అన్నదాతను కష్టాలు వెంటాడుతున్నాయి. వానకాలం సీజన్లో వరి సాగు చేసింది మొదలు ధాన్యం విక్రయించే వరకు నిత్యం కష్టాలు ఎదురవుతున్నాయి. నాటు వేసిన తర్వాత ఒకవైపు కరెంటు కోతలతో సాగునీరు సరిగ్గా అందక.. యూరియా బస్తాలు లేక పంట ఎదగక దిగుబడి తగ్గగా.. ఇటీవల వచ్చిన మొంథా తుపాన్ తీవ్రంగా నష్టపరిచింది. దీంతో మిగిలిన ధాన్యమైనా విక్రయిద్దామని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యం.. నిర్వాహకులు పెడుతున్న కొర్రీలు రైతును కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
తేమ, తాలు పేరుతో అడ్డగోలుగా క్వింటాల్‌కు 5 కిలోలకు పైగా అదనంగా తూకం వేస్తున్నా ఎవరికి చెప్పుకోవాలో తెలియక దీనంగా కనిపిస్తున్నారు. మరో పక్క అడ్డగోలుగా హమాలీ ఖర్చులు పెంచడంతో ఇవన్నీ చూస్తూ చేసేదేమీ లేక పలుచోట్ల దళారులను ఆశ్రయిస్తూ అడ్డగోలు అగ్గువ ధరకు తమ శ్రమను ధారపోస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కరీంనగర్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఈ వాన కా లం సీజన్ అన్నదాతకు కలిసి రాలేదు. ఒక పక్క ప్రకృతి ప్రకోపం మరో పక్క నిలువెల్లా దోపిడీ రైతన్న వెతకు అద్దం పడుతోంది. కొనుగోళ్లలో జాప్యం కారణంగా రైతులు కేంద్రాల వద్దనే రోజుల తరబడి పడిగాపులు పడాల్సి వస్తోంది. తేమ సాకుతో ధాన్యం తూకం వేయడం లేదని రైతులు వాపోతుంటే, నిబంధనల ప్రకారం 17 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని కూడా తూకం వేయ డం లేదని ఇంకొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేం ద్రాల్లో 17 శాతం తేమ వచ్చి, తూకం వేసిన ధాన్యాన్ని కూడా కొందరు మిల్లర్లు తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రాల్లో తేమ శాతం చూసిన తర్వాత నిబంధనల ప్రకారం ఉంటేనే తాము తూకం వేసి మిల్లులకు పంపిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. మిల్లులకు వెళ్లిన తర్వాత యజమానులు మరోసారి తేమ శాతా న్ని చూసి కొర్రీలు పెడుతున్నారు. ఈ సాకును చూపి కిలోలకు కిలోలు తరుగు తీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తూకంలో ముందే తరుగు
తేమ శాతం సరిగ్గా ఉన్నా, తాలు పేరిట కొనుగోలు కేంద్రాల్లోనే అదనంగా తూకం వేస్తున్నారు. 40 కిలోల సంచి బరువు 580 గ్రాములు కలుపుకొని 2 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారు. అంటే ప్రతి బస్తాకు 42.5 కిలోలు తూకం వేస్తూ 40 కిలోలే రాస్తున్నారని రైతులు వాపోతున్నారు. క్వింటాలుకు ఇది 5 కిలోలకు మీదనే అదనపు తూకం అవుతోంది. ఈ వానకాలం సీజన్‌కు ఏ-గ్రేడు ధాన్యానికి కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,389 ఉంది. ఈ లెక్కన 5 కిలోలకు ధర కట్టినా ఒక క్వింటాలుపై రూ.120 వరకు రైతుకు నష్టం వస్తోంది. వంద క్వింటాళ్లు విక్రయించిన రైతు సుమారు రూ.12 వేలు నిలువు దోపిడీకి గురవుతున్నాడంటే అదనపు తూకం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్రాల్లో ఈ పరిస్థితి ఉన్నదంటే కొన్ని మిల్లుల యజమానులు కూడా కొర్రీలు పెట్టి క్వింటాల్‌పై 2 కిలోల వరకు తరుగు తీసేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు.
హమాలీ ఖర్చులు అదనపు భారం
హమాలీ ఖర్చులు కూడా రైతులు భరించలేని స్థితిలో ఉన్నారు. 40 కిలోల బస్తాలో వడ్లు నింపితే రూ.7 తూకం వేసి లోడ్ చేస్తే రూ.15 చొప్పున హమాలీలు తీసుకుంటున్నారు. అంటే ప్రతి 40 కిలోల బస్తాపై రూ.22 ఖర్చు భరించాల్సి వస్తోంది. అదే క్వింటాలుకైతే రూ.55 భరించక తప్పడం లేదు. హమాలీలకు నిర్ధిష్టమైన కూలి రేట్లు నిర్ణయించక పోవడంతో ఒక్కో చోట ఒక్కో రకంగా వసూలు చేసుకుంటున్నారు. ఇటీవల వీణవంక మండలం నర్సింగాపూర్‌లో ఇదే జరిగింది. గత వానకాలంలో ఇచ్చినట్లు కాకుండా అదనంగా రేట్లు పెంచాలని హమాలీలు భీష్మించుకున్నారు.
దీంతో రైతులు బిహార్ కూలీలతో పనులు చేయించుకునేందుకు సిద్ధపడగా అడ్డుకున్నారు. చివరకు ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నిజానికి గత యాసంగిలో చాలా కేంద్రాల్లో ప్రతి క్వింటాల్‌కు రూ.35 మాత్రమే హమాలీ రేటు ఉండేది. ఇప్పుడు మాత్రం ఒకేసారి రూ. 55 డిమాండ్ చేస్తుండడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. పలు చోట్ల హమాలీలు, రైతుల మధ్య తగువులు ఏర్పడుతున్నా అధికారులు జోక్యం చేసుకోవడం లేదు. అసలే హమాలీల కొరతతో కొనుగోళ్లు ముందుకు సాగడం లేదని, ఈ విషయాన్ని రైతుల నిర్ణయానికే వదిలేసినట్లు అధికారుల వైఖరిని బట్టి తెలుస్తోంది. జిల్లా మొత్తంలో అన్ని కొనుగోలు ఏజెన్సీలకు హమాలీ ధరలు అధికారులే నిర్ణయిస్తే బాగుండేదని రైతులు వాపోతున్నారు.
దళారుల రంగ ప్రవేశం
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలకు అనేక కొర్రీలు, తరుగు తీయడం వంటి కారణాలతో కొందరు రైతులు విసిగిపోతున్నారు. దీంతో కోతల వెంటనే పచ్చి వడ్లను దళారులకు అమ్ముకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏ-గ్రేడు ధాన్యానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 ప్రతి క్వింటాల్‌కు ఇవ్వాలని నిర్ణయించింది. తాలు, తడుపు పేరిట, ధాన్యం రంగు మారిందని, తేమ రావడం లేదని కొర్రీలు పెడుతుండడంతో రైతులు తమ ధాన్యాన్ని మధ్య దళారులకు, మిల్లర్లకు విక్రయిస్తున్నారు.
హుజూరాబాద్ డివిజన్లో ఎక్కువగా ఈ పరిస్థితి కనిపిస్తోంది. గంగాధర మండలం కురిక్యాలలో ఇటీవల స్థానిక కొనుగోలు కేంద్రం నుంచే ఒక రైతుకు చెందిన ధాన్యాన్ని దళారి తూకం వేసుకుని తీసుకెళ్లాడు. తరుగు పేరిట 5 కిలోలకు రూ.120, హమాలీ ఖర్చులు రూ.55 భరించడం, 17 శాతం తేమ వచ్చేంత వరకు ధాన్యాన్ని ఆరబెట్టడం, ఆరిన తర్వాత రోజుల తరబడి కేంద్రాల్లో పడిగాపులు కాయడం కంటే తక్కువ ధరకు దళారులకు విక్రయించడమే మేలని కొందరు రైతులు భావిస్తున్నారు. రైతుల బలహీనతను ఆసరా చేసుకుంటున్న దళారులు క్వింటాల్‌కు రూ.1,750 నుంచి రూ.1,800 మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ రకంగా కూడా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.