‘మహారాజా..! నూరు మాయోపవేషాలతోనైనా జనుల దృష్టి మరల్చవలెను. శత్రువు లోభి అయితే ఆశ చూపి వశం చేసుకోవలెను. సమ బలుడైతే నిందలు మోపో.. మోసం చేసో కడతేర్చవలెను’ అని సలహాలు ఇస్తాడు కణికుడు. మహాభారతంలో రాజ ధర్మానికి కూటనీతి జోడించిన కుటిలుడే ఈ కణికుడు. ధృతరాష్ట్రునికి సలహాదారుడు. ద్వాపరయుగంలోనే దుర్మార్గ రాజకీయాలకు ఆద్యుడు.కేకే సర్వే అయితే టీఆర్ఎస్కు 55.2 శాతం ఓటు షేర్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 37.8 వద్ద ఆగిపోయింది.
రెండు పార్టీల మధ్య 17.5 శాతం ఓట్లు తేడా ఉన్నదని విశ్లేషించింది. చాణక్య, బిలియన్ కనెక్ట్ మైనారిటీ, వోటా మీడియా హౌజ్, పీపుల్స్ ఇన్సైట్, కోడ్మో కనెక్టింగ్ తదితర సర్వేలలో బీఆర్ఎస్ పదేండ్ల పాలనను ప్రజలు సంపూర్ణంగా ఆమోదించారు. ప్రముఖ తెలుగు మీడియా హౌజ్‌లు చేసిన సర్వేలలో తమ జీవితాల్లో వెలుగులు పూయించి, బిడ్డల భవిష్యత్తుకు కొండంత భరోసా ఇచ్చిన కేసీఆర్ హయాంను పదే పదే తలచుకుంటున్నారు.
ఇప్పుడున్నది కలియుగం. కాలమానం ఎట్లున్నా చలనశీలనమే దాని ధర్మం. కాలగతిలో సర్వం అంతర్ధానమైపోయినా.. కణిక నీతి ఒకటే అప్డేటెడ్ వెర్షన్‌తో రాజకీయాల్లోకి చొరబడుతూనే ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లయితున్నది. ‘ఈ రెండేండ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది?’ సమాధానం చెప్పమని చాట్ బాట్ గ్రోక్ ఐని గోకిన. ఎందుకంటే ఈ మధ్య ఎవరికి, ఏ డౌటనుమానం వచ్చినా జనం ముందుగా గ్రోక్ ఐనే గోకుతున్నరు. నీ సవాల్‌కు నిర్దిష్టమైన జవాబు నా దగ్గర లేదని గ్రోక్ ఐ నోరెళ్లబెట్టింది. కానీ , జూబ్లీహిల్స్ రహీంబాయ్ నోరు తెరిచిండు. ‘దో సాల్ సే చల్హ్రా కాంగ్రెస్ కే జూటాబాదీ’. టకున ప్రతిస్పందించిండు.
నాణేనికి మరో కోణం ఉంటుంది. కొలువు కూటం మీదకి వచ్చిన పాలకులు ఇచ్చిన హామీలు కాలగమనంలో ఆసాంతం మృగ్యమవుతున్నయని అనుకున్నప్పుడు, ప్రజలు తమ ఆశలు, ఆకాంక్షలను మరింత బలంగా ప్రకటించే ప్రయత్నం చేస్తారు. అదీ విఫలమై.. అంతిమంగా జన సామాన్య విన్నపాలకు విలువ లేదని అంచనాకు వచ్చినప్పుడు కొలువు పీఠం కాళ్లు విరిచి అవతల పారేయాలనుకుంటారు. అదునుకు దొరికే ఆయుధం కోసం వేచి ఉంటారు. ఆ ఎదురుచూపుల్లో గుండెలు రగులుతాయి. సంఘర్షణలో అగ్గి రవ్వలు ఉధృతమవుతాయి. ఒత్తిడికి ఆయుధం మరింత పదునెకుతుంది. నిజానికి తెలంగాణ ప్రజల మానసిక పరిస్థితి ఇదే.
ఒక్క అవకాశం అని నిట్టనిలువునా ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద సాధ్యమైనంత వేగంగా వేటుకు సిద్ధమై ఉన్నారు. అటువంటి సందర్భం జూబ్లీహిల్స్ ఓటర్లకు వచ్చింది.
మహిళలకు నెల నెలా రూ.2500 ఇస్తామన్నారు. ఆడబిడ్డల పెళ్లికి తులం బంగారం. వనితలకు సూటీలు, నిరుద్యోగులకు భృతి, అవ్వాతాతలకు రూ.4 వేల పింఛన్ అని రేవంత్ రెడ్డి ఓ పక, భట్టి విక్రమార ఇంకోపక సంతకం పెట్టి హామీ పత్రం ఇచ్చిండ్రు. అదే అసలు సిసలైన బాండ్ పేపర్ అనుకొమ్మని నమ్మబలికిండ్రు. జనం నిజమని నమ్మిండ్రు. పాడి బర్రె తీరు కేసీఆర్‌ను కాదనుకొని కాంగ్రెస్‌కు ఓటేసిండ్రు. రేవంత్ అధికారంలోకి వచ్చి 23 నెలలు అవుతున్నది. తులం బంగారం లేదు, తూటు గవ్వలేదు. ఆఖరికి ఇంటి ముందు పేరుకపోయిన మురికి మోరి, ఇంటి వెనక నిండిన చెత్తకుండీని శుభ్రం చేయించే సత్తా కూడా లేని నిత్య దరిద్రం. కనీసం కేసీఆర్ చేసిన అభివృద్ధిని కూడా కొనసాగించలేని నిస్సహాయ పాలన. రెండేండ్లుగా చూసీ చూసీ జనం విసిగిపోయారు.
కేసీఆర్ హయాంలో వ్యాపారవేత్తల కలల ప్రపంచం హైదరాబాద్. ఒక నిమిషం కూడా అంతరాయం లేని విద్యుత్ ఐలాండ్. నలుదికుల నుంచి నాలుగు పవర్ స్టేషన్లతో ప్రతిష్టాత్మక విద్యుత్ వ్యవస్థ. కనీసం తన సభలోనైనా విద్యుత్తు అంతరాయం లేకుండా చూసుకోలేని దౌర్భాగ్యం ఇప్పటి పాలకులది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో వాటికన్ సిటీతో పోటీ. మూసీకే మిషన్లు పెట్టి మురికిని కడిగేసిన సుపరిపాలన కేసీఆర్‌ది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 8500 స్వచ్ఛ ఆటో టిప్పర్లతో రోజుకు 7.5 వేల టన్నుల చెత్తను ఎత్తిపోశారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టి, పది లక్షల సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తే.. హైదరాబాద్ మహా నగరం ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరంగా నిలబడ్డది. ఇవాళ కమాండ్ సెంటర్ ఉంది కానీ, దాని మీద పోలీస్ కమాండ్ లేదు. సీసీ కెమెరాలను పక్కకు తోసి రేవంత్‌రెడ్డి తెరమీదికి వచ్చారు. మసక బారిన చీకట్లో హంతక ముఠాలు చొరబడ్డాయి. నడిరోడ్డు మీదనే కత్తులు కోలాటం చేస్తున్నాయి. పట్టపగలు హత్యలు జరుగుతున్నాయి. నేరగాళ్లు వ్యాపారుల కణతలకు తుపాకులు పెట్టి డబ్బు వసూలు చేస్తున్నారు. ఇండ్ల మీద పడి దొంగలు దోచుకుంటున్నారు.
తమ మనోఫలకం మీద పైలంగా దాచుకున్న కేసీఆర్ పదేండ్ల అభివృద్ధిని, ఇప్పుడు కండ్లారా చూస్తున్న ఈ రెండేండ్ల విధ్వంసాన్ని జనులు సరిపోల్చి చూస్తున్నారు. రెండు ప్రభుత్వాల తీరును బేరీజు వేసుకున్నారు. ఎకడ పోగొట్టుకున్నారో తేల్చుకున్నారు. పోగొట్టుకున్న చోటనే వెతుకోవాలని నిర్ధారించుకున్న రు. అందుకే బీఆర్ఎస్ సభ పెడితే జనం పోటెత్తుతున్నారు. కేటీఆర్ గొంతువిప్పితే చప్పట్లు చరుస్తున్నారు. ఆయన అడుగులు వేస్తే జనం చెయ్యెత్తి జై కొడుతున్నారు. జై కేసీఆర్ అని నినదిస్తున్నారు. జూబ్లీహిల్స్ బస్తీలలో ఎక్కడ చూ సినా కనిపిస్తున్న యథార్థ దృశ్యాలివి. జనాభిమానాన్ని అంచనా వేయడానికి కష్టపడి సర్వే లు కూడా చేయనవసరం లేదు. జూబ్లీహిల్స్ బస్తీల పొంటి అకడకడా జనంతో ముచ్చటిస్తే చాలు నాడి తెలిసిపోతున్నది. పేదవర్గాల ప్రజలు కేసీఆర్ వెనుక సమీకృతమై ఉన్న సదృశ్యం స్పష్టంగా కనిపిస్తున్నది. రెండేండ్ల విధ్వంసంతో దుంప నాశనమైన సగటు ప్రజా జీవనం నిలువుటద్దంలో బయల్పడుతున్నది.
ఇటీవలి కాలంలో ఒక డజన్‌కు పైగా స్వతంత్ర సర్వేలు, ప్రైవేటు, ప్రభుత్వ సర్వేలు బయటకు వచ్చాయి. ప్రతి సర్వే కూడా కారుదే జోరని విశ్లేషించింది. పురుష ఓటర్లను మించిన ఆధిక్యత మహిళా ఓటర్లలో కనిపించింది. మహిళా ఓటర్ల కంటే మైనార్టీలది ఆధిపత్యమని అన్ని సర్వేల్లోనూ వ్యక్తమైంది.
కేకే సర్వే అయితే టీఆర్ఎస్కు 55.2 శాతం ఓటు షేర్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 37.8 వద్ద ఆగిపోయింది. రెండు పార్టీల మధ్య 17.5 శాతం ఓట్లు తేడా ఉన్నదని విశ్లేషించింది. చాణక్య, బిలియన్ కనెక్ట్ మైనారిటీ, వోటా మీడియా హౌజ్, పీపుల్స్ ఇన్సైట్, కోడ్మో కనెక్టింగ్ తదితర సర్వేలలో బీఆర్ఎస్ పదేండ్ల పాలనను ప్రజలు సంపూర్ణంగా ఆమోదించారు. ప్రముఖ తెలుగు మీడియా హౌజ్‌లు చేసిన సర్వేలలో తమ జీవితాల్లో వెలుగులు పూయించి, బిడ్డల భవిష్యత్తుకు కొండంత భరోసా ఇచ్చిన కేసీఆర్ హయాంను పదే పదే తలచుకుంటున్నారు.
యుద్ధ ఫలితం తనకు వ్యతిరేకమని కాంగ్రెస్‌కు తేలిపోయింది. దాంతో కణిక నీతి అప్డేటెడ్ వెర్షన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం జనంలోకి చొప్పించింది. ఆరు గ్యారెంటీల మాదిరి మాయ చేసి మభ్యపెట్ట చూస్తున్నది. తొలుత బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కన్నీళ్లను ఎగతాళి చేశారు.
ఆమె బిడ్డలపై పోలీసులను ప్రయోగించి భయపెట్ట చూశారు. నామినేషన్ పత్రాలు చెల్లకుండా చేయడానికి సర్వశక్తులొడ్డారు. అవి అసాధ్యం కావడంతో అజారుద్దీన్‌ను తెరమీదికి తెచ్చారు. మంత్రి పదవి ఇచ్చారు. మైనారిటీ సంక్షేమం కోసమే మంత్రి పదవి అని నమ్మబలికారు. కాంగ్రెస్‌తోనే ముస్లింలకు ఇజ్జత్ అన్నారు. అవీ తేలిపోయాయి. మరో ప్రయత్నంగా మాగంటి గోపీనాథ్ కుటుంబం మీద పడ్డరు. ఆయన వృద్ధ తల్లిని రోడ్డుమీదకి తీసుకొచ్చిండ్రు. కొడుకు మరణంలో దోషం ఉందని గాంధీ భవన్ నుంచి తెచ్చిన స్క్రిప్ట్ చదివించిండ్రు. మభ్యపెట్టి కుటుంబాలను విడగొట్టే సామాజిక కేళిలో కాంగ్రెస్‌ది ఆరితేరిన చెయ్యే. కానీ, కాంగ్రెస్ వేస్తున్న ప్రతి కూటపు ఎత్తులను జూబ్లీహిల్స్ బహుజన ఓటర్లు, మైనారిటీ ప్రజలు పసిగట్టిండ్రు. యుద్ధ భీరుని చేతి కత్తి గుంజుకొని యుద్ధం చేసే వీరునికే అందించాలనే ఆలోచనకు వచ్చిండ్రు. నవంబర్ 11 మోకా కోసం ఎదు రుచూస్తున్నారు. కారు గుర్తుకు ఓటు వెయ్యాలని సిద్ధమైండ్రు. సారు.. కారు.. మళ్లీ జోరు.. అని నినదిస్తున్నరు.
-వర్ధెల్లి వెంకటేశ్వర్లు