ముంబై స్టాక్ మార్కెట్లో షేర్ల సూచీలు పెరగడం, పతనం కావడం రోజూ జరిగేదే. ఒక్కోసారి భారీగా కూడా. ఆ మార్పులను చూసి కొందరు భావోద్వేగాలకు లోనవుతుంటారు. కానీ అక్కడ తెరవెనుక జరిగే క్రీడలు తెలిసిన వారు తాపీగానే ఉంటారు. ఏ కంపెనీ సూచీలైనా, ఏ కారణంగానైనా, వరుసగా పతనమవుతుంటే మాత్రం అది ప్రమాదానికి సూచిక అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచీలు అన్నీ ఆ విధంగా ప్రమాదకరంగా పతనమవుతుండటం గమనించాల్సిన విషయం.
Revanth Reddy | రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 14 మాసాలు పూర్తయ్యాయి. ఈ విధమైన సూచీల పతనం అందులో కొంతకాలం పాటు జరిగి ముగిసి ఉంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కొత్తది, పదవికి తను కొత్త కనుక. దానిని హనీమూన్ కాలమంటారు. ఏడాది పూర్తయి మరో రెండు నెలలు గడిచిన వెనక కూడా సూచీ పతనాలలో మార్పు లేకపోతే? మిగిలిన విషయాలు కొంతసేపు అటుంచి తాజాగా జరిగినవి ముందు చూద్దాం. మరికొందరు ముఖ్యులైన సహచరులతో కలిసి రేవంత్ రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. పార్టీకి మకుటం లేని మహారాజైన రాహుల్‌గాంధీని కలిసేందుకూ ప్రయత్నించారు. గత ఆరు మాసాల వలెనే ఈసారి కూడా ఆయన అపాయింట్మెంట్ లభించలేదు.
ముఖ్యమంత్రి స్టాక్ సూచీ పతనానికి ఇదొక బలమైన సూచన. ఈ ప్రముఖులంతా ఢిల్లీకి వెళ్లేదే అక్కడి నుంచి పిలుపు వచ్చిన మీదట. అందుకు సన్నాహకంగా ముందు రోజున హైదరాబాద్‌లో పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. దీనిని బట్టి ఢిల్లీ పర్యటన కీలకమైందనే అభిప్రాయం కలిగింది. ఆ పర్యటన అజెండా రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ నియామకం, మంత్రివర్గ విస్తరణకు ఆమోదం అనే వార్తలు వెలువడ్డాయి. అటువంటి అవకాశం ఉందనే నమ్మకంతో పీసీసీ ఆశావహులు, మంత్రి వర్గ ఆశావహులు పెద్ద సంఖ్యలో ఢిల్లీ చేరుకున్నారు. చివరకు పార్టీ కార్యవర్గానికి దాదాపు తుదిరూపు వచ్చింది కానీ, మంత్రివర్గ అంశం అసలు ముందుకు కదలలేదు. ఖర్గే, వేణుగోపాల్ స్థాయిలో చర్చలు జరిగినా ఎటూ తేలకపోవడం కన్నా ముఖ్యంగా, ముఖ్యమంత్రికి రాహుల్‌తో సమావేశానికి అవకాశం లభించకపోవడంతో ఆయనతో నేరుగా ఏమీ చెప్పుకోలేకపోయారు. రాహుల్ అపాయింట్మెంట్ను తానసలు కోరనేలేదని ఆయన తర్వాత వివరణ ఇచ్చుకోజూశారు కానీ, వారిద్దరి సమావేశం జరగనున్నట్టు ఢిల్లీ వెళ్లడానికి ముందు రోజే మీడియాకు లీకులు ఇవ్వడం గమనార్హం. అలా లీకులివ్వడం, అపాయింట్మెంట్ లభించకపోవడం ఇది ఎన్నోసారో తిరిగి వారే లీక్ ఇవ్వాలి.
ఇందులో మూడు విశేషాలున్నాయి. ఒకటి, ఆ రోజున ఝార్ఖండ్ ఎమ్మెల్యేలను కలిసి గంటలపాటు ముచ్చటించిన రాహుల్, తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశానికి ఇష్టపడకపోవడం. రెండు రాష్ర్టాలలో ఝార్ఖండ్ కన్నా తెలంగాణ ముఖ్యమైనది. ఝార్ఖండ్‌లో ఒక ప్రాంతీయ పార్టీలో తాము జూనియర్ భాగస్వాములు మాత్రమే కాగా,తెలంగాణలో పదేండ్ల తర్వాత సొంతంగా అధికారంలోకి వచ్చారు.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోనున్నారు. అయినా, రేవంత్‌తో సమావేశం పట్ల రాహుల్ ఆసక్తి చూపలేదు. మూడు విశేషాలలో ఇది ఒకటి కాగా, రెండవది తమ ముఖ్యమంత్రికి ఆయన ఆరు నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం. ఇది అసాధారణమైన స్థితి. అటువంటి పరిస్థితి బలమైన కారణాలు లేకుండా ఏర్పడదు. రేవంత్‌రెడ్డికి సంబంధించి అవి ఏమిటై ఉండవచ్చున్నది ప్రశ్న.
మూడవది ప్రభుత్వం ఏర్పాటై 14 మాసాలు గడిచినా మంత్రివర్గ విస్తరణకు అనుమతి లభించకపోవడం. మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఇంకా మిగిలి ఉన్నాయి. హోం, విద్య, మున్సిపల్ వ్యవహారాలు వంటి ప్రధానమైన శాఖలు ముఖ్యమంత్రి వద్దనే ఉన్నాయి. ఈ శాఖలలో పరిపాలన సరిగా లేదనే విమర్శలు వస్తున్నాయి. పదేండ్ల తర్వాత అధికారానికి వచ్చినవారు ఎంతో బాగా నిర్వహించి ప్రజల మెప్పు పొందవలసిన శాఖలివి. ఈ మాట రాష్ట్ర, జాతీయ నాయకత్వాలకు తెలియనిది కాదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి పదేపదే ప్రయత్నించినా ఢిల్లీ నాయకత్వం తనను లెక్కచేయకపోవడం అవమానకరం. అటువంటి ఉపేక్షకు రాహుల్‌ను కూడా తప్పుపట్టవలసిందే. కానీ, ఆయన రేవంత్‌ను ఉపేక్షించడమన్నది గమనించదగ్గది. దీనినంతా కప్పిపుచ్చుకునేందుకు ఆయన, రాహుల్‌తో తాను అపాయింట్మెంట్ కోరలేదని (ఆ మాట నిజమైతే ఢిల్లీ వెళ్లినా కోరకపోవడం ఎందుకనే సందేహం తలెత్తుతుంది).
రాహుల్‌తో తనకు గ్యాప్ ఏమీ లేదని రేవంత్‌రెడ్డి సంజాయిషీలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇంతచేసీ చివరకు మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండబోవడం లేదని ముఖ్యమంత్రి ప్రకటించారు. అనగా కాంగ్రెస్ అధినాయకులు, రాష్ట్ర నాయకులు కలిసి తెలంగాణను మూడింట రెండువంతుల క్యాబినెట్‌తోనే నిరవధికంగా పాలించదలిచారన్న మాట.అందువల్ల పరిపాలన మరికొంతకాలం కుంటుపడినా వారికి లెక్కలేదు.
ఈ పరిస్థితుల్లో రేవంత్‌రెడ్డి స్టాక్ సూచీలు ఊర్ధముఖంలో ప్రయాణిస్తాయా లేక అధోముఖంలోనా? ఇది చాలదన్నట్టు ఢిల్లీ పర్యటనలో మరొకటి జరిగింది. ఒక ప్రత్యేక విమానం నిండేటంత స్థాయిలో పీసీసీ కార్యవర్గాన్ని తయారుచేయనుండటం. జాబితా ప్రకటన అయితే ఇంకా జరగలేదు కానీ, అన్ని పత్రికల్లో ఒకే విధంగా వెలువడిన వార్తలను బట్టి నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షులు, 20 మంది వరకు ఉపాధ్యక్షులు ఉండబోతున్నారనుకోవాలి. అయితే, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం గురించి తెలిసిన వారెవరూ ఇవి తుది సంఖ్యలని నమ్మరు. వారి నియామకాలు ఎప్పుడూ పుష్పక విమానం పద్ధతిలో ఉంటాయి కనుక. కార్యనిర్వాహక అధ్యక్షుల సంఖ్య, ఉపాధ్యక్షుల సంఖ్య అంతకు రెట్టింపు అయినా ఆశ్చర్య పడనక్కరలేదు.
ఇవిగాక ప్రధాన కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, వివిధ విభాగాల వారు ఉండనే ఉంటారు. వారందరి కోసం మామూలు 320 సీట్లుండే బోయింగ్ 777-200ఈఆర్ విమానం సరిపోదు గనుక ఎయిర్‌బస్ ఎ-380ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అందులో సీట్ల సంఖ్య 853. అలాగే వారందరికీ గాంధీభవన్ చాలదు కనుక, పక్కనే ఉన్న భీంరావుబాడను మరోసారి ఆక్రమించాల్సి రావొచ్చు. అప్పుడు ప్రతిష్ఠ ప్రజల దృష్టిలో పరిపూర్ణమవుతుంది. అయితే ఒక చిక్కు ఉన్నది. డిమాండ్ తగినంత లేనందువల్ల ఈ తరహా విమానాల తయారీ కొంత కాలం క్రితం ఆగింది. ఇక్కడి నుంచి ప్రత్యేక ఆర్డర్ వెళ్లిన పక్షంలో కంపెనీ వారు తయారు చేయవచ్చు.
రేవంత్‌రెడ్డికి రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి ఒక అదనపు కారణం కూడా ఉందేమో తెలియదు. రేవంత్ ఎంతో ఉత్సాహంగా ప్రచారం చేసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి శనివారం నాటి ఫలితాల్లో సున్నా సీట్లు మాత్రమే వచ్చాయి. అలా జరగనున్నదని రాహుల్‌కు ముందే తెలిసి ఉండవచ్చునా? రేవంత్ అక్కడ ప్రచారంలో పాల్గొంటూ, కాంగ్రెస్‌కు గత రెండు ఎన్నికల్లోనూ సున్నా, సున్నా వచ్చినా ఈసారి మాత్రం అధికారానికి వచ్చి తీరగలదన్నారు. తన ప్రభుత్వం తెలంగాణలో అన్ని హామీలు అమలు పరిచిందని, ఢిల్లీ హామీలు కూడా అమలు జరిగేటట్టు చూడటం తన బాధ్యత అని నొక్కి చెప్పారు. ఆయన ఇదే విధమైన ప్రచార ఫలితాలను మహారాష్ట్రలో చూసినందున, ఢిల్లీలోనూ అదే జరగబోతున్నట్టు రాహుల్‌కు పక్షి శకునం అందిందేమో తెలియదు. లేనట్లయితే ఆరు నెలల నిరీక్షణ తర్వాత కనీసం ఈసారైనా తనను సమావేశానికి సాదరంగా ఆహ్వానించి ఉండేవారు. ఇదిలా ఉండగా, తన సూచీలను పెంచే, లేదా తగ్గించే మాటలు మరొక రెండు ఈ నెల 9వ తేదీన కేరళలో అన్నారాయన. ఢిల్లీలో ‘ఆప్’ను కావాలనే ఓడించామన్నారు. హర్యానాలో తమను ఓడించినందుకు అది ప్రతీకారమని చెప్పారు.
హర్యానాలో ఓటమికి కారణం ‘ఆప్’ అవునో, కాదో తెలియదు కానీ, ‘ఇండియా’ కూటమికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించే తీరేమిటో ఆయన బట్టబయలు చేశారు. రెండవది, దక్షిణాది రాష్ర్టాల పట్ల ప్రధాని మోదీ ప్రభుత్వ వివక్ష, ఒకే దేశం, ఒకే ఎన్నిక పద్ధతి వల్ల ఈ ప్రాంతానికి కలిగే నష్టం గురించి. అంతవరకు బాగానే ఉన్నది. కానీ ఆ విషయమై నిరసనలకు ‘అవసరమైతే’ తానే ‘చొరవ’ తీసుకుంటానని గంభీరంగా ప్రకటించారాయన. దక్షిణాదిలోని ఇతర ముఖ్యమంత్రులందరూ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా, ఈ విషయమై ‘చొరవ’ తీసుకోవడం చాలాకాలం క్రితమే మొదలైనట్టు రేవంత్‌రెడ్డికి తన సలహాదారులు, స్పీచ్ రైటర్లు చెప్పినట్టు లేరు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్టాక్ సూచీలు పెరగడం, తగ్గడం 5 అంశాలపై ఆధారపడి ఉంటాయి. ఒకటి, సొంత పార్టీలో తన విలువ. రెండు, పరిపాలన తీరు. మూడు, మంత్రి వర్గంలో తనకుండే గౌరవం. నాలుగు, ప్రజల్లో విశ్వసనీయత. ఐదు, ఢిల్లీ నాయకత్వానికి ఏర్పడే నమ్మకం. గత 14 నెలల ఆయన పరిపాలనను, వ్యక్తిగత వ్యవహరణను, ఇతరులతో సంబంధాలు నెరిపే తీరును గమనించినప్పుడు ఈ సూచీలు అన్నింటికి అన్నీ పతనమవుతూ వస్తున్నట్టు మాత్రం అర్థమవుతున్నది.
-టంకశాల అశోక్