ష్.. గప్‌చుప్! ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రచార పర్వానికి తెరపడింది. గల్లీలు, కాలనీల్లో హోరెత్తించిన వాహనాలు నిలిచిపోయాయి. ఎక్కడి మైక్‌లు అక్కడే మూగబోయాయి.. ర్యాలీలు, సభలు, సమావేశాలు, పాదయాత్రలకు బ్రేక్‌లు పడ్డాయి. గడిచిన 17 రోజులుగా తిట్టుకున్న నోళ్లు మూతపడ్డాయి. అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనులపై దృష్టి పెట్టారు. డబ్బు, మద్యం, ఇతర వస్తువులు ఓటర్ల ఇళ్లకు చేర్చేందుకు సకల ఏర్పాట్లపై సమాలోచనలు చేస్తున్నట్లు ఆయా పార్టీల శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. నామినేషన్ వేసిన నాటి నుంచి పెట్టిన ఖర్చంతా ఒక ఎత్తయితే సోమవారం, మంగళవారం ఉదయం వరకు అభ్యర్థులు పెట్టబోయే ఖర్చు మరో ఎత్తు అని చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బూత్‌స్థాయిలో జరిగే రాజకీయ సమీకరణలు, గల్లీ నాయకులతో చేసుకునే బేరసారాలపై అభ్యర్థులు తలమునకలయ్యారు..చివరి రోజుబీఆర్ఎస్ బైక్ ర్యాలీలతో గులాబీమయం చేసింది.
సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారాన్ని బీఆర్ఎస్ దిగ్విజయంగా ముగించింది. ఆరంభం నుంచి ప్రచార పర్వంతో తమకు తామే సాటి అన్న రీతిలో బీఆర్ఎస్ హోరెత్తించింది. రెండున్నర నెలలుగా అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ ప్రచారంలో దూసుకుపోయారు. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధి, రెండేళ్ల అవినీతి, అరాచక కాంగ్రెస్ పాలనపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప్రచారం పై అన్ని వర్గాల నుంచి విశేష ఆదరణ లభించింది. చివరి రోజు ఆదివారం నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ తరపున పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు కాలనీలు, బస్తీలలో ర్యాలీలు చేపట్టారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, యువకులు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, జీపులతో ర్యాలీలో పాల్గొన్నారు. వ్యాపారులు షాపుల నిర్వాహకులతో ఆత్మీయంగా మాట్లాడి మరోసారి మాగంటి కుటుంబానికి అండగా నిలబడాలని అభ్యర్థించారు.
పాదయాత్రలు, రోడ్ షోలు, బైక్ ర్యాలీలు..
బోరబండ డివిజన్లోని అన్ని కాలనీల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పాదయాత్ర చేపట్టి మాగంటి సునీతా గోపీనాథ్‌కు మద్దతుగా ప్రచారం చేపట్టారు. షేక్‌పేట డివిజన్లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, షకీల్, గణేశ్ గుప్తా, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో వందలాది బైక్ ర్యాలీలలో మాగంటి సునీతా గోపీనాథ్‌కు ఓటు వేయాలని అభ్యర్థించారు. మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ రహ్మత్‌నగర్ డివిజన్లో ఎస్పీఆర్ హిల్స్, మహాత్మా నగర్, వడ్డెర బస్తీ, హబీబ్ ఫాతిమా నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
సోమాజిగూడ డివిజన్లో ఎల్లారెడ్డి, నాగార్జున నగర్ కాలనీలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి, ఎమ్మెల్సీ లు ఎల్ రమణ, నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాదయాత్రలు చేపట్టారు. యూసుఫ్‌గూడ డివిజన్ పరిధిలోని లక్ష్మీ నరసింహ నగర్లో , ప్రగతి నగర్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి రోడ్ షోలు నిర్వహించారు. వెంగళ్రావు నగర్ డివిజన్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై కేటీఆర్ నినాదాలు హోరెత్తాయి.
ఆఖరి ఎత్తుగడలో అభ్యర్థులు..
దాదాపుగా 17 రోజులు విజయం కోసం పాదయాత్రలు.. గొంతులు బొంగురు పోయేటట్లు ప్రసంగాలు.. సభలు, సమావేశాలు నిర్వహించారు. ముఖ్య నేతలను వెంటబెట్టుకొని రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. ఇందులో భాగంగానే అభ్యర్థులు ఆఖరి ఎత్తుగడలకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి డబ్బు మూటలకు పని చెబుతున్నారు.. కరెన్సీ నోట్ల కట్టల వర్షాన్ని కురిపించేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలను ఎక్కడికక్కడ కట్టడి చేసేలా గట్టి నిఘా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు.
సోషల్ మీడియాపై నేతల చూపులు..
ప్రచారం ముగిసిన వెంటనే అభ్యర్థులు, వారి అనుచరులు, బంధువులు కంప్యూటర్ల ముందు వాలిపోయేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సోషల్ నెట్వర్కింగ్ ద్వారా కొందరు అభ్యర్థులు ప్రచారం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. రోడ్ షోలు, బహిరంగ ప్రచారంతో మాస్ ఓటు బ్యాంకును ఆకట్టుకున్న అభ్యర్థులు ఇప్పుడీ పరిమిత సమయాన్ని క్లాస్ ఓటర్లపై దృష్టి పెట్టారు. తమ పార్టీకే, తమకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా అభ్యర్థులు తాము పోటీ చేసే ప్రాంతంతో పాటు తమ పార్టీ గురించి కూడా సోషల్ నెట్వర్క్ సైట్లలో పొందుపరుస్తున్నారు.
తమ బయోడేటా, పార్టీ కార్యక్రమాల్లో తాము పాల్గొంటున్న ఫొటోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసుకుంటూ లైక్స్, షేరింగ్, కామెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాపై అంతగా అవగాహన లేని కొందరు సీనియర్ అభ్యర్థులు సైతం తమ కుటుంబంలో ఉన్న యువతీ యువకులు, పార్టీ కార్యకర్తల సహాయంతో సోషల్ సైట్ అకౌంట్లు నిర్వహిస్తున్నారు. తద్వారా వారు ఓటర్లకు చెప్పాలనుకున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాకు పోస్టు చేస్తుండడం గమనార్హం. ఐతే అధికారులు మాత్రం సోషల్‌మీడియా ప్రచారంపై గట్టి ఫోకస్ పెట్టామని, ప్రకటనలపై ఎంసీఎంసీలో అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించే అభ్యర్థులపై దృష్టి పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు.