సంక్రాంతి అంటే సూర్యుని పండుగ. మకర సంక్రమణం నాడు జరిగే అద్భుతం ప్రకృతి మార్పులకు నెలవుగా ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే సంక్రాంతి అంటే రైతుల పండుగ. పంటలు చేతికందిన తర్వాత వారి ఇండ్లు కళకళలాడే పండుగ. కొత్త ధాన్యపు కమ్మని రుచిని ప్రజలంతా సంబురంగా ఆస్వాదించే పండుగ. సాంకేతిక, వాణిజ్య రంగాల్లో ఎంతగా పైపైకి దూసుకుపోయినా మనది మౌలికంగా వ్యవసాయాధారిత సమాజమే. ఇప్పటికీ అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదీ సాగుబడి రంగమే. అందుకే సంక్రాంతి అనగానే ఎక్కడెక్కడికో వెళ్లినవాళ్లు ఊళ్లకు మళ్లి, తమవాళ్లతో కలిసిమెలిసి పండుగ చేసుకుంటారు. వెలుగులిచ్చే సూర్యునికి, బువ్వను సమకూర్చే భూతల్లికి మొక్కుకునే అచ్చమైన పంటల పండుగ సంక్రాంతి. మూడు రోజుల మహా పండుగ. తొలి రోజు, కాలం చెల్లిపోయిన సరుకును తగులబెట్టే భోగి. మలి రోజు, లోగిళ్లను ముగ్గులతో తీర్చి, పూజలు, విందు, వినోదాలు జరిగే సంక్రాంతి. మూడో రోజు రైతన్నతో పాటుగా ప్రజలందరికీ చేదోడు వాదోడుగా నిలిచే పశువుల కోసం నిర్వహించే కనుమ. ఈ మూడు రోజులూ సంబరాలు అంబరాన్నంటే పండుగ. రైతులతో పాటుగా ఊరిలోని వారందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ.
స్వరాష్ట్ర సాధన తర్వాత సాగు ముఖచిత్రం మారడంతో సంక్రాంతి కొత్త శోభను సంతరించుకున్నది. రైతును రాజును చేసిన కేసీఆర్ చల్లని పాలనలో ఈ పండుగ గొప్ప వైభవాన్ని సంతరించుకున్నది. దండగన్న సాగును పండుగలా మార్చడమే అందుకు కారణం. పెట్టుబడి సాయం అందించడం నుంచి చివరి గింజ వరకూ కొనుగోలు చేయడం దాకా కేసీఆర్ ప్రభుత్వం రైతు కేంద్రంగా అనుసరించిన విధానాలు దేశ విదేశాల్లో శభాసులందుకున్నాయి. అవార్డులు, రివార్డులూ వరించాయి. అప్పుల బాధను తప్పించే అద్వితీయమైన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమై నిలిచింది. ఉచితంగా, 24 గంటలు నాణ్యమైన కరెంటు సరఫరాతో రైతుల గుండెల మీద నుంచి మరోభారం దిగిపోయింది. ఆపై రైతు బీమా భరోసానిచ్చింది. రుణమాఫీ ఉపశమనాన్ని సమకూర్చింది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అవసరమైన మేరకు సకాలంలో అందుబాటులో ఉంచడంతో దుకాణాల దగ్గర తొక్కిసలాట పాత ముచ్చట అయిపోయింది. తెలంగాణ నీటి గోసకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులు కరవు నేలను కళకళలాడేలా చేసింది. కాళేశ్వరం వంటి ప్రపంచ దిగ్గజ ఎత్తిపోతలతో ఎత్తుగడ్డపైకి నీరు పారింది. తెలంగాణ సాగు తీరు మారింది. చెరువులు, కాల్వలు, ప్రాజెక్టుల్లో జల వనరులు నిండాయి. పంటలు దండిగా పండాయి. ఆపై కొనుగోళ్లలో అన్ని రకాలుగా కేసీఆర్ సర్కారు అండగా నిలిచింది. ఉద్యమ ప్రాతిపదికన గోదాములు కట్టించింది. రైతుబంధు కింద రైతుల ఖాతాల్లోకి డబ్బు నేరుగా జమ చేసింది. ఈ అనుకూల విధానాలు రైతుల జీవితాల్లో అపూర్వమైన మార్పులు తెచ్చాయి. ఫలితంగా సంక్రాంతి సంబరాలు తొమ్మిదిన్నరేండ్లుగా ఏటికేడు మిన్నంటుతూ వచ్చాయి.
ఇపుడు కల్లబొల్లి కబుర్ల కాంగ్రెస్ పాలనలో ఈ సంబురాలన్నీ తారుమారయ్యాయి. రైతును రాష్ట్ర విభజనకు ముందు నాటి సమస్యలు చుట్టుముట్టాయి. దారుణ మోసంగా రుణమాఫీ మిగిలింది. రైతు బంధును పెంచడం లేదు, ఉన్నది సరిగా పంచడం లేదు. ఎరువుకు కరువు. విత్తనాలు దొరుకవు. దుకాణాల దగ్గర యుద్ధ పరిస్థితి. ఇదేమి చోద్యం అని ప్రశ్నించిన రైతులపై పోలీసు లాఠీలు విరుగుతున్నాయి. కేసీఆర్ మీద అక్కసుతో ప్రాజెక్టులను పడావు పెడుతుండటంతో నీటి గోస మొదలైంది. పంటలకు నీరు పెట్టలేక పశువుల మేతకు వదిలే గడ్డు రోజులు దాపురించాయి. ఇక ధాన్యం, పత్తి అమ్మకం అగ్నిపరీక్షగా మారింది. అరకొర కొనుగోళ్లతో ఆసాములకు అడ్డికి పావు శేరుగా అమ్ముకోవాల్సి వస్తున్నది. ఇలా సమస్యల సుడిగుండంలో రైతు చిక్కుకుంటే కర్షకుల పండుగకు శోభ ఎక్కడ నుంచి వస్తుంది? ఒక్క రైతులే కాదు, యువత ఉద్యోగాల కోసం, పండుటాకులు పింఛన్ల కోసం, ఆడబిడ్డలు కల్యాణలక్ష్మి కోసం ఎదురు చూడటం తప్ప మరేమీ లేదు. అందుకే గ్రామసీమల్లో సంక్రాంతి సంబురాలు మసకబారాయి.