‘రైతే రాజు’గా భావించిన మన దేశంలో ఆ రైతులనే అరిగోస పెడుతున్నది మోదీ ప్రభుత్వం. ముఖ్యంగా తెలంగాణ రైతులపై మరింత వివక్ష చూపుతూ, వరి ధాన్యం కొనే విషయంలో అనేక కొర్రీలు పెట్టింది. అయినప్పటికీ, రైతుబాంధవుడు కేసీఆర్.. తెలంగాణ అన్నదాతలకు కష్టం రాకుండా ఆ బాధ్యతను భుజాన వేసుకున్నారు. సీఎం హామీ మేరకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు చురుకుగా కొనసాగుతుండటం హర్షణీయం.
రాష్ట్ర రైతాంగాన్ని కేంద్రం పట్టించుకోకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం అక్కున చేర్చుకున్నది. వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారం… ఎక్కడికక్కడ గ్రామాల్లోనే వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి కనీస మద్దత ధర రూ.1960 చెల్లిస్తూ వరి ధాన్యం కొంటున్నది. రైతుల పట్ల కేసీఆర్కు ఉన్న ప్రేమను చూసి దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతున్నది. దక్షిణాది రాష్ర్టాలపై వివక్ష చూపుతున్న కేంద్రానికి తమ సత్తా ఏమిటో చూపిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు యావత్ దేశానికి వర్తిస్తే ఫర్వాలేదు. కానీ పంజాబ్, హర్యానా రైతులు పండించే ధాన్యాన్ని నేరుగా కొంటున్న కేంద్రం, తెలంగాణ విషయానికి వచ్చేసరికి పట్టించిన బియ్యమే కొంటామని చెప్పడం తెలంగాణపై వివక్ష చూపడమే. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. సాగు విస్తీర్ణం అమాంతం పెరిగింది. ప్రధానంగా వరి సాగు విస్తారంగా విస్తరించి అధిక దిగుబడి వస్తున్నది. అయితే వరి ధాన్యాన్ని నేరుగా కేంద్రమే కొనే పద్ధతి ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వాన్ని, రైతాంగాన్ని ఇబ్బందుల పాలు చేయాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఆంక్షలు విధించడం ఖండనీయం. రైతు ను రాజుగా చూడాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష. అందుకే రాష్ట్రంలో అనేక రైతు సంక్షేమ పథకాలను అమ లుచేస్తున్నారు. ఫలితంగా అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఇది ప్రభుత్వం సాధించిన చారిత్రక విజ యం. తెలంగాణ రైతాంగం బాగుపడుతుంటే మోదీకి గిట్టడం లేదు. అందుకే రైతుల పట్ల విషం గక్కుతూ నిలువునా ముంచాలని చూస్తున్నారు. కేసీఆర్ మాత్రం రైతులను తామే ఆదుకుంటామని ప్రకటించి రైతు పక్షపాతిగా నిలిచారు.
ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ అంచనాల ప్రకారం 35.84 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. సుమారు 83.83 లక్షల టన్నుల ధాన్యం దిగుబడయ్యే అవకాశం ఉన్నది. ఇందులో కొంత విత్తన కంపెనీలు, రైస్ మిల్లర్లతో కుదిరిన ఒప్పందం ద్వారా వరిధాన్యం పోతే చివరి కి మిగిలేది 65 లక్షల టన్నుల ధాన్యం. దీనిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఈ ధాన్యాన్ని పట్టిస్తే 56.46 లక్షల టన్నుల బియ్యంగా మారే అవకాశం ఉన్నది. ఈ అంచ నా ప్రకారం ప్రభుత్వం సుమారు రూ.1200 కోట్లు నష్టపోతున్నది. అయినా రైతు సంక్షేమం కోసం కేసీఆర్ ఎక్క డా వెనుకడుగు వేయకుండా చివరి గింజవరకు కొంటామని హామీనివ్వడం అభినందనీయం. కేసీఆర్ ఏ నిర్ణ యం తీసుకున్నా అది చరిత్రాత్మకమే. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలుకావాలని కేసీఆర్ ఆరాటపడుతున్నారు. అందుకే ‘సమగ్ర వ్యవసాయ విధానం’ కోసం తపిస్తున్నారు. దీనికోసం దేశంలోని వివిధ రైతు సంఘాల ప్రతినిధులను ఆహ్వానించి కొత్త వ్యవసాయ చట్టం కోసం పోరాటం చేయనున్నారు. అది విజయవంతం కావాలని, రైతులకు మేలు జరగాలని ఆశిద్దాం.
డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
(వ్యాసకర్త: రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్)