‘మేం అధికారంలోకి రాగానే తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే దానికి చట్టబద్ధత కల్పిస్తాం’ అని అసెంబ్లీ ఎన్నికల ముందు నిరుద్యోగులకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. నిరుద్యోగులను నమ్మించేందుకు ఏకంగా మ్యానిఫెస్టోలో డమ్మీ జాబ్ క్యాలెండర్‌ను పొందుపరిచింది. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా జాబ్ క్యాలెండర్ జాడే లేదు.
వాగ్దానాలు నీటిపై రాతలుగా మారితే ప్రభుత్వాలను నమ్మేదెట్ల అని అర్థశాస్త్ర ఆచార్యులు కార్తీక్ మురళీధరన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన చెప్పినట్టే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నీటిపై రాతలయ్యాయి. కుటుంబాలకు దూరంగా ఉంటూ, రాత్రిపగలూ తేడా లేకుండా గ్రంథాలయాల్లో పుస్తకాలతో కుస్తీ పడుతున్న నిరుద్యోగుల గోస కాంగ్రెస్ సర్కారుకు పట్టడం లేదు. కాంగ్రెస్‌పై ఆశలు పెట్టుకుని ఓట్లు వేసిన యువత నేడు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇత్తేసి పొత్తుకూడు అన్నట్టుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి, భర్తీ చేసిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇస్తూ క్రెడిట్ కోసం పాకులాడటం కాంగ్రెస్‌కే చెల్లింది. బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లకు 6 వేల పోస్టులను కలిపి మొత్తం 60 వేల ఉద్యోగాలు తామే భర్తీ చేశామని గొప్పలకు పోవడం విడ్డూరం.
యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ నిరుద్యోగులను నిలువునా మోసం చేసింది. ఉద్యోగాల నోటిఫికేషన్ తేదీ, దరఖాస్తు గడువు, పరీక్ష తేదీ లాంటి సమగ్ర వివరాలతో యూపీఎస్సీ ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దగా క్యాలెండర్‌ను విడుదల చేసింది. గతేడాది ఆగస్టులో అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన ఈ దగా క్యాలెండర్‌లోని పోస్టుల భర్తీ కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తద్వారా దీన్ని కూడా మరో ఎన్నికల మోసపూరిత హామీగా కాంగ్రెస్ సర్కారు మార్చేసింది.
ఎస్సీ వర్గీకరణ సాకుతో ఇన్నాళ్లు ఉద్యోగాల నోటిఫికేషన్లకు సర్కారు బ్రేకులు వేసింది. ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్నట్టు ఇటీవల రాష్ట్ర సర్కారు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇక ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవుతుందని నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, వారి ఆశలపై సర్కారు నీళ్లు చల్లడంతో నిరుద్యోగులు ఆందోళన బాటపట్టాల్సి వచ్చింది.
ఈ ఏడాదిన్నర కాలంలో ఇప్పటికే 9 వేల మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయ్యారు. ఆ ఖాళీలను సర్కారు భర్తీ చేయకుండా ఉద్యోగ విరమణ వయసును పెంచాలని చూడటం దారుణం. ఖజానాపై ఆర్థిక భారం పడుతుందని ఆలోచించడం నిరుద్యోగుల పట్ల సర్కారుకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.
ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 25 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసింది. అందులో తెలంగాణ వాటా 10 వేలు మాత్రమే. కానీ, పదేండ్ల పాలనలో కేసీఆర్ సర్కారు 1.6 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది. అయితే, రెండో విడత బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాల భర్తీలో జరిగిన ఆలస్యంపై అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ చేసిన విమర్శల దాడి అంతాఇంతా కాదు. ఈ విషయాన్ని ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి. అంతేకాదు, మరో 80 వేల ఖాళీలను గుర్తించి, వాటి భర్తీ కోసం కేసీఆర్ సర్కారు చర్యలు చేపట్టిందనేది వాస్తవం. ఆ కొలువులకే కాంగ్రెస్ సర్కారు నియామక పత్రాలు ఇస్తున్న విషయం జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ దబాయించినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. అధికారం కోసం రాజకీయ పార్టీగా నోటికొచ్చిన హామీ ఇచ్చి.. నేడు ప్రభుత్వంలోకి వచ్చాక మాట తప్పితే ప్రజాక్షేత్రంలో ఎదురీత తప్పదు.
(వ్యాసకర్త: కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నేత)
-పిన్నింటి విజయ్ కుమార్
90520 39109