కన్నాయిగూడెం, నవంబర్ 9 : మంత్రి సీతక్క ఇలాకాలో ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగానే మిగులుతున్నది. సిబ్బంది నిర్లక్ష్యంతోనే పాము కాటుతో బాలు డు మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబసభ్యులు, బంధువులు మృతదేహంతో పీహెచ్‌సీని ముట్టడించారు. వివరాలిలా ఉన్నాయి.. గూర్రేవుల గ్రామానికి చెందిన తిరుణగరి రాజు-సంగీత దంపతుల చిన్న కుమారుడు హరినాథ్ (7) పాముకాటుకు గురై శనివారం మృతి చెందగా, బాలుడి మృతికి వైద్యులు, సిబ్బందే కారణమని పీహెచ్సీ ఎదుట ధర్నా చేశారు. వారినని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
మందుల్లేవని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని, ఇంజక్షన్స్ ఉంటే 108లో ఏటూరునాగారం సీఎచ్సీకి ఎందుకు తీసుకుపోతామని వాపోయారు. మంత్రి సీతక్క నియోజకవర్గంలో వైద్యులు పట్టించుకోకుండా పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్ ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. తహసీల్దార్ సర్వర్, అధికార పార్టీ నాయకులు చెప్పినా బాధితులు వినలేరు. దీంతో సీఐ చొరవ తీసుకొని డీఎంహెచ్‌వోతో ఫోన్లో మాట్లాడి నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బందిని సస్పెండ్ చేస్తానని ఒప్పకున్నట్లు బాధితులకు నచ్చజెప్పారు. కేసు నమోదుకు పోస్టుమార్టం రిపోర్ట్ కావాలని మృతదేహాన్ని ఏటూరునాగారం మార్చురీకి తరలించారు.