హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లో కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ, పార్కు స్థలాలు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. కొంతమంది రియల్ కేటుగాళ్లు పార్కులు, ప్రభుత్వ స్థలాలను టార్గెట్ చేసుకుని వాటికి నకిలీ పత్రాలను సృష్టించి కోట్ల రూపాయలకు విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొంతమంది అధికారుల అండదండలు కూడా ఉన్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ఇటీవల జిల్లా పరిధిలోని పలు శివారు మున్సిపాలిటీల్లోని కాలనీవాసులు ముందుకొచ్చి ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై హైడ్రాకు, ఆయా మున్సిపాలిటీల అధికారులకు, తహసీల్దార్లకు ఫిర్యాదులు చేస్తున్నారు.
అలాగే, ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిలో కూడా పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపైనే పెద్దఎత్తున ఫిర్యాదులొస్తున్నాయి. జిల్లా పరిధిలోని శివారు మున్సిపాలిటీల్లో గతంలో ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ, డీటీసీపీ, హెచ్ఎండీఏ వంటి లేఅవుట్లల్లో పార్కులకు, ప్రభుత్వ అవసరాలకు భూములు వదిలేశారు. శివారు మున్సిపాలిటీల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో గతంలో ఈ వెంచర్లు చేసిన యజమానులు ప్రభుత్వ, పార్కు స్థలాలకు నంబర్లు వేసి దొంగ పత్రాలను సృష్టించి.. ప్లాట్లు చేసి విక్రయించారు. ప్రస్తుతం ఈ లేఅవుట్లలో 70 శాతానికి పైగా పార్కులు, ప్రభుత్వ స్థలాలపై క్రయవిక్రయాలు జరిగాయి. వీటిపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించి అన్యాక్రాంతమైన ప్రభుత్వ పార్కు స్థలాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
శివారు మున్సిపాలిటీల్లో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో అక్రమార్కులు పార్కులు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి విక్రయించారు. కబ్జాకు గురైన ప్లాట్లు, ప్రభుత్వ స్థలాలకు సైతం మున్సిపాలిటీ అధికారులు అనుమతులివ్వడంతో నిర్మాణాలు కూడా జరిగాయి. ఈ విషయమై సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలిసే అనుమతులిచ్చినట్లు ఆరోపణలొస్తున్నాయి. ప్రభుత్వ పార్కు స్థలాలను కాపాడాల్సిన అధికారులు వాటిలో నిర్మాణాలకు అనుమతులివ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
జిల్లా పరిధిలోని పలు మున్సిపాలిటీల్లో వెలసిన వేలాది కాలనీల్లో వదిలిన పార్కు స్థలాలు, ప్రభుత్వ అవసరాల నిమిత్తం వదిలిన భూములను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారంటూ ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా శివారు మున్సిపాలిటీల్లోని పెద్దఅంబర్‌పేట్, తుర్కయాంజాల్, తుక్కుగూడ మున్సిపాలిటీలతోపాటు అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం మండలాల్లో గతంలో జీపీ, డీటీపీసీల పేరుతో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ పెద్దఎత్తున లేఅవుట్లు వేసింది. గతంలో లేఅవుట్ల సమయంలో పార్కులు, ప్రభుత్వ అవసరాల కోసం స్థలాలను కూడా వదిలిపెట్టారు. క్రమంగా కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లల్లోని ప్రభుత్వ అవసరాల కోసం వదిలిన భూములు, పార్కు స్థలాలను కబ్జా చేశారు.
వీటిని గుర్తించిన గ్రామస్తులు, కాలనీవాసులు వీటిపై ఫిర్యాదు చేశారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీగణపతి కాలనీలో సుమారు రూ.50 లక్షల విలువచేసే ప్రభుత్వ పార్కు స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకోగా.. హైడ్రా అధికారులు రంగంలోకి దిగి కూల్చివేశారు. ఆదిబట్ల మున్సిపాలిటీలోని ఓ వెంచర్లో ఆక్రమణకు గురైన స్థలాన్ని కూడా మున్సిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే మున్సిపాలిటీలోని ప్రగతినగర్‌లో పార్కు స్థలాన్ని కబ్జాచేసి ప్లాట్లుగా మార్చారు.
ఈ స్థలం విలువ సుమారు రూ.2కోట్లకు పైగా ఉంటుందని, వెంటనే చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు హైడ్రా అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చారు. తొర్రూరు మున్సిపాలిటీలోని సైబర్ సిటీలో కూడా ప్రభుత్వ స్థలం, పార్కు స్థలం కూడా కబ్జాకు గురయ్యాయి. వీటిపై కూడా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. తుర్కయాంజాల్ గంగిరెడ్డి కాలనీతోపాటు మన్నెగూడ, ఇంజాపూర్, తొర్రూరులతోపాటు ఇబ్రహీంపట్నం మండలంలోని ఓ రియల్ ఎస్టేట్‌లో కూడా పార్కుస్థలాలతోపాటు ప్రభుత్వ స్థలాలను కూడా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి విక్రయాలు జరిపినట్లు ఆరోపణలొస్తున్నాయి. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్‌పల్లి, పటేల్‌గూడ, కొంగర, తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాల, తుక్కుగూడ తదితర గ్రామాల్లో కూడా పెద్దఎత్తున పార్కు స్థలాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు.
హెచ్చరిక బోర్డులతోనే సరి..
శివారు మున్సిపాలిటీల్లోని పలు కాలనీల్లో ప్రభుత్వ పార్కు స్థలాలు కబ్జాలకు గురైనట్లు గుర్తించిన కాలనీవాసులు అధికారులకు ఫిర్యాదు చేస్తుండగా.. కేవలం హెచ్చరిక బోర్డులు పెట్టి వదిలేస్తున్నారు. అనంతరం కబ్జారాయుళ్లు మాత్రం హెచ్చరిక బోర్డులు తొలగించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. కబ్జాలకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి ప్రహరీలు నిర్మించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
ప్రభుత్వ, పార్కు స్థలాలకు పత్రాలు సృష్టించి విక్రయాలు..
శివారు మున్సిపాలిటీల్లో భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వ భూములకు పార్కు స్థలాలకు పత్రాలు సృష్టించి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. అవి పార్కు స్థలాలని తెలియక ఎంతోమంది కొనుగోలుచేసి లబోదిబోమంటున్నారు. ఈ విషయంపై ఇటీవల తప్పుడు పత్రాలు సృష్టించి తమకు ప్లాట్లు విక్రయించారని పలువురు పోలీసుస్టేషన్లను కూడా ఆశ్రయించారు. శివారు మున్సిపాలిటీల్లోనే అత్యధికంగా ఫిర్యాదులొస్తున్నాయి. ప్రభుత్వ స్థలాల్లో ప్లాట్లు చేసి విక్రయించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొహం చాటేస్తున్నారు. ఎక్కడో దూర ప్రాంతాల నుంచి తెలియకుండా ప్లాట్లు కొనుగోలు చేసి ఎంతోమంది మోసపోతున్నారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం వేసిన కమిటీలు కూడా నామమాత్రంగా మిగిలిపోయాయని ఆరోపణలొస్తున్నాయి.
వెలుగులోకి వచ్చిన 100 కోట్ల భూమాయ
అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో వంద కోట్ల భూమాయ ఇటీవల వెలుగులోకి వచ్చింది. గతంలో బాటసింగారం గ్రామంలో సర్వే నం.376లో 223 ఎకరాల్లో ఓ లేఅవుట్‌ను ఏర్పాటు చేశారు. ఈ లేఅవుట్లో ప్రజా పార్కులు, ప్రజా ప్రయోజనాల కోసం లక్ష గజాల భూమిని వదిలిపెట్టింది. కాగా, ఇటీవల ఆ భూమికి కొంతమంది వ్యక్తులు నకిలీ ప్రొసీడింగ్ సృష్టించి ప్లాట్లుగా మార్చి విక్రయించారు. ఈ విషయంపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు విక్రయించడంపై దర్యాప్తు చేసి ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇదే తరహాలో ఆదిబట్లలో ఏర్పాటు చేసిన ఓ లేఅవుట్లో కూడా ప్రభుత్వ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయించినట్లూ ఆరోపణలొస్తున్నాయి. ఆరోపణలపై విచారణ జరిపిన మున్సిపల్ అధికారులు ఆ స్థలాలను గుర్తించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. శివారు మున్సిపాలిటీల్లో జరుగుతున్న ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.