సిటీ బ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : భారత రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచారంలో కొత్త ట్రెండ్ సృష్టించింది. ప్రచార పర్వానికి నూతన హంగులు తీసుకొచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేదికగా వినూత్న ప్రచార పంథాకు శ్రీకారం చుట్టింది. అధికార కాంగ్రెస్ రెండేండ్లుగా తెలంగాణ ప్రజలకు చేసిన మోసాలను కండ్లకు కట్టినట్లు చూపింది. ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరిట అన్ని వర్గాలను వంచించిన తీరును ప్రచారంలో ప్రజలకు వివరించింది. రోడ్‌షోలకు కొత్త రూపు తీసుకొచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేపట్టిన రోడ్‌షోల కార్నర్ మీటింగ్‌ల్లో స్క్రీన్లను ఏర్పాటు చేసి కాంగ్రెస్ మోసాలను వీడియోల రూపంలో ప్రజలకు వివరించింది. ఈ తరహా ప్రచారం దేశంలోనే తొలిసారిగా నమోదై సరికొత్త రికార్డు సృష్టించింది.
బీఆర్ఎస్ ప్రచార తీరు జూబ్లీహిల్స్ ప్రజలపై బలమైన ప్రభావం చూపింది. అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రతి ఓటరునూ బీఆర్ఎస్ పలకరించింది. బీఆర్ఎస్ శ్రేణులు పదేండ్ల కేసీఆర్ పాలన.. రెండేండ్ల కాంగ్రెస్ మోసాలను ఓటర్లకు పూసగుచ్చినట్లు వివరించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే నష్టపోతామని ఓటర్లు అర్థమయ్యేలా తెలియజెప్పారు. రోడ్‌షోలు, బైక్ ర్యాలీలు, పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాలతో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లకు బీఆర్ఎస్ గెలుపు ప్రాధాన్యాన్ని వివరించారు. బీఆర్ఎస్ ప్రచార తీరును అధికార కాంగ్రెస్ కూడా కాపీ కొట్టాలని ప్రయత్నించినా… ఈ తరహాలో ఆకట్టుకోలేక బోల్తా పడింది.
ఆరు గ్యారెంటీలు.. 420 హామీలపై నిలదీత
బీఆర్ఎస్ ప్రచారంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై నిలదీసింది. కేటీఆర్ నిర్వహించిన రోడ్‌షోల్లో ప్రత్యేకమైన తెరలను ఏర్పాటు చేసి రెండేండ్ల కాంగ్రెస్ మోసాలను వివరించారు. హైదరాబాద్‌లోని నిరుపేదలపై కాంగ్రెస్ పంపిన బుల్డోజర్లు మిగిల్చిన దారుణాలను కండ్లకు కట్టినట్లు చూపించారు. రేవంత్‌రెడ్డి నియంతృత్వ పాలనపై పేదలు సంధించిన ప్రశ్నలను జూబ్లీహిల్స్ ప్రజలకు చూపించారు. ఆడబిడ్డలకు రెండేండ్ల కాంగ్రెస్ చేసిన నమ్మకద్రోహాలను ప్లకార్డుల రూపంలో ప్రదర్శించారు.
మహిళలకు రూ.2,500 పింఛన్, అమ్మాయిలకు ఉచిత స్కూటీల పథకాలు ఎప్పుడిస్తారంటూ తయారు చేసిన ప్లకార్డులు ఓటర్లను ఆలోచింపజేశాయి. బస్తీల్లోని పలువురు మహిళలు వాటిని ఇండ్ల ముందు ప్రదర్శిస్తూ ఓటు కోసం వస్తున్న కాంగ్రెస్ నేతలను నిలదీశారు. అవ్వాతాతలకు రూ.2వేల పింఛన్లను రూ.4వేలు ఎప్పుడు చేస్తారని, దివ్యాంగుల పింఛన్లను రూ.6వేలకు ఎప్పుడు పెంచుతారని నిలదీసేలా రూపొందించిన ప్రచార అస్ర్తాలు జూబ్లీహిల్స్ ఓటర్లు ప్రశ్నించేలా చేస్తున్నాయి. ఓటర్లు కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసేలా బీఆర్ఎస్ ప్రచారం బలమైన ప్రభావం చూపింది. ప్రచారంలో జూబ్లీహిల్స్‌లోని అన్ని వర్గాల ప్రజలను ఇంటింటికీ వెళ్లి పలకరించారు.