1948 సెప్టెంబర్ 17 అనేది హైదరాబాద్ స్టేట్‌కు విమోచన దినమా? లేదా భారత యూనియన్‌లో విలీనమైన రోజా? లేదా విద్రోహ దినమా? ఇది కొంతకాలంగా చర్చనీయాంశంగా మారుతున్న అంశం. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత రెండేండ్లుగా దీన్ని విమోచన దినంగా జరుపుకొంటున్నది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపగా.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ మాత్రం ప్రజాపాలన దినోత్సవంగా పేర్కొంటున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు ఎంతో ముఖ్యమైన సెప్టెంబర్ 17 వెనకున్న అసలు వాస్తవమేమిటి? ఈ ప్రజా ఉద్యమానికి ఉన్న రాజకీయ వారసత్వ చట్టబద్ధత ఎవరికి సొంతం? అనేది ఇప్పుడు చర్చనీయాంశం.
కమ్యూనిస్టులు, సోషలిస్టులు, రైతు సంఘాల నేతృత్వంలోని రైతులు పోరాటాల ద్వారా సమ్మిళిత భారతదేశ పరిణామంలో కీలకపాత్ర పోషించారు. అనేక రైతాంగ పోరాటాలు చేశారు. కేరళలోని పున్నప్రవాయలార్లో భూసమస్యపై సాగించిన పోరాటాలు, బెంగాల్లో తెభాగ ఉద్యమం, అసోంలో సుర్మా వ్యాలీ పోరాటం, మహారాష్ట్రలో వార్లీ తిరుగుబాటు, భూ సంస్కరణలు, దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ పోరాటం వాటిలో ప్రధానమైనవి.
దేశానికి స్వాతంత్య్రం రాకముందు హైదరాబాద్ రాష్ట్రం రాచరిక పాలనలో ఉండేది. నిజాం నాయకత్వంలోని హైదరాబాద్‌లో పోలీసు పటేల్ (శాంతిభద్రతలు), మాలి పటేల్ (రెవెన్యూ), పట్వారీ (భూ రికార్డులు)లతో కూడిన పాలనావ్యవస్థ ఉండేది. పై స్థాయిలో గిర్దావర్లు, తహశీల్దార్లు, తాలుక్దార్లు ఉండేవారు. వీరు నిజాంకు వీర విధేయులు. హైదరాబాద్ స్టేట్‌లోని నలభై శాతం భూములు నిజాం ఆధీనంలోనే ఉండేవి. భూస్వాముల చేతుల్లో ఉన్న మిగిలిన అరవై శాతం భూముల్లో వెట్టిచాకిరీ చేయించేవారు.
ఈ నేపథ్యంలో 1928లో మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి తదితరుల నాయకత్వంలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది. ఆంధ్ర మహాసభ నేతృత్వంలో రావి నారాయణ రెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్, హసన్ నసీర్, భీంరెడ్డి నరసింహారెడ్డి, మల్లు వెంకట నరసింహారెడ్డి. మల్లు స్వరాజ్యం, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, రాజ్ బహదూర్ గౌర్, బద్దం ఎల్లారెడ్డి, అనభేరి ప్రభాకర్, చెన్నమనేని రాజేశ్వరరావు తదితరులు నిజాం అణచివేతలపై సాయుధ పోరాటం సాగించారు. 1946-51 మధ్యకాలంలో జరిగిన ఈ ఉద్యమంలో 60 వేలమందికి పైగా ఆయుధాలు చేతబట్టి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ పోరులో సుమారు 4,500 మందికి పైగా ప్రాణాలర్పించారు.
ఈ నేపథ్యంలో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత 1948, సెప్టెంబర్ 13న పోలీస్ యాక్షన్ జరిగింది. అనంతరం జనరల్ జేఎన్ చౌధురీ నేతృత్వంలో మిలిటరీ పాలన ప్రారంభమైంది. చౌధురీ అణచివేతల కారణంగా నిజాం వ్యతిరేక పోరాటం కాస్త భారత మిలిటరీతో పోరాటంగా మారింది. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీలో కొత్త చర్చ మొదలైంది. రావి నారాయణరెడ్డి నాయకత్వంలోని సాయుధ దళాలు పోరాటాన్ని విరమించాలని నిర్ణయించుకున్నాయి.
కానీ, అలా చేస్తే ప్రజల్లో విశ్వాసం కోల్పోతామని, ద్రోహులుగా మిగిలిపోతామని మరో వర్గం వాదించింది. అణచివేతలు, అరెస్టుల కారణంగా పోరాటాన్ని నిలిపివేస్తున్నట్టు 1951 అక్టోబర్ 21 సీపీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 17ను మనం విశాలమైన దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉన్నది. నిస్సందేహంగా తెలంగాణ సాయుధ పోరాటం ఫలితంగానే నిజాం పాలన ముగిసి, భారత యూనియన్‌లో హైదరాబాద్ స్టేట్ విలీనమైంది. ‘పోలీస్ యాక్షన్ జరగరపోయినా నిజాంను మేం గద్దె దించేవాళ్లం’ అని రావి నారాయణరెడ్డి స్వయంగా చెప్పారు.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆర్య సమాజ్‌కు గాని, హిందూ మహాసభకు గాని, ఆర్ఎస్ఎస్కు గాని ఎలాంటి పాత్ర లేదు. దశాబ్దాల కిందటి వరకు గంగా జమునా తెహజీబ్లా అన్ని వర్గాలవారు కలసిమెలసి ఉన్న ఈ ప్రాంతంలో మతపరమైన విద్వేషాలు సృష్టించి, వారి ఐక్యతను విచ్ఛిన్నం చేయడమే వారు సాధించింది. ముస్లింల ఊచకోతపై భారత ప్రభుత్వం నియమించిన సుందర్‌లాల్ కమిటీ కూడా ఇదే నివేదించింది.
ఈ ప్రాంతం నిజాం రాజ్యంగా ఉన్నప్పటికీ అది ఏ మతంతోనూ బలమైన బంధం కలిగిలేదు. ఈ నేపథ్యంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన హిందూ భూమిగా తెలంగాణను చిత్రీకరించడం, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌ను తెలంగాణ విముక్త యోధుడిగా చూపించే ఆలోచన బీజేపీ చేస్తున్నది. తెలంగాణ రైతాంగ పోరాటాన్ని ముస్లిం వ్యతిరేక ఉద్యమంగా, భారత యూనియన్‌లో విలీనం చేయడాన్ని విముక్తిగా చూపించే కుట్ర అందులో దాగి ఉన్నది.
ఎన్ని వక్రీకరణలు ఉన్నప్పటికీ, ఏడు దశాబ్దాల కిందట తెలంగాణ రైతాంగ పోరాటం జరిగిందనేది నిస్సందేహంగా వాస్తవం. ఆరు దశాబ్దాల కిందట ‘దున్నేవాడిదే భూమి’ అనే నినాదంతో కమ్యూనిస్టులు పోరాటం సలిపారు. ఐదు దశాబ్దాల కిందట ప్రత్యేక తెలంగాణ కోసం విద్యార్థి ఉద్యమం జరిగింది. నాలుగు దశాబ్దాల కిందట పౌరహక్కుల ఉద్యమానికి కేంద్రబిందువైంది. 1970ల దశకంలో దేశంలో మహిళల హక్కుల సంఘాలు ఏర్పడ్డాయి. ఇలా అన్ని వర్గాలు ప్రత్యేక తెలంగాణ కోసం డిమాండ్ చేసి, సాధించుకున్నాయి.
ఈ నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసం తమ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ఎజెండాలను కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణలో దశలవారీగా అమలు చేయాలని కొన్ని శక్తులు చూస్తున్నాయి. భారతదేశం తన 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఇటీవల జరుపుకొన్న తరుణంలో రాజకీయ, సామాజిక పోరాటాలను మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. లౌకిక, ప్రజాస్వామ్య, రిపబ్లిక్, సమాఖ్య వ్యవస్థలతో కూడిన భారత రాజ్యాంగంపై ఆధారపడి మన రాజకీయ వ్యవస్థ నడుస్తున్నది.
భారత రాజ్యాంగానికి మూలాధారమైన నాలుగు పిల్లర్ల వంటి లౌకిక ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఫెడరలిజం, ఆర్థిక స్వావలంబన ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాయి. ఈ తరుణంలో వాటిని సంరక్షించుకోవడమే ఇప్పుడు ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల శక్తుల ముందున్న అతిపెద్ద సవాల్.
– (వ్యాసకర్త: వేములవాడ మాజీ ఎమ్మెల్యే)