‘పల్లెటూరు మన భాగ్యసీమరా.. పాడి పంటలకు లోటు లేదురా..’ అనే పాట పాతబడిపోయింది. భాగ్యనగరం చుట్టూ పచ్చదనం పోయి పొగ గొట్టాలతో ఆకాశం కారుమబ్బుల్లో చిక్కుకునేలా ఉంది. పారిశ్రామికీకరణ ఫలితంగా రైతు పడే బాధలను ‘దో బీఘా జమీన్’ సినిమాలో బిమల్ రాయ్ ఆనాడే చూయించారు. ఫ్యాక్టరీకి తన స్థలం పోకుండా తిప్పలు పడిన రైతుకు చివరికి భంగపాటే మిగులుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లి తెలంగాణలో లక్షాఎనభై వేల కోట్ల రూపాయలతో విలువైన పరిశ్రమల స్థాపనకు ఒప్పందాలు కుదుర్చుకొని వచ్చాక రేపటి తెలంగాణ రూపం గురించి మన రైతులకు అలాంటి భయమే పట్టుకున్నది.
సీఎం రేవంత్ తీసుకువచ్చిన ఒప్పందాలకు సరిపడా నేల ప్రభుత్వం దగ్గర ఉన్నదా లేక రైతుల పంట పొలాలే ఆయనకు అప్పగించాలా అనేది నేడు ప్రధా న సమస్య. ప్రజల అంగీకారం లేకుండా భూసేకరణ చేయడం చట్టబద్ధం కాదు. ఈ నేపథ్యంలో కొత్తగా తెచ్చిన ఒప్పందాలపై ప్రభుత్వ సంబురం చూస్తుంటే పల్లెలు రణరంగాలు అయ్యేకాలం దగ్గరలోనే ఉన్నట్టు అనిపిస్తున్నది.
ఇదివరకటి కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. పంట భూములకు నీటి సౌకర్యం కోసం ఎంతో కృషిచేసింది. 2014 నుంచి వివిధ నీటి పారుదల ప్రాజెక్టుల కోసం రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసింది. దానివల్ల పంటల వైవిధ్యం, విస్తీర్ణం పెరిగింది. 2014లో 62 లక్షల ఎకరాలకు సాగు నీరందితే 2023 నాటికి ఆ విస్తీర్ణం కోటి 35 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే కొత్తగా 70 లక్షల ఎకరాలకు కొత్తగా నిర్మించిన 24 ప్రాజెక్టుల ద్వారా నీటి వసతి కల్పించబడింది. వరి దిగుబడి 2014లో 68 లక్షల మెట్రిక్ టన్నులుంటే 2023 నాటికి 2 కోట్ల 49 లక్షల టన్నులకు చేరింది. గ్రౌండ్ వాటర్ లెవెల్ 56 శాతం పెరిగింది. నిజానికి గత పదేండ్లలో సాధించిన వ్యవసాయ ప్రగతి ఇంకా ముందుకుసాగాలి. దీనికి భిన్నంగా పరిశ్రమలకు ఆ నేలను వినియోగిస్తే ఇంత ఖర్చు, శ్రమ వృథా అయిపోతాయి.
పంట చేలు కాకుండా ప్రభుత్వం దగ్గర ఉన్న అదనపు భూములను పరిశ్రమలకు కేటాయించాలి. ముందుగా దాని లెక్క తేలాలి. ఆ విస్తీర్ణం, సౌకర్యాలు దృష్టిలో పెట్టుకొనే ఈ ఒప్పందాలు చేసుకోవాలి. రైతుల అధీనంలో పంటలకు వీలుకాని చౌడు భూములేమైనా ఉండే వారి అంగీకారంతో వాటిని సేకరించాలి. కోరుకున్న ధర, పిల్లలకు ఉద్యోగాలు అనే భ్రమలు కల్పించి లేదా బెదిరించి భూములు తీసుకుంటే రైతులు కొత్త కష్టాల్లో చిక్కుకుంటారు. నివాస భూమి, సాగు, ఉద్యానం, అడవి ఇలా భిన్న అవసరాల కోణంలో నేలను విభజించి పరిశ్రమలకు వీలుగా ఎంత లభ్యత ఉన్నదో సర్వే చేయాలి. ఒకవేళ ప్రభుత్వం వద్ద ఇప్పటికే ఆ గణాంకాలుంటే బయటపెట్టాలి. ఒప్పందాలు చేసుకొని వచ్చి మీ భూములు కావాలని రైతులపై ఒత్తిడి తెస్తే లగచర్ల తిరుగుబాటు అంతటికి విస్తరించవచ్చు.
పరిశ్రమలకు రవాణా, నీరు, వనరుల లభ్యత ప్రధాన అవసరాలు. నగరం చుట్టూ ఉన్న భూములనే పారిశ్రామికవేత్తలు కోరుకుంటారు. అందుకు హైదరాబాద్ చుట్టూ ఉన్న వందల గ్రామాలు ఖాళీ చేయించి వారిని దూర ప్రాంతాలకు తరలించే పరిస్థితి రావద్దు. అందుకు వారు ఒప్పుకొనే అవకా శం లేదు. ఒప్పుకొన్నవారికి నగరం మార్కెట్ ధర ప్రకారం వారికి పట్టణ ప్రాంతాల్లో ఎక్కు వ భూమిని ఇవ్వవలసి వస్తుంది. సాగు, నివాసం కొత్తగా ఏర్పాటుచేయాలి. నగరం చుట్టూ పరిశ్రమలు విస్తరిస్తే కాలుష్యం పెరుగుతుంది. ఇప్పటికే వాహన విష ఉద్గారాలతో నగరజీవుల ఆరోగ్యం దెబ్బతింటున్నది. ఫోర్త్ సిటీని నెట్ జీరోగా ఉంచితే మిగతా మూడు నగరాల ప్రజల పరిస్థితి మరింత దిగజారుతున్నది. దానికి ప్రత్యామ్నాయాలు సర్కారు ఏర్పాటుచేయాలి.
పంట భూములన్నీ పరిశ్రమలకు కట్టబె ట్టి, రైతు కుటుంబాలను రోడ్డున పడేయడం అభివృద్ధి కాదు. ఆ పరిశ్రమల్లో కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చినా.. అదేదో వాచ్మెన్ లాంటిదే ఉంటుంది. ఎందుకంటే, ఆ పరిశ్రమలకు అవసరమయ్యే నైపుణ్యాలు గల వాళ్లు ఆ కుటుంబాల్లో ఉండరు. ప్రైవేట్ రంగానికి ఎప్పుడూ సొంత ప్రయోజనాలే ప్రధానం. ఇచ్చిన మాట నిలుపుకోదు. అనంతపురంలోని కియా కార్ల ఫ్యాక్టరీ భూములు కోల్పోయినవారికి ఉపాధి కల్పించకుండా ఇప్పటికీ తిప్పుకొంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా కంపెనీ ఉద్యోగాల విషయానికొస్తే ఉద్యోగ భద్రత అసలే ఉండదు. పని గంటలు వారిష్టమే. మన కార్మిక చట్టాలు, ఉద్యోగ సం ఘాలు అక్కడ చెల్లవు. కంపెనీ ఉద్యోగం అనగానే సంబురపడేంత సీనేమీ అక్కడ లేదు.
ఒకప్పుడు నగరం చుట్టూ పండ్ల తోటలు, కూరగాయలు, పూల సాగు ఉండేది. ఇప్పుడు వందల కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ చుట్టూ ఉన్న ఎన్నో గ్రామాల వ్యవసాయ భూములు ఐటీ పరిశ్రమలకు ధారాదత్తమయ్యాయి. వాటివల్ల గ్రామీణులకు దక్కింది కూలి బతుకే. చెన్నై, ముంబై మాదిరిగా హైదరాబాద్ పారిశ్రామిక కేంద్రంగా మారితే భాగ్యనగర శోభ నే మంటగలిసిపోతుంది. నగర పచ్చదనం, చుట్టూ అడవి, పంటలు కోటి మందికి ప్రాణవాయువును అందిస్తున్నాయి. అంతకుమించి ప్రయోజనం ప్రజలు ఆశించడం లేదు. దావోస్లో జరిగిన డబ్ల్యూఈఎఫ్ వార్షిక సదస్సుకు మన దేశం నుంచి మూడు రాష్ర్టాల సీఎంలే పాల్గొన్నారు. తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర ఇందులో ప్రాతినిధ్యం వహించింది. దేశంలోని మిగతా రాష్ర్టాల పెద్దలు ఈ సదస్సులకు ఎందుకు వెళ్లలేదు, వెళ్తే వారికి కూడా ఒప్పందాలు దొరికేవి కదా! సాగుభూమి రక్షణ, కాలుష్య నియంత్రణ ముఖ్యం అనుకొనేవారు సమతుల్యతను పాటిస్తారు. అది నేటి తెలంగాణ అవసరం.
-నర్సన్ బద్రి
94401 28169