందేహానికి తావు లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వ అజెండా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అజెండానే వాటి కార్యాచరణ కాబట్టి.
బుల్డోజర్లతో చెట్లన్నీ నేలమట్టం చేయడం వల్ల ఆవాసాలు కోల్పోయి కుక్కల దాడుల్లో జింకలు ప్రాణాలు కోల్పోతుంటే.. దాన్ని కప్పిపుచ్చడానికి ఎండాకాలం నీళ్ల కోసం బయటికొచ్చి చనిపోతున్నాయని, హెచ్‌సీయూలో ఇదంతా సహజమని ఎల్లో మీడియా అబద్ధపు కథనాలు వండివారుస్తున్నది.
బీకాన్ సంస్థతో టీజీఐఐసీ ఒప్పందం చేసుకునే నాటికి ఆ భూములు నిషిద్ధ జాబితాలోనే ఉన్నాయి. యాజమాన్య హక్కులు లేకుండానే టీజీఐఐసీ ఈ భూములను ఎట్లా కుదువబెట్టి రూ.10 వేల కోట్ల లోన్ తీసుకుందని, భూముల విలువను ఎకరం రూ.100 కోట్ల నుంచి రూ.75 కోట్లకు తగ్గించి, భారీ ఆర్థిక కుంభకోణం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధారాలతో సహా బయటపెట్టారు. అయితే కంచ అంటే గ్రేజింగ్ అని, పశువులు మేసే ప్రాంతమని, ఏండ్లుగా ఖాళీగా ఉండటం వల్ల చెట్లు పెరిగాయని మంత్రి శ్రీధర్‌బాబు తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు.
గతంలో ఇతర రాష్ర్టాల ఎన్నికల ప్రచారంలో సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో హామీలన్నీ అమలు చేశామని చెప్పారు. కానీ, తెలంగాణలో క్షేత్రస్థాయిలో హామీలు ఎంతవరకు అమలయ్యాయనేది ప్రజలకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెప్పే మాటల్లో విశ్వసనీయత ఎంతనేది ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
‘నమ్ముకొని అధికారము ఇస్తే నమ్మకము పోగొట్టుకుంటివి పదవి అధికారము బూని పదిలముగా తల బోడిజేస్తివి’ అన్న మహాకవి కాళోజీ మాటలను ఇప్పుడు అక్షరాలా నిజం చేసి చూపించింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఈ భూముల వ్యవహారం అటవీ, వన్యప్రాణులు, పర్యావరణం, హెచ్సీయూకు సంబంధించినది. దీన్ని దారిమళ్లించి, కేవలం రాజకీయ అంశంగా మారిస్తే అంతిమంగా నష్టం తెలంగాణ సమాజానికే. మరి లాభం ఎవరికి అంటే తెలంగాణ ద్రోహులకు, వ్యతిరేకులకు అనేది సుస్పష్టం.
-స్వేచ్ఛ