ప్రాస కోసమో, పంచ్ కోసమో డైలాగులు పేల్చితే ఒక్కోసారి అవి గురితప్పి మిస్ ఫైర్ అవుతుంటాయి. అచ్చం అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీ మాలోతు కవితనే మళ్లీ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రకటించింది. దీంతో ఒక సమావేశంలో ఆమెను శూర్పనఖతో పోల్చారు పొంగులేటి. కానీ, మంత్రి చేసిన వ్యాఖ్య గురితప్పి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరికి తగిలింది. గతంలో ప్రధాని మోదీ పార్లమెంట్లో రేణుకాచౌదరిని శూర్పనఖతో పోల్చారు. అప్పట్లో ఆ వ్యాఖ్య వివాదాస్పదమైంది. శూర్పనఖ అనే పదాన్ని తాజాగా పొంగులేటి ప్రయోగించడంతో పాత ఘటనను తిరగదోడినట్టయింది. దీంతో మంత్రి వేసిన పంచ్ డైలాగ్ మిస్ ఫైర్ అయిందని సొంత పార్టీ వారే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
వాంటెడ్ క్యాండిడేట్స్
కేంద్రంలో బీజేపీ సర్కారే తిరిగి అధికారంలోకి వస్తుందని, గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. అయితే తెలంగాణలో మాత్రం ఆ పార్టీ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది. ‘హలో! మా పార్టీ నుంచి పోటీ చేయడానికి మీరేమైనా ఆసక్తిగా ఉన్నారా?’ అంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కొందరికి ఫోన్లు చేసి మరీ అభ్యర్థిస్తున్నారు. అంతేకాకుండా కొందరు నాయకుల ఇండ్లకు స్వయంగా వెళ్లి ‘టికెట్ తీసుకోండి ప్లీజ్’ అని అడుగుతున్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత అయితే తనను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాతే బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. ఇతర రాష్ర్టాల్లో పరిస్థితి ఎలా ఉన్నా.. తెలంగాణలో ఏంటీ పరిస్థితి? అని పార్టీ పెద్దలు పెదవి విరుస్తున్నారట!
ఇదీ మార్పే!
తెలంగాణలో సినిమా వాళ్లను ఏ పార్టీ కూడా దగ్గరికి రానీయడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో జయసుధ, విజయశాంతి, కవిత, జీవిత, దివ్యవాణి, బండ్ల గణేశ్ తదితరులు టికెట్లు ఆశించినప్పటికీ ఎవరికీ పోటీ చేసే అవకాశం రాలేదు. తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సినిమా వాళ్లను పక్కనపెట్టడాన్ని అన్ని పార్టీలు పాటించడం నిజంగా మార్పే అంటున్నారు సినీ పండితులు.
హమ్ హైనా!
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే మరో పదేండ్ల పాటు అధికారంలో ఉంటుందని మహబూబ్‌నగర్‌లో జరిగిన ప్రజాదీవెన సభలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే అదే వేదికపై ప్రసంగించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం మరో ఇరవై ఏండ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు. అదేంటి సీఎం రేవంత్‌రెడ్డి పదేండ్లు అంటుంటే.. మీరేమో 20 ఏండ్లు అంటున్నారని కోమటిరెడ్డిని పక్కన కూర్చున్న ఒక నేత అడగగా.. ‘పదేండ్లు రేవంత్‌రెడ్డి ఉండి దిగిపోతే.. ఆ తర్వాత పదేండ్లు మేం ఉండొద్దా’ అని గొణిగినట్టు వినికిడి.
– వెల్జాల