చెరిపేస్తే చెరిగిపోవడానికి తెలంగాణతో కేసీఆర్‌కు ఉన్నది రాజకీయ బంధం కాదు, అది పేగు బంధం. ఆయన కత్తుల వంతెన మీద కవాతు చేసి, నాలుగు కోట్ల ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. అంతేకాదు, పసిగుడ్డు అయిన తెలంగాణను కేవలం పదేండ్లలోనే సంక్షేమం, అభివృద్ధిలో పరుగులు పెట్టించారు.
ఘన చరిత్ర కలిగిన… ‘కేసీఆర్‌ను ఫినిష్ చేశాను, ఇక కల్వకుంట్ల కుటుంబం ఉనికి లేకుండా చేయడమే తన లక్ష్యం’ అంటూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అహంకార పాన్పుపై పగటి కలలు కంటున్నారు. సుమారు 11 నెలల్లోనే అట్టర్ ఫ్లాప్ సీఎంగా ముద్ర వేసుకున్న చరిత్ర రేవంత్‌ది. పేర్ల మార్పు, ఇండ్ల కూల్చివేతతో పాటు యూ ట్యూబ్ ఛానళ్ల ద్వారా అబద్ధాలను ప్రచారం చేయించగలరేమో కానీ, తెలంగాణ పుడమిపై సువర్ణాక్షరాలతో లిఖించబడిన కేసీఆర్ అనే మూడు అక్షరాలను చెరిపివేయడం ఎవరివల్లా కాదు. ఆయనే లేకుంటే భారతదేశ చిత్రపటంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించేదా? రేవంత్‌రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేవాడా?
బీఆర్ఎస్ సంక్షేమ పథకాల కొనసాగింపుతో పాటు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అదనంగా అమలవుతాయని నమ్మిన ప్రజలు కేవలం 2.05 శాతం తేడాతో కాంగ్రెస్ పార్టీకి పాలనా పగ్గాలు అప్పగించారు. గౌరవ ప్రదమైన సీట్లను గెలిపించి బీఆర్ఎస్కు ప్రతిపక్ష హోదాను కట్టబెట్టారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఒక్క ఓటమితో బీఆర్ఎస్ ఇక ఉండదని ప్రచారం కొనసాగిస్తుండటం అజ్ఞానమవుతుంది. అలా అయితే, దేశవ్యాప్తంగా వరుసగా ఎదురవుతున్న కాంగ్రెస్ పరాభవాలను ఏమంటారో? ‘ముఖ్యమంత్రులు ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు.’ పాలనాదక్షుల కు మాత్రమే చరిత్రలో స్థానం ఉంటుంది. ఆ స్థానా న్ని సంపాదించుకున్నవారే కేసీఆర్.
ఉమ్మడి పాలనలో విధ్వంసమైన తెలంగాణకు దశాబ్ద కాలంలోనే పురోగతి దారిచూపిన దార్శనికుడు కేసీఆర్. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ సంక్షేమ, అభివృద్ధి నమూనాను తెలపకపోగా, ‘లంకె బిందెలనుకొని వస్తే.. ఖాళీ కుండలే కనిపిస్తున్నాయి’ అని వ్యాఖ్యానించడం ఆయన పాలనా అపరిపక్వతకు నిదర్శనం. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామన్న హామీలను అటకెక్కించాడు. కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు, రైతుబీమా, నాణ్యమైన ఉచిత కరెంటు, మెరుగైన విత్తనాలు, ఎరువుల సరఫరాతో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని ఒక పండుగలా మార్చింది. కరువు నేల పాలమూరును పచ్చని మాగాణంలా మార్చింది. స్వల్పకాలంలోనే తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా ఎదిగింది. హస్తం పాలకుల పుణ్యమాని ఇప్పుడు ఆంక్షల అడ్డుగోడలతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది వాస్తవం కదా? కేసీఆర్ పదేండ్ల పాలనలో సర్వమతాలకు సముచిత గౌరవం దక్కింది. యాదాద్రి ఆలయ పునర్నిర్మా ణం మహాద్భుతం అంటూ భక్తులు కేసీఆర్‌ను ప్రశంసిస్తున్నారు. పల్లెల్లో ఇప్పుడెందుకు పండుగలకు ప్రభుత్వ కానుకలు అందడం లేదు. వేల ఏండ్ల వెలివాడల వెతలు తీర్చేందుకు కేసీఆర్ దళితబంధు వం టి విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టి వెలుగు నిం పారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి ఆత్మగౌరవ పతాక ఎగురవేశారు. ఇదిలా ఉంటే రేవంత్ పాలనలో హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో నిమ్నవర్గాలకు చెందిన నిరుపేదల ఇండ్లను కూల్చివేయడం అమానుషం.
తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహ ఏర్పాటు ఎవరి మెప్పు కోసం? మొన్నటివరకు ఆనందంగా ఉన్న గురుకులాల విద్యార్థులు ఇప్పుడెందుకు గోస పడుతున్నారు? కేసీఆర్ పాలనలో ప్రభుత్వరంగంలో 1.60 లక్షల ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో 24 లక్షల ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. కాంగ్రెస్ మాత్రం విద్యార్థి, నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకోలేకపోతున్నది. ఐటీ రంగా న్ని మేటిగా తీర్చిదిద్దిన బీఆర్ఎస్ను యువత ఇప్పటికీ కొనియాడుతున్నది. మొన్నటివరకు తెలంగాణ లో ‘మూడు పువ్వులు ఆరు కాయలు’గా వర్ధిల్లిన రియల్ వ్యాపారం కుదేలవ్వడానికి కారకులెవరో తెలంగాణ సమాజానికి తెలువదా?
11 నెలల వ్యవధిలోనే ఢిల్లీకి 25 సార్లు పర్యటనలు చేశాడంటే తెలంగాణ ప్రభుత్వ పగ్గాలు ఎవరి చేతుల్లో ఉన్నాయో తెలిసిపోతున్నది. కేసీఆర్ పదవిలో ఉన్నప్పుడు నోరు మెదపని పొరుగు రాష్ట్రం నేతలు మళ్లీ ఇప్పుడెందుకు తెలంగాణలో పునరుజ్జీ వ రాజకీయాలు మొదలు పెట్టాలనుకుంటున్నారో విద్యార్థి, మేధావివర్గం తప్పక ఆలోచించాలి. ఉద్య మ నేపథ్యం కలిగిన వారి భాగస్వామ్యం ఓర్చుకోలేక ‘కుటుంబ పాలన’ అంటూ కాంగ్రెస్ కుటిల రాజకీయం చేసింది. ఇప్పుడు ‘ప్రజా పాలన’ పేరి ట ఆ నాలుగు కుటుంబాలు చేస్తున్న కుటుంబాల పాలనను చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
తెలంగాణలో శాంతిభద్రతలు కొరవడి, ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి. రక్షణగా నిలవాల్సిన పోలీసులే న్యాయం కోసం ‘రోడ్డెక్కారంటే ‘ప్రజా పాలన’లో పోలీసుల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు సీఎం రేవంత్ డైవర్షన్ పాలి‘ట్రిక్స్’ చేస్తున్నాడు.
‘నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం చుట్టి వస్తుంద’న్నట్టుగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పొలిటికల్ టూరిస్టుల కనికట్టు విద్యలు, స్థానిక హస్తం నేతల మాయల హామీలను నమ్మి నీతిగల్ల తెలంగాణ సమాజం మోసానికి గురైంది. కేసీఆర్ అంటేనే ఒక చరిత్ర. ఆయన ముందు రేవంత్‌రెడ్డి ఎంత? ‘మళ్లీ కేసీఆరే సీఎం కావాలి’ అన్న నినాదాలు తెలంగాణలో ఊపందుకున్నాయి. కేసీఆర్ ప్రభ ఎంతటిదో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.