Telangana | ఎన్నికల ఏరు దాటాక నిస్సిగ్గుగా, హామీల తెప్పను తగలేస్తున్నవారిలో మోదీ, చంద్రబాబు, రేవంత్ వగైరాలను అగ్రగణ్యులుగా చెప్పుకుంటూ ప్రజలు వాపోతున్నారు. చేతులు కాలాక ఆకులను పట్టుకోవడమంటే ఇదే మరి. ఇచ్చిన హామీలను చెప్పిన సమయంలోపు నెరవేర్చని పాలకులను గద్దె దించే హక్కును ప్రజలకిచ్చే చట్టం రానంతవరకు చీటింగ్ నేతల హవా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే, భారతీయ/మానవీయ సంస్కృతి చీటింగ్‌ను నేరంగా, చీటర్స్‌ను నేరస్థులుగా పరిగణిస్తుంది. కానీ, ప్రపంచీకరణ, కార్పొరేటీకరణ సంస్కృతి ‘చీటింగ్’ను ‘టాలెంట్’గా, ‘చీటర్స్’ను నిపుణులుగా భావిస్తున్నది. అందువల్లనే చీటింగ్ (అబద్ధాల హామీలు)తో గద్దెనెక్కిన సదరు నేతలు, కార్పొరేట్ మీడియా అండతో ‘విజనరీ నేతలు’గా చెలామణి కాగలుగుతున్నారు.
భావోద్వేగాలతో మైకం కమ్మించి మెజారిటీ ఓటర్లను సమీకరించుకునేందుకు మోదీకి, బాబుకు, రేవంత్‌కు రకరకాల సమ్మోహనాస్ర్తాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు వాళ్ల పాలనా అనుభవాలను గుర్తుంచుకొని, ఇకనుంచైనా, ఆకర్షణీయ హామీలకు, కుల, మత, భావోద్వేగాలకు లోనుకాకుండా సంయమనం పాటించాలి. గత, ప్రస్తుత ప్రభుత్వాలను, నేతలను బేరీజు వేసుకొని మీడియా, సోషల్ మీడియాలతో కాకుండా సొంత బుద్ధితో, స్వానుభవంతో ‘ప్రోగ్రెసివ్ పార్టీ’ని, ప్లానింగ్ నేతలను గుర్తించి ఎన్నుకోవటమే ప్రజలకు శ్రీరామరక్ష.
కార్పొరేట్ మీడియాకు సామాన్య ప్రజలు ప్రభావితులై అపమార్గం పట్టకుండా, వాళ్లకు సరైన దిశానిర్దేశం చేయాల్సిన సామాజిక కర్తవ్యాన్ని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, విస్మరించకుందురుగాక. ఎందుకంటే, ‘నంది’ని, ‘పంది’గా – ‘పంది’ని, ‘నంది’గా చేయగలిగినంత శక్తిమంతమైనది మీడియా! అందుకు నిదర్శనాలు 1.మీడియా అండతోనే, చేరదీసిన ఎన్టీఆర్‌ను నెట్టేసి సీఎం కాగలిగాడు చంద్రబాబు. 2.మీడియా అండ లేనందువల్లనే చేరదీసిన జయలలితను ఆస్పత్రి పాలుచేసినా సీఎం కాలేకపోయింది శశికళ. 3.అతి స్వల్పకాలంలో అనన్య సామాన్యమైన అభివృద్ధిని సాధించిన ‘ప్రోగ్రెసివ్ పార్టీ బీఆర్ఎస్’ మీడియా, సోషల్ మీడియాలను తేలికగా తీసుకున్నందునే ఓటమి పాలైంది. 4. కనీసం మంత్రి కూడా కాని రేవంత్‌రెడ్డి మీడియా, సోషల్ మీడియాల అండదండలతోనే ఏకంగా ముఖ్యమంత్రి కాగలిగాడు.
సీఎం రేవంత్ వాగ్దానాలను ఒకసారి చూద్దాం. 1.గత ప్రభుత్వం తెలంగాణను అప్పుల పాల్జేసిందని, తమకు అధికారం కట్టబెడితే తెలంగాణను ప్రగతిపథాన పరుగెత్తిస్తానని రేవంత్ అన్నాడు. కానీ, కొన్ని నెలల్లోనే, రూ.70 వేల కోట్ల అప్పుల కుప్పను ఆయన ప్రజల నెత్తిన పెట్టాడు. 2. తనను గెలిపిస్తే, ఆరు గ్యారెంటీలు, 60 హామీలతో పాటు, ఏక్‌దమ్మున ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు. 3.కౌలు రైతులతో సహా అందరికీ రూ.15 వేల చొప్పున రైతుభరోసా ఇస్తానని చెప్పాడు. 4.అప్పులేని రైతులు, గతంలో రుణమాఫీ అయిన రైతులు గూడ, ఇప్పటికిప్పుడు బ్యాంకులకు వెళ్లి రూ.2 లక్షలు తెచ్చుకోవాలని, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రుణాలన్నీ మాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు.
షరతులు లేని రుణమాఫీహామీనిచ్చి గద్దెనెక్కిన రేవంత్.. రూ.49 వేల కోట్ల రుణాలను, షరతులతో రూ.31 వేల కోట్లకు కుదించి, రూ.17 వేల కోట్లతో చేతులు దులుపుకొన్నాడు. వానకాలపు పంట సీజన్ అయిపోతున్నది. రైతుబంధు లేదు, ఫ్రీ బస్ తప్ప 60 హామీల జాడలేదు, అమలు కోసం నిలదీస్తున్న ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇదిగో ప్రజాపాలన శ్వేతపత్రం, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ అంటూ ప్రచార ఆర్భాటం చేస్తున్నాడు. ఏపీలోనూ సేమ్ టూ సేమ్. చంద్రబాబు ఏకంగా తిరుపతి లడ్డూ పేరిట ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాడు.
చంద్రబాబు తనవాళ్ల భూముల అభివృద్ధి కోసం హైటెక్ సిటీని అభివృద్ధి చేసుకున్నట్టే.. తన వాళ్ల భూముల విలువ పెంచేందుకు రేవంత్ ఫోర్త్ సిటీని డెవలప్ చేసుకుంటున్నాడనీ, మద్దతు కోసమే అనుకూల జర్నలిస్టులకు అక్కడ ఇండ్ల స్థలాలు కేటాయిస్తున్నాడనీ చాలామంది అంటున్నారు. హైడ్రా పేరిట సామాన్యుల ఇండ్లను కూల్చుతూ, బడా బాబులను నోటిసులతో భయపెడుతూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఆ బెదిరింపుతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేసుకుంటున్నాడనీ ఆబాలగోపాలం గగ్గోలు పెడుతున్నది. రాష్ట్ర, దేశ ప్రజలెంత గగ్గోలు పెట్టినా, ఎన్ని శాపనార్థాలు పెట్టినా, ఈ రాష్ట్రం, దేశం మరింత అప్పులపాలవటం తప్ప ఐదేండ్ల దాకా తమకు ఢోకా లేదని సదరు నేతలకు తెలుసు. వాళ్ల ధీమాకు, దూకుడుకు కారణమదే మరి. ప్రపంచీకరణ సంస్కృతి ప్రవాహంలో కొట్టుకుపోతున్న మోదీ, బాబు, రేవంత్ వగైరాలకు రాజకీయ లాభ దృక్పథమే తప్ప మానవీయ కోణం బొత్తిగా ఉండదు. పేదలు, అన్నదాతల పట్ల వాళ్ల వైఖరే అందుకు నిదర్శనం.
కానీ వాస్తవమేమంటే… అందరి ప్రాణాలకు ఆధారం అన్నం. అన్నాన్ని పండించి అందర్ని బతికిస్తున్నది అన్నదాత. ఆ అన్నదాత కన్నీరు దేశానికి అరిష్టం. అన్నదాతల ఆత్మహత్యలు మానవజాతికే అవమానం. ఈ వాస్తవాన్ని గుర్తించిన నేతల్లో కేసీఆర్ కూడా ఒకరు. అందుకే గద్దెనెక్కిన వెంటనే మిషన్ కాకతీయ, వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు, రైతుబంధు- రైతుబీమా వగైరాలతో అన్నదాతలకు కొండంత భరోసాను కలిగించారు. తద్వారా తొమ్మిదేండ్లలో ఆకలి తెలంగాణను ‘అన్నపూర్ణ’గా, భారత ధాన్యాగారంగా రూపొందించారు. అంతేకాదు, ప్రపంచంలోని వ్యవసాయాధారిత దేశాల అభివృద్ధి మార్గాలను అధ్యయనం చేస్తూ, స్వామినాథన్ వంటి సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్తల సహకారంతో, తెలంగాణ ప్రగతి సాధనకు తనదంటూ ఒక ప్రణాళికను రూపొందించుకున్నారు కేసీఆర్. అదే ‘వ్యవసాయాధారిత తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి ప్రణాళిక’. ఈ ప్రణాళికతోనే రష్యాను స్టాలిన్, చైనాను డెంగ్ సియావో పింగ్ అమెరికాకు దీటైన అగ్రరాజ్యాలుగా రూపొందించారు. అలాగే తెలంగాణను భారతాగ్ర రాష్ర్టాల్లో ఒకటిగా కేసీఆర్ తీర్చిదిద్దారు. దటీజ్ కేసీఆర్.
అందువల్లనే దేశవ్యాప్తంగా సామాజిక స్పృహ గల మేధావులంతా ‘ది ప్రోగ్రెసివ్ పార్టీ బీఆర్ఎస్’, ‘ది బెస్ట్ ప్లానింగ్ లీడర్ కేసీఆర్’ అంటూ ప్రశంసలు కురిపించారు. భారతీయ అన్నదాతలంతా ‘దేశ్‌కీ నేత కేసీఆర్’ అంటూ ఆత్మీయంగా స్వాగతించారు. కానీ, పరిస్థితి మారింది. ‘అభాండాల, అబద్ధాల వాగ్దాన కర్ణుని హామీలకు ఆశపడి, తినే అన్నం పళ్లెంలో చేతులు కడుక్కున్న దురదృష్టవంతులం’ అంటూ తెలంగాణ ప్రజలు నేడు వాపోతున్నారు.
ప్రస్తుతం కష్టాల్లో కూరుకుపోయిన అన్నదాతలతో సహా వివిధ రంగాల తెలంగాణ ప్రజలకు అండగా నిలుస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. 1.కార్మికులు, కర్షకుల కోసం పోరాడే కమ్యూనిస్టులను ముందుచూపుతో లోబరుచుకుంది రేవంత్ ప్రభుత్వం. అందుకే కనీసం నోరు మెదుపలేకపోతున్నారు కమ్యూనిస్టులు. 2.ఇక బీజేపీని సవాలు చేసే సత్తా గల కేసీఆర్, కేటీఆర్, కేజ్రీవాల్ వగైరాలను తొక్కేయాలన్నదే మోదీ ఆంతర్యం. అందుకే గత ఎన్నికల్లో తానోడి, పరోక్షంగా రేవంత్ గెలుపునకు కృషిచేసింది బీజేపీ. ఇప్పటికీ ప్రత్యక్షంగా చంద్రబాబుతో, పరోక్షంగా రేవంత్‌తో రాజకీయ వ్యాపారం చేస్తున్నది బీజేపీ.
తెలంగాణలో రేవంత్, ఏపీలో బాబు ఏం చేస్తున్నా బీజేపీ మౌనంగా ఉండటమే అందుకు నిదర్శనం. 3.జాతీయ కాంగ్రెస్‌కు భిన్నంగా రేవంత్ అదానీని చేరదీసినా కాంగ్రెస్ మ్యానిఫెస్టోకు భిన్నంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేసుకుంటున్నా, హైడ్రాతో సామాన్య ప్రజలతో హాహాకారాలు పెట్టిస్తున్నా సరే, కాంగ్రెస్ అధిష్ఠానం చేష్టలుడిగి చూస్తున్నది. ఉత్తర భారతాన ఎన్నికల కోసం కాంగ్రెస్‌కు నిధులను రేవంత్ సమకూర్చుతుండటమే అందుకు కారణం. ప్రస్తుత దురదృష్టకర పరిస్థితికి తల్లడిల్లిపోతున్న అన్నదాతలతో సహా వివిధ వర్గాల ప్రజలందరికీ ఆశాజ్యోతిలా కనిపిస్తున్నది బీఆర్ఎస్. అందుకే బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసుకోవటమే తెలంగాణ ప్రజల ముందున్న ఏకైక పరిష్కారం.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
పాతూరి వేంకటేశ్వరరావు
98490 81889