ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రి ఒక్కరే అయినా అధికారాన్ని నడిపే శక్తులు అనేకం ఉంటాయి. ప్రభుత్వాన్ని స్వయంగా ముఖ్యమంత్రే సవ్యంగా నిర్వహించినట్టయితే సమస్య ఉండదు. తక్కిన శక్తులు జోక్యం చేసుకోవలసిన అవసరం రాదు. సవ్యంగా నిర్వహించలేకపోయినప్పుడు జోక్యం అవసరమవుతుంది. కానీ, ఆ తక్కిన శక్తులు కూడా పరిస్థితిని చక్కబెట్టడంలో విఫలమైతే? తెలంగాణలో ప్రస్తుతం అటువంటిదే కనిపిస్తున్నది.
రాష్ర్టానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. తక్కిన శక్తులు సీనియర్ మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ పర్యవేక్షకురాలు, ఢిల్లీలోని మకుటం లేని మహారాజు. తెలంగాణ ప్రజ ల దురదృష్టం ఏమంటే వీరిలో అందరికందరూ విఫలమవుతున్నారు. ఏ విధంగానో ముందుగా చూసి తర్వాత తక్కిన చర్చ చేద్దాం. ముఖ్యమంత్రి విషయం మొదటినుంచీ కనిపిస్తున్నదే. తనకు పరిపాలనానుభవం లేదు గనుక, ఇంత పెద్ద బాధ్యతను మోయటం తేలిక కాదు గనుక, ప్రజలు కొంతకాలం వేచిచూశారు. క్రమంగా నేర్చుకోగలరని ఆశించారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలవుతున్నాయి.
ఇది ఒకటి కాగా, ప్రజలకిచ్చిన అసాధ్యపు హామీలు తడిసి మోపెడై మోయలేని బరువయ్యాయి. వాటిని అమలు చేయలేకపోవటం ఒకటైతే అందుగురించి చెప్పే మోసపూరితమైన మాటలు, లేదా ఏమీ చెప్పని దాటవేతలు, చేసే బుకాయింపులు అంతకు మించినవయ్యాయి. అయితే, హామీలు అమలు చేయలేకపోవటంపై రేవంత్ రెడ్డి ఒక్కరినే నిందించలేం. దేశమంత టా అధికారం కోల్పోతూ దిక్కుతోచని స్థితిలో పడిన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం, కేం ద్రంలో ఎట్లానూ గెలవలేదు గనుక, కనీసం వీలైనన్ని రాష్ర్టాలలో అధికారానికి రావాలన్న తపన తో, ప్రజలకు బుద్ధిపూర్వకంగా అబద్ధపు హామీలనిచ్చే పద్ధతిని మొదలుపెట్టింది. ఆ పద్ధతి హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటకలలో విజయం సాధించటంతో అదే తరహా హామీలు తెలంగాణకు తెచ్చింది. ఇక్కడ వరుసగా రెండుసార్లు అధికారానికి రాలేకపోయిన రాష్ట్ర కాంగ్రెస్ అందుకు ఉత్సాహంగా సిద్ధమైంది. రేవంత్ రెడ్డికి ఆ మంచి చెడులతో సంబంధం లేదు.
అధికారం కావాలి. ఎందరో సీనియర్లను కాదని ముఖ్యమంత్రి కావటమంటే అంతకన్న కావలసిందేమిటి? ఆ విధంగా ఆ వలలో బుద్ధిపూర్వకంగా చిక్కుకుపోయారు. ఏది ఏమైతేనేమీ, అయిదేండ్ల పాటు అధికారం మాత్రం అనుభవించవచ్చు. ఆ విధంగా ముఖ్యమంత్రి విఫలమవుతున్నారు. అది ఇప్పటివరకు కనిపిస్తున్న దృశ్యం. ఇంకా మిగిలిన మూడేండ్లలో ఏమైనా చేయవచ్చునా? తన ఆలోచనలేమిటో తెలియదు గానీ, ప్రజలకు నమ్మకం కలగటం లేదు. ఏ వర్గానికి చెందిన ఎవరిని అడిగినా, తనకు ఆ సమర్థత, నిజాయితీ, కావలసిన నిధులు ఏవీ లేవంటున్నారు. ఏదో చేస్తున్నట్లు తరచు ఏవో డ్రామాలు నడిపి ప్రజలను భ్రమపెట్టజూస్తున్నట్టు కనిపిస్తున్నది. కానీ వాటిని ప్రజలు నమ్ముతున్నట్టు మాత్రం కనిపించటం లేదు. పోతే, ఆయన భాష తనకొక పెద్ద మైనస్‌గా మారింది. బహుశా ఆ మాట అర్థమైనా తన సంస్కారం అటువంటిది గనుక బయట పడలేపోతున్నట్టున్నారు.
ఇప్పుడు సీనియర్ మంత్రుల మాట విచారిద్దాం. సామర్థ్యం రీత్యా వారిలో కొద్దిమంది రేవంత్ రెడ్డి కన్న మెరుగు అనుకోవచ్చు. ఒకవేళ వారి నుంచి ఎవరైనా ముఖ్యమంత్రి అయినా ఈ డిక్లరేషన్లు, గ్యారెంటీలను అమలుచేసి ఉండేవారని కాదు. అది సాధ్యమయ్యే పని కాదు. దానినట్లుంచితే, ఇతరత్రా తన వ్యవహార ధోరణిని, భాషను సరైన తీరులో పెట్టడంలో వారు విఫలమవుతున్నారు. ఈ ధోరణి, భాష వల్ల ప్రజల దృష్టిలో ప్రభుత్వం విలువ, విశ్వసనీయత దెబ్బతింటున్నాయి. అది పార్టీకి కూడా నష్టం. ప్రభుత్వం, పార్టీ నష్టపోతే అది తమకు కూడా నష్టమన్నది గ్రహించలేనివారు కాదు సీనియర్ మంత్రులు. అయినప్పటికీ వారు రేవంత్ రెడ్డి తీరును, భాషను సరిదిద్దే ప్రయత్నాలేవీ చేయటం లేదు.
ఆయనతో అధిష్ఠానానికి విసుగెత్తితే తమకు అవకాశం రావచ్చునన్న ఆశ కొందరిది. ఏది ఏమైతేనేమీ తమ అధికారాన్ని సద్వినియోగపరచుకొని స్వప్రయోజనాలు నెరవేర్చుకొనజూసేది మరికొందరు. సీనియర్ మంత్రులే గాక మంత్రులు గాని సీనియర్ పార్టీ నాయకుల ధోరణి కూడా ఆ విధంగానే కనిపిస్తున్నది. తాము క్రియాశీల రాజకీయం నుంచి నెమ్మదిగా నిష్క్రమించే అవసాన దశలో ఉన్నందున, తమ వారసులకు అవకాశాలు లభిస్తే చాలునన్నది వారి పరిమితమైన ఆలోచన. అట్లా అవకాశాలు ఇక్కడనో, ఢిల్లీలోనో ప్రయత్నించి ఇప్పించుకుంటారు. రేవంత్ రెడ్డి, ఆయన పరిపాలన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవస్థ, ప్రజాభిప్రాయాలు ఎట్లున్నా వారికి సంబంధం లేదు. అనగా ప్రజల పట్ల తమ పార్టీ ప్రభుత్వ వైఫల్యానికి వారిది సైతం బాధ్యతన్న మాట.
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ విషయానికి వస్తే, వాస్తవానికి ప్రజల పట్ల ముఖ్యమంత్రి బాధ్యత ఎంతటిదో తనది కూడా దాదాపు అంతటిది. మన వద్ద కాకున్నా అనేక వ్యవస్థలలో ప్రభుత్వం కన్న పార్టీ శక్తివంతమైనది. ప్రజలు పార్టీని, నాయకుడిని, పార్టీ విధానాలను, పార్టీ మ్యానిఫెస్టోను, హామీలను చూసి ఓటు వేస్తారు గనుక. గెలిచే ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ సభ్యులు గనుక. అందువల్ల, తమ చేతిలోని ఎగ్జిక్యూటివ్ అధికారం మూలంగా ముఖ్యమంత్రి శక్తివంతుడవుతున్నా, సమర్థవంతులు, శక్తివంతులు పార్టీ అధ్యక్షులైతే ముఖ్యమంత్రుల
ఇష్టారాజ్యం సాగదు.
ఈ మాట అనటం ఎందుకంటే, ప్రస్తుతపు తెలంగాణ తరహా పరిస్థితులు ఏర్పడితే పార్టీ అధ్యక్షులు దానిని సరిదిద్దేందుకు ప్రయత్నించగలరు. అట్లా సరిదిద్దటం తమ ప్రభుత్వం, పార్టీతో పాటు ప్రజల మంచి కోసం అవుతుంది. కానీ, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆ ప్రయత్నం ఒక్కసారైనా చేసినట్లు లేరు. తను యువ నాయకునిగా ఉన్నప్పుడు మంచి లక్షణాలు చాలానే చూపారు. కానీ, రేవంత్ రెడ్డిని ఆశ్రయించి, తన మద్దతుతో అధ్యక్షుడు అయినప్పటి నుంచి మారిపోయారు. పార్టీ మేలు కోసం, ప్రజల నుంచి విశ్వసనీయత కోసం ప్రయత్నించకపోగా, రేవంత్ రెడ్డికి మద్దుతుగా ఆయన తరహా అబద్ధాలే తనూ చెప్తున్నారు. అటువంటి దూషణలే ప్రతిపక్షాలపై తనూ చేస్తున్నారు. అందువల్ల కలుగుతున్న మేలేమిటో తెలియదు గానీ, ప్రజల పట్ల మాత్రం అది పీసీసీ అధ్యక్షుని వైఫల్యమవుతున్నది.
వీరందరి తర్వాతి పాత్ర ఏఐసీసీ పర్యవేక్షకురాలు మీనాక్షి నటరాజన్‌ది తన నియామకం జరిగి (గత ఫిబ్రవరిలో) ఇప్పటికి ఆరు మాసాలు. పర్యవేక్షకుల బాధ్యత మనకు అర్థమైనంతవరకు ఇక్కడ ప్రభుత్వం, పార్టీ ఏ విధంగా పనిచేస్తున్నాయో, అందులోని మంచి చెడులేమిటో గమనించటం, దానిపై ఏఐసీసీ నాయకత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేయటం, తరచూ నివేదికలివ్వటం, అభిప్రాయాలు వివరిస్తూ సూచనలు చేయటం. ఢిల్లీ ఆదేశాలతో పాటు, అందుకు అనుగుణంగా తన సలహాలు కూడా ముఖ్యమంత్రికి, పీసీసీ అధ్యక్షునికి తెలియపరచటం. అందుకు భిన్నంగా ఏమైనా జరుగుతున్నట్టు తోస్తే సవరించేందుకు ప్రయత్నించటం. యథాతథంగా ఇది మంచి వ్యవస్థే. అది సరిగా పనిచేసినట్లయితే రేవంత్ రెడ్డి పరిపాలన, వ్యక్తిగత వ్యవహరణ పూర్తిగా కాకున్నా కొంత మారి ఉండేవి. కానీ అటువంటిదేమీ కనిపించటం లేదు.
అందుకు కారణం మీనాక్షి నటరాజన్ తగిన పరిశీలనలు చేయకపోవటమా? ఆమె సమాచారాలను ఢిల్లీ నాయకత్వం పట్టించుకోనందుకా? తిరిగి తగు సూచనలు చేయనందుకా? ఇక్కడ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుల ధోరణా? మరేమైనానా? మనకేమీ తెలియదు. ఒక వ్యవస్థగా మాత్రం ఆమె విఫలమయ్యారు. ఆరు మాసాల క్రితం తన నియామకం, హైదరాబాద్ రాక సమయంలో కొంత ఆసక్తికర వాతావరణాన్ని సృష్టించారు. రాహుల్‌గాంధీకి నమ్మకమైన వ్యక్తి, గాంధేయవాది, నిరాడంబరురాలు విమానంలో గాక రైలులో రావటం, తన సంచీ తానే మోయటం, ఆటోలో ప్రయాణం, ఖరీదైన హోటల్లో గాక గెస్ట్‌హౌజ్‌లో బస, మామూలు దుస్తులు ధరించటం, రేవంత్ రెడ్డి కూలగొట్టించిన పేదల ఇండ్లకు వెళ్లి పరామర్శించటం, అంతకుముందు అక్కడకు వెళ్లజూసిన మేధాపాట్కర్ను పోలీసులు నిరోధించటం సరికాదనటం వగైరాలు బాగానే వార్తలకెక్కాయి.
ఆ వెనుక కూల్చివేతల విషయమై జరిగిన బహిరంగ సభకు సంఘీభావంగా వెళ్లి వేదికపై కింద కూర్చొని గాంధీ రాట్నం వడికిన ఫొటోలు పత్రికలలో వచ్చి ప్రజలను ఆశ్చర్యపరిచాయి. కాస్త భ్రమ పెట్టాయి. కానీ, ముఖ్యమంత్రిని గాని, పార్టీని గాని ఆమె సరిదిద్దినట్లు ఏమీ కన్పించలేదు. పైగా, ఆమె ఏవో జోక్యాలు చేసుకోజూడగా రేవంత్ రెడ్డి, మహేశ్ గౌడ్ కలిసి తన ప్రయత్నాలను వమ్ముచేసినట్లు వార్తలు వ్యాపించాయి. ఈ పెద్దలు ఢిల్లీకి కావలసినవి చేసి పెట్టినంత కాలం తను ‘సరిదిద్ద’గలిగిందేమీ లేదని ఆమెకు ఈ సరికి అర్థమై ఉంటుంది. మొత్తానికి కారణాలు ఏమైనా, ప్రజలకు సంబంధించి ఈ వ్యవస్థా విఫలమైంది.
చివరికి మిగిలింది మకుటం లేని మహారాజు. మిగిలిన అందరూ ఎట్లున్నా ఆయన ఇక్కడి వ్యవహారాలను, అసలు ఏ వ్యవహారాలనైనా సరిగా నియంత్రించగలవాడైతే పరిస్థితి మరొక విధంగా ఉండేది. తను ప్రత్యక్ష రాజకీయాలలోకి 2004లో ప్రవేశించి 20 సంవత్సరాలు గడిచిన వెనుక కాంగ్రెస్ మరింత బలపడటానికి బదులు ఇట్లా అధ్వాన్నమయ్యేది కాదు. అబద్ధపు హామీలు కుప్పలు తెప్పలుగా ఇచ్చిగాని అధికారానికి రాలేని దుస్థితి, ఇతర పార్టీలను సీట్ల కోసం ప్రాధేయ పడవలసిన దశ వచ్చేవి కాదు. తమ ప్రభుత్వం హామీలు అమలు పరచకున్నా, తమ ముఖ్యమంత్రి యథేచ్ఛగా వ్యవహరించినా దారిన పెట్టలేక, ఆయన తమకోసం చేసిపెట్టే పనులతో సంతృప్తిచెంది ఊరుకునే అవమానకరస్థితి ప్రాప్తించేది కాదు. అందువల్ల తెలంగాణ ప్రజలు తన నుంచి ఆశించగలది ఏమీ కనిపించదు. ఈ విధంగా అందరికందరూ తమకు కావలసిన అధికార సాధనలో సఫలమై, అధికారమిచ్చిన ప్రజల విషయంలో విఫలమవుతున్నారు.
టంకశాల అశోక్