డిసెంబర్ 7తో ఏడాది పూర్తి చేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై మీడియా స్పందన ఇప్పుడు చర్చనీయాంశమే. కాంగ్రెస్ పాలన, నిర్ణయాలపై విశ్లేషకులు తమ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తున్నా… ఏడాది అనేది ఒక మైలురాయి. అందుకే, తెలంగాణలో గత పాలనకు, ప్రస్తుత పాలనకు ఉన్న వ్యత్యాసాలపై చర్చించుకొనే సమయం ఇది.
ఏ కొత్త ప్రభుత్వానికైనా తొలి ఏడాది కీలకమైనది. ఎన్నికల్లో గెలిపించిన ప్రభుత్వం తీసుకొనే ప్రతి నిర్ణయంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు.
కొత్త ఉత్సాహంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ప్రజల్లో ఉన్న అనుకూల ముద్రను కాపాడుకునేందుకు తాపత్రయపడతాయి.
డిసెంబర్ తొలి రెండు వారాల్లో చాలా పత్రికలు రేవంత్ ఏడాది పాలనపై ప్రత్యే క కథనాలు ప్రచురించాయి. తాము 21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, 55 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 42 లక్షల గృహిణులకు రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నది. అయితే, ఇవి అర్ధ సత్యాలే.
రైతు రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ, రైతుభరోసా లాంటివి సంపూర్ణంగా అమలు కాలేదు. వీటిలో కొన్ని సగం కూడా పూర్తికాకపోగా మరికొ న్ని మొదలే కాలేదు. స్త్రీలకు నెలకు రూ.2,500, వృద్ధాప్య పింఛను రూ.4,000 హామీ ఊసే లేదు. నెలవారీగా ఇచ్చే ఆర్థికసాయం వెంటనే ఇస్తే ఆ హామీకి పరమార్థం ఉంటుంది. రేవంత్‌కు పాలనతో పాటు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ప్రసన్నంగా ఉంచడమూ కీలకం. ‘గాంధీ’ల మనసు మారిందంటే పదవికి మంగళమే. అందుకోసం చిన్న విషయానికీ ఢిల్లీ వెళ్లడం, తెలంగాణలో ఆ తల్లీ కొడుకులకు మర్యాద తగ్గకుండా చూసుకోవడం ఆయనకు అతి ముఖ్యమైనదని ఒక పత్రిక పేర్కొన్నది.
‘పాలనను అంచనా వేయడానికి ఒక ఏడాదికాలం తక్కువే అయినా కాంగ్రెస్ హామీల దృష్ట్యా ఇది కీలకమే’ అని ది హిందూ అభిప్రాయపడింది. మాజీ సీఎం కేసీఆర్‌పై పలు ఆరోపణలు చేస్తూ ఎన్నికల్లో నెగ్గిన రేవంత్‌రెడ్డి తానేంటో నిరూపించుకొనే సమయమిదేనని.. ఆర్థిక హామీ లు నెరవేర్చడంలో విఫలమవుతూ, గత ప్రభు త్వం రాష్ర్టాన్ని అప్పుల్లో ముంచిందనే నెపంతో కాలహరణ చేయడం తగదని ఈ పత్రిక పేర్కొన్న ది. హామీల పట్ల నిబద్ధత, పాలనాపరమైన విధి విధానాల్లో పారదర్శకత లోపించిందని, రాబో యే నాలుగేండ్లు మరింత కఠినంగా గడుస్తాయని కూడా ఇందులో పేర్కొన్నది.
‘రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఎన్నికల హామీ ల విషయంలో ప్రధాన ప్రతిపక్షం నుంచి నిరంత ర విమర్శలను ఎదుర్కోక తప్పలేదు’ అని హిం దుస్థాన్ టైమ్స్ రాసింది. అయితే, ‘బయటినుం చి కాకుండా కాంగ్రెస్ సీనియర్ నేతలతోనే ఆయన కు ప్రమాదం పొంచి ఉన్నది. గతంలో మంత్రులుగా పనిచేసిన వారిని పక్కనబెట్టి ఎన్నడూ మం త్రి పదవి చేపట్టని రేవంత్‌ను ఏకంగా సీఎం కుర్చీపై కూర్చోబెట్టడం అరుదైన సందర్భమే. ఆ కొనసాగింపుపై అధిష్ఠాన దీవెనలు ఆయనకు ముఖ్యం. ఆ వైపు కూడా రేవంత్ ఏ మాత్రం తగ్గని విధేయత ప్రదర్శిస్తున్నారు. తోటి మంత్రులతోనే కాకుండా అధికారులతో కూడా రేవంత్‌కు తగిన సహకారం అవసరం. గత పదేండ్లు కేసీఆర్ నమూనా పాలనలో కొనసాగిన అధికారులు రేవంత్ పట్టాలపై ఎక్కేందుకు సమయం పడుతుంది. ప్రత్యేకంగా ఆర్థిక, ప్రణాళిక శాఖల్లో పనిచేస్తున్న అధికారులకు రేవంత్ హామీల సాధ్యాసాధ్యాలపై అవగాహన ఉంటుంది. హామీల ప్రాధాన్యతాక్రమంపై వారి సలహాలు అవసరం’ అని ఈ పత్రిక పేర్కొన్నది.
‘ఏడాది పాలనలో రేవంత్‌రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయం, హామీ అమలు ఏదైనా నిజాయితీగా, విమర్శలు లేకుండా సాగడం లేదు. అసంపూర్ణ రైతు రుణమాఫీ, రైతు భరోసా వాయిదాలు ప్రభుత్వంపై ప్రజల నమ్మకం సన్నగిల్లేలా చేస్తున్నాయి’ అని ఒక ప్రముఖ తెలుగు ఛానల్ పేర్కొన్నది. ‘పార్టీ పరంగా రేవంత్‌రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వపరంగా ప్రజల్లో అసంతృప్తి తలెత్తకుండా చూడటంలో మాత్రం విఫలమయ్యారు. పాత ప్రభుత్వం అమలుచేసిన పథకాల ను కొనసాగిస్తూ కొత్త పథకాల అమలు చేస్తే ప్రజ లు హర్షిస్తారు గాని, అమల్లో ఉన్న పథకాలను నిలిపివేసి కొత్తగా ఎన్ని పథకాలు అమలుచేసినా ప్రజ లు సంతృప్తి చెందరు’ అని ఒక పత్రిక పేర్కొన్నది. ‘ఉన్న నిధులన్నింటినీ రైతు రుణమాఫీకి మళ్లించడం వల్ల మరిన్ని పథకాలకు నిధుల కొరత ఏర్పడింది. ఫలితంగా ఎన్నో హామీలు నిలిచిపోయా యి. దీనిపై ప్రజల్లో, ముఖ్యంగా రైతుల్లో అసంతృప్తి నెలకొన్నది’ అని మరో పత్రిక విశ్లేషించింది.
‘హైడ్రా ఏర్పాటు రేవంత్ పాలనలో ఓ తొందరపాటు చర్య. చెరువులు, కుంటల పరిరక్షణ అవసరమే. కానీ, ఆ సాకుతో పేదల ఇండ్ల కూల్చివేత మొదలైన నాటి నుంచి ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. చేతనైతే అన్ని పార్టీల నేతల, ప్రముఖుల ఫాంహౌజ్‌లను ముందు నేలమట్టం చేయాలి. మూసీ ప్రక్షాళన, హైడ్రా వంటి ఆపరేషన్లను ఒకే పర్యాయం అమలు చేయాలనుకోవడమే ప్రభు త్వం చేసిన తప్పు. లక్ష్యం ఎంత మంచిదైనా దా న్ని చేరుకోవడానికి ఎంచుకొనే మార్గం కూడా పారదర్శకంగా ఉండాలి’ అని ఒక పత్రిక సీఎం తప్పొప్పులను అంచనా వేసింది.
‘సీఎంగా రేవంత్‌రెడ్డి ముందుగా తన భాషను మార్చుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాడిన భాషనే ఇప్పుడు కూడా వాడితే ప్రజలు హర్షించరు. తనను తాను సవరించుకుంటే బాగుంటుంది’ అని ఒక పత్రిక సూచించింది.
‘సున్నా మార్కులు వచ్చిన విద్యార్థికి సబ్జెక్టు తెలియనట్టే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని రేవంత్‌రెడ్డికి రాష్ట్ర అవసరాలు తెలియవు. వచ్చిన అవకాశాన్ని వినియోగించకుండా తెలంగాణ అధికారిక చిహ్నాల మార్పునకు తలపడడం మంచిది కాదు. తెలంగాణ తల్లి మార్పును ఒక ఔట్‌సైడర్ దాడిగా భావించక తప్పదు’ అని ఓ ఛానల్లో చర్చ జరిగింది. రేవంత్ రెడ్ది ఏడాది పాలనలో హామీల అమలులో సందిగ్ధత, హైడ్రా లాంటి తొందరపాట్లు, సాటి నేతల పట్ల దురుసు భాష అనే అంశాలు అన్ని వేదికలపై ప్రస్తావించబడ్డాయి. ఈ విషయాలపై ప్రభుత్వం సమీక్షించుకొని, సవరించుకుంటే ఓట్లేసిన ప్రజలు హర్షిస్తారు.
-నర్సన్ బద్రి
94401 28169