రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకుల వికృత చేష్టలు పెచ్చుమీరుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నది. నిలదీస్తే నిర్బంధిస్తున్నది. ప్రజాపాలన అంటే ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అంటూ గప్పాలు కొడుతున్న కాంగ్రెస్ సర్కార్ పౌర సమాజంపై ఉక్కుపాదం మోపుతున్నది. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ, వాక్స్వాతంత్య్రం, హక్కులను కాలరాస్తున్నది. గత బీఆర్ఎస్ సర్కార్‌పై విషప్రచారం చేసి, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గద్దెనెక్కిన నాటినుంచీ ప్రజాగొంతుకలను అణచివేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. బహుజన, దళిత, గిరిజన నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యంలో అఘాయిత్యాలు, దోపిడీలు, హత్యలు షరామామూలైపోయాయి. ప్రశ్నిస్తే చాలు పాలకులు ఉలిక్కిపడుతున్నారు. గొంతెత్తితే చాలు భయపడిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
కాంగ్రెస్ సర్కార్ కొలువై తొమ్మిది నెలలు గడుస్తున్నా ఏ ఒక్క హామీ నెరవేరలేదు. హామీల అమలు కోసం నినదిస్తున్నవారిపై హస్తం ప్రభుత్వం కక్ష గడుతున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు శాంతియుతంగా నిరసన తెలిపినా ప్రభుత్వం దాడులకు తెగబడుతున్నది. నిజానిజాలను ప్రజలకు తెలియజేస్తున్న మీడియాపై చిందులు వేస్తున్నది. మాజీ మంత్రి హరీష్‌రావు క్యాంపు కార్యాలయంపై దాడి, ఖమ్మంలో బీఆర్ఎస్ నాయకులపై రాళ్లదాడి, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై హత్యాయత్నం.. ఇవన్నీ అందులో భాగమే.
కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ సర్కార్ పాలనలో పదేండ్ల పాటు రాష్ట్రంలో ఎలాంటి అలజడి, ఆందోళనలు కనిపించలేదు. స్వరాష్ట్ర సాధన కోసం అహర్నిశలు శ్రమించిన కేసీఆర్.. ఆ తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం కోసమూ అంతే కృషిచేశారు. అందుకే అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోయిన తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అన్నింటికీ మించి తెలంగాణలో స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సోదరభావం వెల్లివిరిశాయి.
దేశానికే ఆదర్శంగా నిలిచిన మన తెలంగాణ ఇప్పుడు అతితక్కువ కాలంలోనే సమస్యల నిలయంగా మారిపోయింది. గురుకులాల విద్యార్థులు, రైతాంగం, ఉద్యోగులు, ఆటో కార్మికులు.. ఇలా అన్ని రంగాల ప్రజలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. కోతలు, కొర్రీలతో అరకొరగా రుణమాఫీ చేయడంతో రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది. వానకాలం సీజన్ ముగుస్తున్నా రైతుభరోసా ఇంకా అందలేదు. పింఛన్ల పెంపు సంగతి పక్కనపెడితే అసలు పింఛన్లే సమయానికి అందడం లేదు. కేసీఆర్ కిట్‌కు కటకట ఏర్పడింది. ఇలా నమ్మి ఓట్లేసిన అన్నివర్గాల ప్రజలను కాంగ్రెస్ నట్టేట ముంచుతున్నది.
ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్న ప్రతిపక్ష నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు తెగపడుతూ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నది. అరికెపూడి గాంధీ, ఆయన అనుచరులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై తెగబడిన తీరు విస్మయం కలిగిస్తున్నది. హైదారాబాద్ నడిబొడ్డున పట్టపగలే ఒక ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డారంటే వారి వెనుక ఎవరి ప్రోద్బలం ఉన్నదో అర్థమవుతున్నది. ఇటువంటి ఘటనలను ఖండించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి దాడిని సమర్థించే ప్రయత్నం చేయడం గర్హనీయం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పేదొకటైతే.. ఆ పార్టీ సీఎం రేవంత్‌రెడ్డి చేసేదొకటి. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నీతులు చెప్పే రాహుల్‌గాంధీ తెలంగాణలో జరుగుతున్న దమనకాండపై స్పందించకపోవడం శోచనీయం.
ఇలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడితే పోయేది కాంగ్రెస్ పరువే. ప్రశ్నించే గొంతుకలను నొక్కాలని చూస్తే ప్రజలే కాంగ్రెస్ గొంతు నొక్కుతారు. ప్రజా పోరాటాన్ని అణచివేయాలని చూస్తే ప్రజలే మిమ్మల్ని అణగదొక్కుతారు. తెలంగాణతో గోక్కున్నోడికి పుట్టగతులుండవు. ‘పునాదులను పెకిలిస్తా, చరిత్రను మలినం చేస్తా, ఆనవాళ్లు లేకుండా చేస్తా’ అంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. కాంగ్రెస్ ఆనవాళ్లే లేకుండా చేస్తది. తెలంగాణ పౌరుషం ఆ పార్టీ నషాళానికి అంటుకుంటుంది. భయపడే తెలంగాణ కాదిది. ఈ నేపథ్యంలో తెలంగాణను ధ్వంసం చేస్తూ, తెలంగాణ అస్తిత్వం దెబ్బతినేలా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డి తీరును అందరూ ముక్తకంఠంతో ఖండించాలి.
-చిటుకుల మైసారెడ్డి
94905 24724