మేధావుల కార్ఖానాలు విశ్వవిద్యాలయాలు. అలాంటి వర్సిటీలకు కాంగ్రెస్ పాలకులు కంచెలు వేసి బందీ చేస్తున్నారు. ప్రజాపాలకులమంటూ గొప్పలకుపోయే కాంగ్రెస్ పాలకులు తమ చుట్టూ కంచెలు ఉంటే తప్ప కాలు ముందుకేయడం లేదు. ఒకప్పుడు ఆశోకుడు రోడ్డుకు ఇరువైపులా చెట్లను నాటించాడని పుస్తకాల్లో చదివాం. కానీ, నేటి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హయాంలో రోడ్డుకు ఇరువైపులా కంచెలు మొలుస్తుండటం శోచనీయం. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించింది. కానీ, గత బీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన ఉద్యోగాలకే నియామక పత్రాలు అందిస్తూ ఆనందపడుతున్నది. కాంగ్రెస్ తీరు ఎట్లా ఉందంటే, ఎవరికో పుట్టిన బిడ్డ తన బిడ్డేనని చెప్పుకొన్నట్టు ఉంది. అయితే, సీఎం రేవంత్‌రెడ్డి ఓయూలో కాలు పెడుతున్నారని తెలియగానే తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉస్మానియా విద్యార్థిలోకం ఒక్కటిగా కదిలింది. హామీలు నెరవేర్చని సీఎంకు యూనివర్సిటీలో అడుగు పెట్టే అర్హతలేదని ఢంకా బజాయించింది. ఒకవేళ కాలు పెడితే హామీల అమలుపై కచ్చితంగా నిలదీస్తామని హెచ్చరించింది. విద్యార్థినేతల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేని రేవంత్ సర్కార్ ప్రశ్నించేవారి గొంతు నొక్కే చర్యలకు పూనుకున్నది. అందులో భాగంగానే రాత్రికిరాత్రే విద్యార్థి నేతలందరిని అక్రమ అరెస్టులు చేసింది. మేధో నిలయమైన యూనివర్సిటీ మొత్తాన్ని కంచెలతో కట్టిపడేసి, ఆ కంచెల మాటునే సీఎం పర్యటించడం కాంగ్రెస్ పరిస్థితికి అద్దం పడుతున్నది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో వసతి గృహాలను నిర్మిస్తే వాటికి రిబ్బన్ కట్ చేసి అంతా తామే చేశామని కాంగ్రెస్ పాలకులు ప్రగల్భాలు పలుకుతున్నరు. అయితే, మొదటికే మోక్షం లేదన్నట్టు 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీ నెరవేర్చకుండానే మరో 40 వేల ఉద్యోగాలంటూ కొత్త రాగమెత్తుకున్నడు మన ముఖ్యమంత్రి. గడిచిన 20 నెలల పాలనలో ముఖ్యమంత్రి తీరుతో అశోక్‌నగర్‌లోని నిరుద్యోగులంతా ఆగ్రహ జ్వాలలు రగిలిస్తున్నారు. రెండేండ్లు కావస్తున్నా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, ప్రశ్నిస్తున్నవారిని అణచివేస్తూ ముఖ్యమంత్రి పైశాచికానందం పొందుతున్నారు. పోలీస్ పహారా లేనిదే క్యాంపస్‌లో అడుగుపెట్టని సీఎం, రాబోయే రోజుల్లో ఒంటరిగా వస్తానని చెప్పడం హాస్యాస్పదం. అరెస్టులు చేయించడంపై ఉన్నంత శ్రద్ధ.. హామీలు నెరవేర్చడంలో ఎందుకు లేదని యావత్తు తెలంగాణ ప్రశ్నిస్తున్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి నిర్బంధాలు కొత్తకాదన్న విషయాన్ని రేవంత్ సర్కార్ గ్రహించాలి. ఏ గడ్డమీదైతే స్వరాష్ట్రం కోసం ప్రాణాలర్పించారో.. అదే గడ్డ మీది నుంచి రేవంత్ సర్కార్ ఉసురుతీయడం ఖాయం.
-రాజు పిల్లనగోయిన
చిత్తశుద్ధిలేని రేవంత్ పర్యటన
ఈ నెల 25న ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన సందర్భంగా ఉన్నత విద్యాభివృద్ధి, నూతన పరిశోధన కేంద్రా లు, నూతన యూనివర్సిటీల ఏర్పాటు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన విజయాలు, విద్యారంగ సమస్యలు, ముఖ్యంగా ఉస్మానియాకు రావలసిన నిధులు, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై మాట్లాడుతారని అందరూ భావించారు. అందుకు తగ్గట్టుగానే విద్యారంగ సమస్యలపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని మీడియాలో ప్రచారం జరిగింది. కానీ దీనికి విరుద్ధంగా ముఖ్యమంత్రి ప్రసంగం కొనసాగింది. విశ్వవిద్యాలయంలో కూడా రోజువారీ రాజకీయ ప్రసంగాన్నే కొనసాగించడం ఉసూరుమనిపించింది.
రాష్ట్రంలో రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో ఒక్క ఓయూకే దాదాపు రూ.80 కోట్లు రావాల్సి ఉంది. బడ్జెట్లో యూనివర్సిటీలకు కేటాయించే నిధులు సిబ్బంది జీతభత్యాలకు కూడా సరిపోవడం లేదు. అన్ని యూనివర్సిటీలలో దాదాపు 90% టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యూనివర్సిటీ హాస్టళ్లు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ర్టంలో జిల్లాకు ఒక యూనివర్సిటీని కేటాయిస్తామని చెప్పి వాటి మీద ఏ మాత్రం ప్రకటన చేయలేదు. యూనివర్సిటీలలో చదువుకున్న విద్యార్థులకు ప్రత్యేకంగా ఫెలోషిప్స్ ఇస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది.
ల్యాప్‌టాప్‌లు అందిస్తామని హామీ ఇచ్చింది. జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ, ఒకవైపు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు ఆందోళన చేస్తుంటే, తమ ప్రభుత్వం వచ్చాక నోటిఫికేషన్లు ఇస్తుంటే వద్దని ఆందోళనలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి అబద్ధాలు మాట్లాడటం విడ్డూరం. సాధారణంగా యూనివర్సిటీలో సీఎం ప్రసంగంలో ఉన్నత విద్య గురించి ఉంటుందనుకుంటే మళ్లీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తెస్తున్నామని ఊదరగొట్టారు. మొత్తానికి ‘విద్యారంగంలో మార్పులు- ప్రణాళిక’ అనే అంశంపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని ప్రకటించి ఉన్నత విద్య గురించి కనీసం ప్రస్తావించకపోవడం తీవ్ర అభ్యంతరకరం. ఉస్మానియా యూనివర్సిటీ యుద్ధభూమి. అనేక ఉద్యమాలు ఇక్కడే పుట్టాయి. పాలకుల ఎత్తులు, జిత్తులను ఓయూ అర్థం చేసుకోగలదు. వారి మెడలను వంచగలదు. కావలసింది సమయం మాత్రమే.
-పి.మహేష్, పీడీఎస్‌యూ జాతీయ నాయకులు
ఓయూపై కపట ప్రేమ
ఉస్మానియా యూనివర్సిటీ అంటే జ్ఞానం, త్యాగం, చైతన్యం, పోరాటం. చదువు మాత్రమే కాదు, విద్యార్థుల్లో చైతన్యం, ఎదిరించే తత్తాన్ని ఓయూ నేర్పుతుంది. రాజ్యం చేసే తప్పులను ఎప్పటికప్పుడు ఎండగట్టి సమాజాన్ని జాగృతం చేస్తుంది. తెలంగాణ ఉద్యమంలోనూ ఓయూ విద్యార్థుల పాత్ర ఎనలేనిది. అంతటి ప్రశస్తి కలిగిన ఉస్మానియా విద్యార్థులను అడ్డా మీద కూలీలు, బీరు, బిర్యానీ తిని అరిగే వరకు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం శోచనీయం. విద్యార్థుల గురించి నోటికొచ్చినట్టు మాట్లాడిన ఆయనకు యూనివర్సిటీలో తిరిగే అర్హత లేదు. సీఎం వస్తున్నారని యూనివర్సిటీ అధికారులు హడావుడి చేశారు. పాత రోడ్లకు, గోడలకు రంగులు వేస్తూ విద్యార్థి సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.
వాస్తవానికి విద్యార్థుల కోసం రూ.80 కోట్లతో అన్ని హంగులతో హాస్టళ్లను గత ప్రభుత్వం నిర్మించింది. వాటిని ప్రారంభించి తాము కట్టినట్టుగా ప్రచారం చేసుకోవడం విడ్డూరం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చింది. మొదటి బడ్జెట్లోనే యూనివర్సిటీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి, వర్సిటీలను అభివృద్ధి చేస్తామని చెప్పింది. దాదాపు రెండేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రత్యేక బడ్జెట్ ఊసే లేదు. యూనివర్సిటీలను పట్టించుకున్న పాపాన పోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యార్థుల నుంచి రూ.5-6 వేల వరకు మెస్ బిల్లు వసూలు చేస్తున్నారు. వీటిని చెల్లించలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అయినా సర్కారు పట్టించుకోవడం లేదు. గురుకులాల మాదిరిగా యూనివర్సిటీల్లోనూ విద్యార్థులకు ఉచితంగా భోజనం పెట్టాలి. దీనిపై శాంతియుతంగా ధర్నా చేసిన దివ్యాంగ విద్యార్థులపై కేసులు పెట్టడం విషాదకరం.
-నాగారం ప్రశాంత్