అంగబలం, అర్థబలం చేతులు కలుపడంతో ప్రజాస్వామ్యం ప్రహసనమైపోయింది. ప్రజాతీర్పు మెడలు వంచేందుకు రౌడీయిజం రెచ్చిపోయింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటు వెన్నుపోటుకు గురైంది. ఓటమి భయంతో కాంగ్రెస్ సర్కార్ అడుగడుగునా అక్రమాలకు పాల్పడింది. అధికార దుర్వినియోగంతో అరాచకత్వానికి తెరతీసింది. నీతి, న్యాయాలను పాతరేసింది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా నోట్లతో, దొంగఓట్లతో గెలవాలని అడ్డదారులు తొక్కింది. ఎన్నికల ప్రచారంలో ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్నెన్ని జిమ్మిక్కులు చేసినా ఓటర్లు తమవైపు మళ్లడం లేదనే అక్కసుతో పోలింగ్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఒక్క సీటు కోసం కాంగ్రెస్ పరివారం యావత్తు ఓటుపై దండయాత్ర సాగించింది. బూత్‌లను ముట్టడించింది.
ఎన్నికల కోడ్ జాంతానై అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు బరితెగించారు. నీతినియమాలకు ఉరిబిగించారు. వీధుల్లో తిరుగుతూ ఓట్ల దందా సాగించారు. విచ్చలవిడిగా డబ్బులు పంచారు. దొంగఓట్లు దగ్గరుండి వేయించారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. వీధుల్లో వీరంగం వేశారు. పోలింగ్ కేంద్రాలను రౌడీ అడ్డాలుగా మార్చారు. పోల్ చిట్టీలతోపాటే బాహాటంగా నగదు, చీరలు పంచుతూ ఓటు పైకి వల విసిరారు. బైండోవర్ అయిన రౌడీషీటర్లు ఓటర్లను భయభ్రాంతులను చేస్తూ బాహాటంగా ఊరేగారు. మరోవైపు నకిలీ ఓటర్లు తండోపతండాలుగా దిగుమతయ్యారు. నకిలీ ఐడీ కార్డులతో ఓటుకు కన్నం వేశారు. అధికార యంత్రాంగం గుడ్డిదర్బారుతో జూబ్లీహిల్స్ కౌరవసభలా మారింది. ప్రజాభీష్టాన్ని పట్టపగలే నడిబజారులో చెరబట్టేందుకు దుశ్శాసనపర్వం యథేచ్ఛగా సాగిపోయింది. పోలీసులూ పాలకపక్షానికే ‘జీహుజూర్ జో హుకుం’ అంటూ సెల్యూట్ కొట్టారు. అన్యాయాన్ని, అక్రమాలను ఎత్తిచూపిన బీఆర్ఎస్ నాయకులను వెనక్కి నెట్టారు. లాఠీలకు పని చెప్పి తరిమికొట్టారు. రౌడీలకు గొడుగుపట్టి స్వామిభక్తి చాటుకున్నారు. ఈ దుర్మార్గాలను ఎన్నికల అధికారులు కళ్లప్పగించి చూశారు. బీఆర్ఎస్ ఫిర్యాదులను చెవికెక్కించుకోకుండా కాంగ్రెస్‌కే అంటకాగారు.
నవంబర్ 11వ తేదీ ప్రజాస్వామ్య చరిత్రలో దుర్దినంగా నిలిచిపోతుంది. జూబ్లీహిల్స్ పోలింగ్ ఎన్నికల అక్రమాలకు నిదర్శనంగా గుర్తుండిపోతుంది. కేవలం ఒక్క సీటు కోసం కాంగ్రెస్ మూకలు ఇంతగా అరాచకత్వానికి ఎందుకు తెగబడ్డాయనే ప్రశ్న సహజంగా తలెత్తుతుంది. ఈ ఒక్క సీటు రాష్ట్రంలో కాంగ్రెస్ రూటునే మార్చేస్తుందనే భయమే అందుకు కారణమని చెప్పుకోవాలి. ఈ ఉపఎన్నిక కాంగ్రెస్ ప్రజావ్యతిరేక పాలనపై జనాభిప్రాయ సేకరణగా నిలుస్తుందని బీఆర్ఎస్ నాయకత్వం విసిరిన సవాలు కాంగ్రెస్ వెన్నులో వణుకు పుట్టించింది. మరోవైపు సర్వేలు బీఆర్ఎస్ విజయం ఖాయమని ముక్తకంఠంతో ఘోషించాయి. వీటన్నిటి ఫలితమే అడ్డదారులూ, అఘాయిత్యాలూ. బీజేపీ ఎన్నికల్లో అవినీతికి పాల్పడుతుందంటూ ఇల్లెక్కి కూసే కాంగ్రెస్ అగ్రనాయకత్వం జూబ్లీహిల్స్ సాక్షిగా జరిగిన ‘ఓట్ చోరీ’పై ఏమంటుంది? బీజేపీ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నదని చెప్పే కాంగ్రెస్ హార్డ్‌వేర్‌కు పనిచెప్పింది. డబ్బు, అధికారం, లాఠీలతో ఓటును లూటీ చేసేందుకు అన్ని విలువలనూ అటకెక్కించింది. రాజ్యాంగాన్ని పట్టుకుని రచ్చరచ్చ చేసే అధిష్ఠానం ఈ అరాచకంపై నోరువిప్పదెందుకు?