ఎన్నికలు వస్తే చాలు నాయకులు అధికారమే పరమావధిగా ప్రజలకు ఇష్టారీతిన హామీలు ఇవ్వడం షరామామూలైంది. తీరా అధికారం చేజిక్కిన తర్వాత ఇచ్చిన హామీలను అటకెక్కించటం ఆధునిక నాయకుల్లో గమనిస్తున్నాం. వారికి ఒక నిర్దిష్టమైన ఆర్థిక విధానం అంటూ లేకుండా అయితే అప్పులు చేస్తూ, లేకుంటే ధరలు పెంచుతూ ప్రజలను నయవంచనకు గురిచేస్తున్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అసాధ్యమైన ఆరు గ్యారెంటీల్లో భాగంగా 13 హామీలను 100 రోజుల్లో అమలుచేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ముఖ్యంగా రైతుల ఓట్లను కొల్లగొట్టేందుకు ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం’ అని హామీ ఇచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 2 నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్ అంశాన్ని సాకుగా చూపిన రేవంత్‌రెడ్డి సర్కార్ రుణమాఫీ అమలుపై మరింత కాలయాపన చేసింది. పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు రుణమాఫీ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది. వచ్చే ఆగస్టు 15వ తేదీ లోగా ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని చేసితీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల సాక్షిగా ప్రమాణాలు కూడా చేశారు.
ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసింది. హామీల అమలు కోసం ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తారని ముందే గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం పలు కొత్త విధానాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే చెలామణిలో ఉన్న మద్యం పాలసీలో కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టింది. ఒక్కో బాటిల్ మీద రూ.80 నుంచి రూ.100 వరకు ఎక్కువ వచ్చేవిధంగా ప్రణాళికలను రచించింది. అంతేకాదు, భూముల మార్కెట్ విలువను పెంచి రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా భారీగా పెంచేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నది. రెండేండ్ల కిందటే పెరిగిన రిజిస్ట్రేషన్ విలువను మళ్లీ పెంచి ఏడాదికి 20 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. రేవంత్ సర్కారు వికృత చేష్టలు పేద, మధ్య తరగతి ప్రజలపై అధిక భారాన్ని మోపుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పదేండ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ తొలి ఐదేండ్లలో కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ఎత్తిపోతల పథకాన్ని, కరెంటు స్థిరీకరణ కోసం యాదాద్రి థర్మల్ విద్యుత్తు ప్రాజెక్టులను నిర్మించారు. రాష్ట్రంలోని ప్రముఖ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను చక్కదిద్ది కరువు కాటకాలకు పేరుగాంచిన తెలంగాణ వ్యవసాయాన్ని దేశంలోనే అత్యధిక వరి పంట దిగుబడి వచ్చే రాష్ర్టాల్లో రెండవ స్థానంలో నిలిపారు. తెలంగాణను ధాన్యాగారానికి చిరునామాగా మార్చారు. విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపే ప్రాజెక్టులతో పాటు దగాపడ్డ తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారు. కానీ, రాష్ర్టాన్ని అప్పుల మయం చేస్తున్నారని, కేసీఆర్‌ను బదనాం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు పోటీపడ్డాయి.
మరి నాడు కేసీఆర్ అప్పులు చేసి తెలంగాణను ఆగం చేసిండని బద్నాం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. వచ్చిన మూడు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.18,100 కోట్ల అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాలి. అవగాహన లేమితో అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలు కోసం నానా తంటాలు పడుతున్నది. అందుకే ఆదాయ మార్గాల అన్వేషణలో పడింది. అందులో భాగంగానే మద్యం రేట్లను పెంచడం, భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచడం వంటి చర్యలకు పాల్పడుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు ధరలను పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నది. రేవంత్ సర్కార్ అవలంబిస్తున్న ఈ విధానం సరైనది కాదు.
అంతేకాదు, ఆగస్టు 15 వరకు రేవంత్‌రెడ్డి సర్కార్ ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీని అమలు చేయాల్సి ఉన్నది. దానికి సరిపడా నిధుల సేకరణలో భాగంగా ప్రజలపై భారం మోపేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సన్నాహాలు చేస్తున్నది. ఈ విధమైన చర్యలకు పాల్పడితే రేవంత్ సర్కార్ ప్రజాగ్రహానికి గురి కాకతప్పదు. అవగాహన లేమితో, అధికారం అనుభవించాలనే ఆరాటంతో కాంగ్రెస్ పార్టీ అలవికానీ హామీలు ఇచ్చిందనే వాస్తవం ప్రజలకు మెల్లిగా అర్థమవుతున్నది. ఆ హామీలను నెరవేర్చేందుకు ప్రజల నెత్తిపైనే భారం వేస్తామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన సమయంలో, సరైన రీతిలో బుద్ధి చెప్తారు.
(వ్యాసకర్త: బీఆర్ఎస్వీ నేత, కేయూ)
– పిన్నింటి విజయ్‌కుమార్ 90520 39109