వద్దనుకున్న దృశ్యాలే మళ్లీ మళ్లీ కనిపిస్తున్నాయి. పాత పీడకలలు వాస్తవ రూపం దాల్చి కండ్లముందు తిరుగాడుతున్నాయి. ఎరువుల కోసం రైతులు ఇక్కట్లు పడకూడదని, కరెంటు కోసం అగచాట్లు పడకూడదని తెలంగాణ సమాజం కోరుకున్నది. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలోని ప్రధాన ఆకాంక్ష కూడా ఇదే. కానీ, జరుగుతున్నదేమిటి? యూరియా కోసం రైతుల పడిగాపులు. పెద్ద పెద్ద క్యూ లైన్లు. తోపులాటలు, తొక్కిసలాటలు, పోలీసుల కాపలా, తెల్లవారకముందే వరుసలో నిల్చోవడం, నిలబడే సత్తువ లేక చెప్పులను పెట్టడం.. ఒక్కటేమిటి.. చూసేవారికి కడుపు తరుక్కుపోతున్నది. జడివానలో తడుస్తూ నిల్చోవాల్సి రావడం అన్నింటికన్నా దారుణం.
ఇంత కష్టపడితే చివరికి దక్కేది ఒకే ఒక్క బస్తా. ఏదో రేషన్ ఇచ్చినట్టుగా విదిలింపు. దీని కోసం యుద్ధం చేయాల్సినంత పరిస్థితి. తెలంగాణ ఏర్పడ్డాక రైతుల కష్టాలు తీరి, ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగిన తర్వాత కూడా రైతులకు పాత కష్టాలు ఎదురయ్యాయంటే అందుకు కారణం ప్రస్తుత పాలకులే. ముందుచూపు కొరవడినందు వల్లనే ఇన్ని అవస్థలు పడాల్సి వస్తున్నది. ఏటా మే-జూన్ నెలల్లో వ్యవసాయం పనులు ప్రారంభం కాకముందే ఎరువులను సమకూర్చుకోవాలి. కానీ, ఈ ఏడాది అలా జరగలేదు.
రాష్ర్టాల అవసరాలకు అనుగుణంగా కేంద్రం యూరియాను కేటాయిస్తుంది. అయితే, సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కీలకం. వర్షాలు, నీటి నిల్వలను గమనించి, పంటల సాగు విస్తీర్ణం ఎంత ఉంటుందో అంచనా వేయాలి. దానికి అనుగుణంగా యూరియా ఎంత అవసరమో, ఏయే నెలల్లో దాన్ని పంపించాల్సిన అవసరం ఉంటుందో సమగ్ర ప్రణాళిక రచించాలి. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడం వల్లనే ప్రస్తుత దురవస్థ. దేశంలో తెలంగాణలోనే ఖరీఫ్ సీజన్ అందరికంటే ముందుగానే ప్రారంభమవుతుంది. బోర్లు, నీటి వనరులు ఉన్నచోట జూన్ కన్నా ముందుగానే నారుమళ్లు తయారు చేస్తారు. అందువల్ల తక్కువలో తక్కువగా మే నెల నాటి నుంచే యూరియా సరఫరాపై దృష్టిపెట్టాలి. నెలలవారీగా ఎన్ని టన్నులు కావాలో ముందుగానే తెలియజేస్తే కేంద్రానికి కూడా వెసులుబాటు ఉంటుంది. ఎలాంటి ఒత్తిడి లేకుండా అన్ని రాష్ర్టాలకు సర్దుబాటు చేయగలుగుతుంది. కానీ, రాష్ట్ర సర్కారు అలా చేయలేకపోయింది. తెలంగాణలో జూలై-ఆగస్టు నెలల్లో యూరియా వినియోగం అధికంగా ఉంటుంది. ఆగస్టు నెలలో ప్రతి జిల్లాలో కనీసం 10,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉండేలా చూడాలి. కేసీఆర్ ప్రభుత్వం దాన్ని చేసి చూపింది కూడా. కానీ, ప్రస్తుతం 500-1000 మెట్రిక్ టన్నులకు మించి ఎక్కడా అందుబాటులో లేదు. కారణం.. ప్రణాళికా లోపం.
యూరియా సరఫరాకు సమన్వయకర్తగా వ్యవహరించే మార్క్ఫెడ్ వద్ద ఎల్లప్పుడూ కనీసం 2 లక్షల మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్ కింద నిల్వ చేయాలి. ప్రస్తుతం అది 23 వేల టన్నులకు మించి లేదు. కేంద్రానికి ఎంత ఇండెంట్ పెట్టాలి? ఏయే నెలల్లో ఎంతెంత తీసుకురావాలి? ఏయే జిల్లాలకు పంపాలి? రైలు వ్యాగన్ల అందుబాటు, లోడింగ్, అన్ లోడింగ్ తదితర అంశాలపై కేసీఆర్ సర్కారు స్పష్టమైన ప్లాన్ రూపొందించింది. దాన్ని ప్రస్తుతం పాలకులు అమలు చేయకపోవడంతోనే ఇన్ని సమస్యలు.
ఆగస్టు నాటికి 9.25 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం అందించాల్సి ఉండగా, ఈ ఏడాది మొత్తానికి 6.5 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే కేటాయించింది. ఇంతవరకు సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నులు అందింది. కేటాయింపుల్లోనే 2 లక్షల మెట్రిక్ టన్నుల కొరత ఉంది. ఇచ్చిన దాన్నయినా తీసుకువచ్చే ఏర్పాట్లు కనిపించకపోవడంతో అదును దాటిపోతోందన్న భయం రైతుల్లో కనిపిస్తున్నది. అందుకే రైతులు రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారు.
‘రెండు కోట్ల ఎకరాల మాగాణి తెలంగాణ’ అన్నది కేసీఆర్ ప్రభుత్వం పెట్టుకున్న ఉదాత్త ఆశయం. దానిని అధిగమించిందే తప్ప, వెనకడుగు వేసింది లేదు. గతేడాది 66.78 లక్షల ఎకరాల్లో వరి సాగు వేయగా, ఈ సారి పంట విస్తీర్ణం ఏకంగా 22 లక్షల ఎకరాల మేర తగ్గింది. వర్షాలు ముంచెత్తిన ప్రస్తుత పరిస్థితిలోనూ సాగు విస్తీర్ణం తగ్గడం ఆశ్చర్యకరం. 44 లక్షల ఎకరాలకు కూడా యూరియా సరఫరా కావడం లేదు. ఇది ప్రభుత్వ తప్పిదం తప్ప మరొకటి కాదు. ఇక్కడే కేసీఆర్ యాదికి వస్తారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే సమయానికి రాష్ట్రంలోని అన్ని పంటలకు 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయ్యేది. సరఫరా వ్యవస్థను ఆయన స్వయంగా ఎప్పటికప్పుడు రియల్ టైంలో పర్యవేక్షించేవారు. 2019లో జరిగిన సంఘటనలను ఒక్కసారి గుర్తుకుతెచ్చుకోవాలి.
విశాఖపట్నం ఓడరేవు నుంచి లక్ష మెట్రిక్ టన్నుల యూరియాను తెప్పించి మూడు రోజుల్లోనే తెలంగాణ అంతటా పంపిణీ చేయించారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులతో మాట్లాడి 25 స్పెషల్ గూడ్స్ రైళ్లు ఏర్పాటు చేయించారు. 4,000 లారీల ద్వారా పల్లెపల్లెకు పంపించారు. రైతులకు నష్టం, కష్టం కలగొద్దన్నది ఆయన నిరంతర తపన. ఏప్రిల్-మే నాటికే నిల్వలను సిద్ధం చేయించేవారు. అధికారులను ఢిల్లీకి పంపించి ఏ నెలలో ఎంత మేర పంపించాలన్న ప్రణాళికలు కేంద్రానికి అందేలా చూసేవారు. కేంద్రం నుంచి లిఖితపూర్వక హామీలూ పొందేవారు. అందుకే రైతులు కిరాణా షాపునకు వెళ్లి సరకులు తెచ్చుకున్న రీతిలో ఎరువులు కూడా తెచ్చుకునేవారు.
ఎరువులను పంపిణీ చేసే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను తగిన విధంగా సన్నద్ధం చేయకపోవడం మరో లోపం. ప్రైవేటు డీలర్ల వద్దకు వెళ్తే అవసరం లేని ఎరువులను కూడా అంటగడుతున్నారు. ఒకప్పుడు పొలం గట్ల మీద పడుకున్న రైతులు ఇప్పుడు షాపుల ముందు పడుకోవాల్సి వస్తున్నది. తగినంత యూరియాను అందజేసేందుకు కొత్తగా ప్రణాళికలు, వ్యూహాలు అవసరం లేదు. కేసీఆర్ ప్రభుత్వం సిద్ధం చేసి, అమలు చేసిన విధానాలను అనుసరిస్తే చాలు. తగినంతగా ఇచ్చామని కేంద్రం, ఇవ్వలేదని రాష్ట్రం పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ పోతే రైతులకు ఒరిగేదేమీ ఉండదు. యూరియా ఎంత అవసరం? ఉన్న నిల్వలు ఎంత? కేంద్రం నుంచి ఇంకెంత రావాల్సి ఉంది? వంటి కచ్చితమైన సమాచారాన్ని రైతుల ముందుంచాలి. ప్రస్తుత పరిస్థితిని అత్యవసరమైనదిగా పరిగణించి యుద్ధ ప్రాతిపదికన సరఫరా చేయడంపై దృష్టి సారించాలి. అప్పుడే వారిలో ఆందోళన తగ్గుతుంది.
– (వ్యాసకర్త: బీఆర్ఎస్ సీనియర్ నాయకులు)
గోసుల శ్రీనివాస్ యాదవ్ 98498 16817