ప్రభుత్వ ఉద్యోగులు ‘పదవీ విరమణ’ అనే ఘట్టాన్ని అనేక బాధ్యతల పరిష్కార మార్గంగా భావిస్తారు. మూడు దశాబ్దాల పాటు పనిచేసిన ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలను ఏ విధంగా వాడుకోవాల్నో ఏడాది ముందునుంచే రకరకాలుగా ప్రణాళికలు వేసుకుంటారు. కానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ‘పదవీ విరమణ’ అంటేనే ఉద్యోగులు నిస్పృహకు గురవుతున్నారు. ‘పదవీ విరమణ’ పొందిన కొన్నిరోజుల తర్వాత అందుకునే బెనిఫిట్స్ ఈ ప్రభుత్వ హయాంలో ఏడాది తర్వాత కూడా రాకపోవడమే అందుకు కారణం.
2024, మార్చి నుంచి రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 8 వేల మంది ఉద్యోగులు వివిధ క్యాడర్లలో పదవీ విరమణ పొందారు. 2025లో 9,630, 2026లో 9,780, 2027లో 10,302, 2028లో 8,760.. మొత్తంగా రానున్న నాలుగేండ్లలో దాదాపు 38 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందే అవకాశం ఉన్నది. వీరి ప్రయోజనాలు సుమారు రూ.20 వేల కోట్లుగా ఉంటాయని ఆర్థికశాఖ అంచనా. అంటే ఏటా 4 నుంచి 5 వేల కోట్ల వరకు ఏయేడుకాయేడు బడ్జెట్లో కేటాయిస్తే కానీ పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాలు దక్కవు. ఈ ఆర్థికభారం నుంచి ప్రభుత్వం తప్పించుకునేందుకు పదవీ విరమణ వయస్సు పెంపు ఒక మార్గంగా భావిస్తున్నది.
2014, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరినాక పదవీ విరమణ వయస్సు పెంచాలని ఉద్యోగ సంఘాల నుంచి వినతులు వచ్చినా, ఆ వినతులను కేసీఆర్ ప్రభుత్వం నిర్దంద్వంగా తిరస్కరించింది. కానీ, ఏపీ ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏండ్లకు పెంచింది. దీంతో తెలంగాణలోనూ ఉద్యోగ విరమణ వయస్సు పెంచాలనే డిమాండ్ రూపుదిద్దుకున్నది. ఉద్యోగ సంఘాల వినతి మేరకు కేసీఆర్ ప్రభుత్వం 2020 నుంచి పదవీ విరమణ వయస్సు 61కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. కానీ, రేవంత్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగులకు ఇవ్వవలసిన పెన్షన్ ప్రయోజనాలను తన టెన్యూర్‌లో ఇవ్వకుండా తప్పించుకోవడానికి మాత్రమే పదవీ విరమణ వయస్సును పెంచాలనే ఆలోచన చేస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు. అయితే, పదవీ విరమణ వయస్సు పెంపు వార్తలు రోజూ పత్రికల్లో వస్తున్నాయి.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర రిక్రూట్మెంట్ సంస్థల ద్వారా 1,62,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది. అంతేకాదు, ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా పేరు గడించింది. అన్నివర్గాల ఉద్యోగులకు గణనీయంగా రెండు పీఆర్సీలలో 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. దేశంలోనే మొదటిసారి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 73 శాతం జీతాలు పెంచడం చరిత్రాత్మకం.
2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏటా 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది దాటినా 2 లక్షలేమో కానీ, కనీసం 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని ప్రక్రియలను పూర్తిచేసి 45 వేల ఉద్యోగాలను సిద్ధం చేసింది. ఎన్నికల కోడ్, ఇతర న్యాయపరమైన సమస్యల కారణంగా నియామక పత్రాలను అందించలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధం చేసిన 45 వేల ఉద్యోగాలకే ఇప్పుడు నియామక పత్రాలు అందిస్తూ తమ గొప్పతనంగా ప్రచారం చేసుకుంటున్నది. ఇదిలా ఉంటే మిగతా 1.50 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయిందో చెప్పడం లేదు. అంతేకాదు, ఉద్యోగాలేవి? అని అడుగుతున్న నిరుద్యోగులను నిర్బంధిస్తున్నది. వారి ఆవేదనను, ఆగ్రహాన్ని ప్రతిపక్షాల కుట్రగా అభివర్ణిస్తున్నది.
పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తమ ప్రయోజనాలు తమకు చెల్లించాలని హైకోర్టును ఆశ్రయించడం చరిత్రలో తొలిసారి. ఉద్యోగులు జీవితకాలం పలు హోదాలలో పనిచేసి ప్రభుత్వంపై న్యాయపోరాటం చేయడం విషాదం. శేష జీవితంలో పిల్లాపాపలతో ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్న ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మానసికంగా ఇబ్బందులు పెడుతున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రిటైర్మెంట్ ఉద్యోగుల ప్రయోజనాలను చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఈ సందర్భంగా టీడీపీ ప్రభుత్వ హయాం నాటి ఒక సంఘటన గుర్తుకువస్తున్నది. నాటి టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు 9 విడతల కరువు భత్యాన్ని నిలిపివేసింది. దీంతో పెన్షనర్లు తమ పెన్షన్ నుంచి ప్రతి ఒక్కరూ రూ.100 ఖర్చుచేసి పోస్ట్ కార్డ్స్ కొన్నారు. టీడీపీ ప్రభుత్వానికి జీవితకాలంలో ఓటు వేయొద్దని ఆ కార్డుల ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ లక్షల ఉత్తరాలు రాశారు.
ఇక రాష్ట్ర ఉద్యోగుల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. 1వ తేదీన జీతాలు ఇస్తున్నామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనిచేయడం లేదు. పైగా దాని పేరు మీద అన్ని ప్రయోజనాలను నిలిపివేసింది. ట్రావెలింగ్ అలవెన్స్, సరెండర్ లీవ్‌తో పాటు అన్ని సప్లిమెంటరీ బిల్స్ పెండింగ్‌లో పెట్టి చేతులెత్తేసింది. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటు మెప్మా, ఆశా వర్కర్లకు కూడా నెలల తరబడి జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి.
విద్యాశాఖలో పనిచేసే ఫ్యాకల్టీ సిబ్బందికి ఆరు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెంటనే డీఏ చెల్లిస్తామని చెప్పి, ఒకే ఒక్క విడత కరువు భత్యం మంజూరు చేసి, మిగతా నాలుగు విడతలను ఆపేసింది. అవి ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పీఆర్సీ వస్తుందా అనే అనుమానం ఉద్యోగుల్లో ఇప్పటికే మొదలైంది.
ఇక ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నది. ప్రభుత్వ అవలంబిస్తున్న విధానానికి, వివక్షకు నిరసనగా వచ్చే నెల ఫిబ్రవరి 9వ తేదీ నుంచి సమ్మెకు పోతున్నట్టు కార్మికులు ఇప్పటికే ప్రకటించారు.
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కంటే మెరుగైన పాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నివర్గాల ప్రజలను మోసం చేసినట్టే ఉద్యోగులను సైతం మోసం చేస్తుండటం అత్యంత బాధాకరం.
– (వ్యాసకర్త: కార్పొరేషన్ మాజీ చైర్మన్)
జి.దేవిప్రసాద్ రావు 90006 33404