సుదీర్ఘ తెలంగాణ ఉద్యమం. వందల మంది బలిదానాలు. వేల మంది అరెస్టులు. లక్షల మంది కవాతు. రాజీనామాలు. ఉప ఎన్నికలు. అవహేళనలు, అపహాస్యాల నడుమ కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష మేరకు ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణను సాధించారు. వచ్చిన తెలంగాణను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న స్పష్టమైన ప్రణాళికతో పదేండ్లు నిరంతరం, నిర్విరామంగా ముందుకువెళ్లి దేశంలో తెలంగాణను అన్నిరంగాల్లో అగ్రభాగాన నిలబెట్టారు.
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం మీద విశ్వాసం కోల్పోయిన రైతు ల్లో రైతుబంధు, రైతు బీమా, ఉచితంగా వ్యవసాయానికి 24 గంటల కరెంటు, పం టల కొనుగోళ్లు వంటి పథకాలు, కార్యక్రమాలతో కేసీఆర్ ఆత్మవిశ్వాసం నింపారు. సాగునీరు, బతుకుదెరువు లేక పట్నం బా ట పట్టి ప్రత్యామ్నాయ ఉపాధి వెతుక్కున్న రైతన్నలకు ‘నేనున్నా’ అంటూ భరోసానిచ్చారు. దాని ఫలితంగానే దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ మారింది.
ప్రాజెక్టులంటే పెండింగ్ అన్న ఆలోచన కు పాతరవేసి ఉమ్మడి రాష్ట్రంలోని పెండిం గ్ ప్రాజెక్టులను పూర్తిచేసి, గోదావరి మీద కాళేశ్వరం ఎత్తిపోతల, కృష్ణా నది మీద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను తలపెట్టి కేవలం మూడున్నరేండ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. కాంగ్రె స్ నేతలు వేసిన వందల కేసులను పరిష్కరించుకుంటూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను 90 శాతం పూర్తి చేశా రు. మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలను పునరుద్ధరించారు. చెరువులు, కుంట ల్లో ఉచితంగా చేపపిల్లలను వదిలి మత్స్యకారుల కుటుంబాల్లో, సబ్సిడీ గొర్రెపిల్లలతో గొల్ల, కురుమల కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలోని ఏ రాష్ట్రంలోనూ తెలంగాణ తొలి ప్రభుత్వం అమలు చేసిన పథకాలు అమలుచేయలేదు. నాటి తెలంగాణ ప్రభుత్వ పథకాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ర్టాలు కూడా కాపీ కొట్టి అమలు చేస్తున్నయంటే దానికి కేసీఆరే కారణం.
‘తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లు కుట్టిందని’ అలవిగాని హామీలను నమ్మి కాంగ్రెస్‌కు ఓటేసిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు నాలుక కరుచుకుంటున్నారు. ‘కుంచాల మ్మ కూడబెడితే మంచాలమ్మ మాయం చేసిందని’ కేవలం పది నెలల కాలంలోనే తెలంగాణలో కేసీఆర్ అమలుచేసిన పథకాలన్నీ మాయమయ్యాయి. అధికారంలోకి వచ్చిన రోజే రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరాకు ఏడాదికి రూ.15 వేల రైతుభరోసా, రూ.4 వేల పింఛన్ ఖాతాలో వేస్తానని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ రైతుభరోసా ఊసే ఎత్తడం లేదు. పింఛన్ల పెంపు ఏమోగానీ రూ.2 వేల ఫించను కూడా మూడు నెలలుగా ఇవ్వడం లేదు. రూ.41 వేల కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉం డగా.. రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసి రుణమాఫీ చేశామని దబాయిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.
కాంగ్రెస్ అబద్ధపు హామీలను కాసేపు పక్కనపెడితే మూసీ ప్రక్షాళనను ముందేసుకొని, హైడ్రాను రంగంలోకి దించి పేదల ఇండ్ల మీదకు బుల్డోజర్లు పంపి నేలమట్టం చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్. తెలంగాణను కేసీఆర్ నిలబెడితే రేవంత్ కూలగొడుతున్నారు. ఒక్కో పథకంతో ఒక్కో రంగాన్ని కేసీఆర్ పటిష్ఠం చేసుకుంటూ పోతే కేవలం పది నెలల్లోనే హైదరాబాద్ ఖ్యాతిని అధఃపాతాళానికి దిగజార్చారు రేవంత్. రూ.1.50 లక్షల కోట్ల మూసీ ప్రక్షాళన ఎవరి ప్రయోజనాల కోసమన్నది తెలంగాణ ప్రజల మదిని తొలుస్తున్న ప్రశ్న?
సంక్షేమ పథకాలు అమలుచేయాలని అడిగితే ‘పండబెట్టి తొక్కుతా’ అని సీఎం రేవంత్ అంటుంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలు తామేం తక్కువ తిన్నామా అన్నట్టు అంతకుమించి మాట్లాడుతున్నారు. హైడ్రాతో జరిగే మేలు ఏంటో తెలియక జనం అల్లాడుతుంటే ఒక ఎమ్మెల్యే పాలకుర్తికి పైడ్రా వస్తుందని, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ నిజామాబాద్‌కు నిడ్రా వస్తుందని చెప్పడం విడ్డూరం. ఇక మంత్రి కొండా సురేఖ వ్యవహారం సర్కారు మెడకు పీకల దాకా చుట్టుకున్నా ‘కిందపడ్డా మీది చెయ్యి నాదే’ అంటూ మూసీ సమీపాన ఉన్న పేదలు వెళ్లిపోవాల్సిందే అంటూ కరాఖండిగా చెప్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత గడ్డం వెంకటస్వామికి గుడిసెల వెంకటస్వామిగా పేరున్నది. అనేకమంది పేదలతో ప్రభుత్వ భూములలో గుడిసెలు వేయించి వారికి పట్టాలిప్పించారని చెప్తుంటారు. ఆయన జయంతి వేదిక మీద పేదల గుడిసెలు కూలుస్తానని ప్రకటించడం రేవంత్‌కే చెల్లింది.
వేదిక ఏదైనా.. సమయం, సందర్భం లేకుండా అనాలోచిత ప్రకటనలు, అనుచిత వ్యాఖ్యలు, అడ్డగోలు బెదిరింపులు తెలంగాణలో నిత్యకృత్యమయ్యాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు వాడుతున్న భాషను చూసి ప్రజలు ఈసడించుకుంటున్నారు. పది నెలల పాలనలో ఒరగబెట్టిందేమీ లేకున్నా, ప్రసంగాల్లో మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వీధి రౌడీల్లా మాట్లాడుతున్న ఆకతాయి మాటలను చూసి సమా జం నివ్వెరపోతున్నది. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు అందరూ కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయినవారే. ‘ఎద్దు ఈనిందంటే.. దూడను కట్టేయమన్నట్టు’ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నడుస్తున్నది. ఈ ఆకతాయి పాలనకు అంతిమ తీర్పు ఇచ్చే రోజు కోసం తెలంగా ణ సమాజం ఎదురుచూస్తున్నది.
-శ్రీధర్ ప్రసాద్