ఏ సర్వేలకు అందని విషయాలను, ఏ వ్యూహకర్త చెప్పని లోతును కొన్నిసార్లు సాధారణ ప్రజలు చెప్తారు. ఏ చర్య వల్ల ఎలాంటి ఫలితం వస్తుందో పలు సందర్భాల్లో వారు విశ్లేషిస్తారు. ఇలాంటి అనుభవమే మాకు ఎదురైంది. ఎన్నికల హడావుడి. పార్టీలు పోటీలు పడి మరీ ప్రజలకు హామీలిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో.. ప్రజల జీవితాలను ఎట్లా మారుస్తామో కూడా సోషల్ మీడియాలో ప్రచార హోరును పెంచి చెప్తున్నాయి. మరి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? వారు గుర్తించిన, గుర్తిస్తున్న అంశాలు ఏమేం ఉన్నాయి? ఈ ఎన్నికల గురించి వారేమనుకుంటున్నారనే విషయాల గురించి మాట్లాడుకుంటూ నేను, ప్రభాకర్‌రెడ్డి కలిసి పాలమూరు జిల్లాకు వెళ్లాం.
హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం శివారుకు వెళ్లేదాకా మా చర్చలు సాగుతూనే ఉన్నాయి. పాత పాలమూరు రూపురేఖలు మారడాన్ని స్పష్టంగా గమనించాం. రోడ్డుకిరువైపులా పచ్చదనం, కేసీఆర్ ఎకో పార్కు, సుందరంగా ముస్తాబైన చెరువులు, ఇన్నర్ రింగ్ రోడ్డు అంతా మారిపోయిన అంశాలను చూస్తూ ముందుకుసాగాం. జిల్లా కేంద్రానికి కాస్త దూరంలో ఉన్న హన్వాడ మండలంలోని ఓ చిన్న తండా వద్దకు చేరుకున్నాం. ఎన్నికల విషయాల గురించి నేరుగా మాట్లాడకుండా ఏవేవో కొన్ని ముచ్చట్లు పెట్టిన తర్వాత తండాలను చూసేందుకు వచ్చామని చెప్పాం. వారు మా గురించి తెలుసుకోవాలని ఉత్సుకత చూపలేదు. ‘ముందుగా కాస్త ఎంగిలి పడుండి. చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు’ అంటూ మాకు భోజనాలు పెట్టారు. మేం ఎవరో వారికి తెలియదు. మాక్కూడా వారెవరో తెలియదు. కానీ, వారిచ్చిన మర్యాద మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. జొన్నరొట్టెలు, కోడికూర చేసి పెట్టారు. తాము పేదవారమే అయినా ప్రేమకు, మర్యాద చూపించడంలో ఉన్నతులమని నిరూపించారు. మా కోసం కొంత ఖర్చుపెట్టేందుకు వెనుకాడలేదు. నేను జర్నలిస్టుగా అదే జిల్లావాసిగా అక్కడి పరిస్థితులు నాకు కొంతవరకు తెలుసు. వారి భోజనం, జీవన నాణ్యత వంటి విషయాలనూ గమనిస్తూనే ఉన్నాను. మాటల సందర్భంలో ఎన్నికల ప్రస్తావన వచ్చింది. ‘ఓహో మీరు ఎన్నికల గురించి తెలుసుకునేందుకు వచ్చారా?’ అని మాకు ఆతిథ్యం ఇస్తున్న ఇంటివారు దాదాపు అందరూ ఒకేసారి అడిగారు. ‘హా.. అవును’ అని చెప్పాను. సూటిగా సుత్తి లేకుండా వారి మనస్సులో మాట చెప్పారు. ‘ఇంకెవరికి సారూ… పదేండ్ల కిందికి, ఇప్పటికి చాలా మారింది. పంటలు పండుతున్నాయి. మా తండాకు వస్తుంటే మీరే చూసిండ్రు గదా నీళ్లు, పంటలు. అవి ఇచ్చినోళ్లకు ఓటేస్తం’ అంటూ తాము ఎవరికి ఓటేయాలనుకుంటున్నారో చెప్పకనే చెప్పారు.
తమ ప్రాంతంలోని ప్రజలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో కూడా చెప్పారు. పదేండ్ల కింద బతుకుదెరువు కోసం ఒంట్లో శక్తి ఉన్నవాళ్లు హైదరాబాద్‌కు వలస వెళ్లేవారు. లేనివారు జిల్లా కేంద్రం పాలమూరుకు వచ్చి చిన్నాచితక పనులు చేసుకునేవారు. కానీ, ఇప్పుడు పచ్చటిచేన్ల బతుకమ్మలా మెరిసిపోతున్న తండాలు కన్పిస్తున్నాయి. ఆకు రాలే కాలంలో కూడా పచ్చదనం పర్చుకున్న చెల్కలు అచ్చిపోయేవారిని పలకరిస్తున్నాయి. ఈ వాతావరణమే వారి ఓటు నిర్ణయానికి కారణమై ఉండొచ్చు. అంతేకాదు, ఇండ్ల గురించి, పింఛన్ల గురించి, పెండ్లిళ్ల గురించి, ప్రస్తుత ప్రభుత్వం అందిస్తున్న సాయం గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మేం ఇవ్వన్నీ మాట్లాడుతుండగానే మరి కొంతమంది అక్కడికి వచ్చారు. వారు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ‘నీతిగా బతకాలి. మనకు సాయం చేసినవారికి ఓటేయాలి’. మాట కాస్త అటు ఇటుగా అందరూ అదే చెప్పారు. వాస్తవానికి తండాల్లో మునుపటి తండ్లాట లేకపోవడం కూడా వారి ధైర్యానికి కారణమై ఉండొచ్చు. ప్రతీ తండాకు రోడ్డు సౌకర్యం ఉంది. కొద్దో గొ ప్పో వ్యవసాయ పొలం ఉంటే దానికి కరెంటు, నీళ్ల సౌకర్యం వచ్చింది. వ్యక్తులుగా, వ్యవస్థగా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన సరికొత్త మార్పు ఇది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, విధానాల ప్రతిఫలాలు ప్రజలకు చేరితే వారు ఎంతటి కృతజ్ఞతతో ఉంటారో చెప్పేందుకు హన్వాడలోని దొనబండ తండా ఓ మంచి ఉదాహరణగా చెప్పొచ్చు.
నాటి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పదేండ్ల కిందట సుమారు 40 లక్షల జనాభా ఉండేది. అందులో సగానికి సగం హైదరాబాద్, బాంబే, ఛత్తీస్‌గఢ్ నగరాలతో పాటు దేశవ్యాప్తంగా జరిగే వివిధ నిర్మాణాల్లో పనులు చేసేందుకు గుంపులుగా వెళ్లేవారు. అక్కడ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉండగా, అవిటితనంతో బతుకుతున్నవాళ్లు ప్రతీ ఊళ్లో ఇప్పటికీ ఉన్నారు. అంతా కూలీనాలీ చేసుకునే జనం. నీటి వసతిలేని అరకొర భూమి ఉన్నా ప్రయోజనం లేక తండాలకు తండాలే, ఊళ్లకు ఊళ్లే ఖాళీ అయ్యేవి. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లేదారిలో ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న రెండు వందల కిలోమీటర్ల వరకు కొత్తకోట, వనపర్తి ప్రాంతాల్లో మాత్రమే మనకు పచ్చదనం కన్పించేది. కానీ, ఇప్పుడు దృశ్యం మారిపోయింది. పల్లె, తండా చెరువులు జలసిరులను అద్దుకున్నాయి. మక్కజొన్న, కంది, ఆముదం పంటల స్థానంలో కూరగాయలు, వరి, మిర్చి వంటి పంటలు సాగువుతున్నాయి.
హన్వాడలోని దొనబండ తండాలో అవ్వాతాతలు చెప్పిన మాటలివి. ‘తమను బాగుచేసిన వారికే ఓటు’ అనే మాట నాగలికర్రుతో జీవనం సాగించే దాదాపు అందరి నోటా వినిపిస్తున్నది. ప్రజలే వాస్తవాలను గుర్తిస్తారు, చేసిన మేలును మర్చిపోబోమని, ఎవ్వరూ మరువొద్దని కూడా వారు తమ చేతల ద్వారా చెప్పారు. గతంలోని అనేక విషయాలను చర్చించుకుంటూ భోజనం పెట్టిన వారికి కృతజ్ఞతలు చెప్పుకొంటూ పట్నం బాట పట్టినం.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
-అస్కాని మారుతీ సాగర్
90107 56666