పదగతులు స్వరజతులు
పల్లవించిన నేల
తేనె తీయని వీణ
రాగాల తెలగాణ
ద్విపద దరువుల మేళ
యక్ష జ్ఞానపు శాల
పోతన కవి యోగి
భాగవత స్కంధాల
జయ గీతికై మోగెరా
తెలగాణ జమ్మి కొమ్మై ఊగెరా
సింగిడై పొంగిందిరా తెలగాణ
తంగేడై పూసిందిరా
శాతవాహన వీర శౌర్యమే తెలగాణ
ఇక్షాకుల దమ్మ తేజమే తెలగాణ
చాళుక్య ప్రాకార గోపుర ధామాల
కాకతీయులె మేటి నాటి నిర్మాణాల
ఎన్నెలా తిన్నెలా
ఎగిసేటి గోదారి
కొండకోనల మేన
కులికె కృష్ణవేణి
వన్నెలొలికే రాణి
మన కిన్నెరసాని
చిలక వాగుల రేల
ఇసుక పుప్పొడి పూల
శిలల కళాతోరణం
యాదాద్రి ఆలయం
వెలిసిన శివరేడు
వేములాడ జూడు
ధర్మపురి తిరుమణి
శేషప్ప కవి ముని
వాసిగా చదువంపే
బాసర తీర్థంబు
అంబ జోగులాంబ
ఆదిలో పీఠంబు
అల్లంపురం నరుల
తొలి నివాసంబది
సమ్మక్క సారలమ్మ తెలగాణ
రుద్రమ్మ రుధిర జన్మ
భద్రాద్రి రామక్షేత్రం తెలగాణ
గోల్కొండ ప్రేమసౌదం
పాల్కురికి సోమన్న
బసవ పురాణంబు
దివి నుంచి దిగి వచ్చి
కొలువైన తేజంబు
రామప్ప మందిరం
అవనికె సుందరం
సుక్క సత్తెం మిద్దె
ఒగ్గు కత మన కప్పె
పద్యానికందము
అప్పకవి చందము
రంగనాథ
రామాయణ గానము
ప్రతి ముంగిలి
పరవశించిన వైనము
కావ్య జగతికి దారి మల్లినాథసూరి
మధుర విజయము రాసే గంగావతి దేవి
మారన్న తెనుగన్న సోమనార్యుల గన్న
ఈ నేల సాహిత్య
వైభవాన మిన్న
బతుకమ్మ బోనాలురా
పండగా సాయన్న గుండెసడిరా
పైడి జయరాజు కాంతారావు
ప్రభాకరుడి చిత్ర వెలుగు
కళకు మూల గోత్రము
మా భూమి నరసింగుడి సత్రము
జై బోలో తెలంగాణ
అన్న నిమ్మల శంకరన్న
జాయప సేనాని
నృత్య రత్నావళి
నటరాజు నీదారి
పేరిణి రణభేరి
వాగ్గేయ కవి వాణి
రామదాసుని బాణి
ఎరక బోధల కుప్ప
వరకవి సిద్ధప్ప
సిందేసి తాళము
ఎల్లమ్మ మేళము
నూటొక్క రాగాల
పోటెత్తె కిన్నెర
భాగయ్య అల్లిక
పూదోట మల్లిక
కనుల ఎర్రని జీర
కాళోజి కవి ధార
అవని సుర గోళంబు
దాశరథి పద్యంబు
రాక మాచర్ల
వెంకటదాసు యాలలు
రాళ్లకె చివురొంపె
చిన్న దాసుని చూపు
ఇద్దాసు తత్వాలు
ఇలపైన సత్యాలు
వేపూరి కీర్తన
ప్రతి పల్లె నర్తన
తూటా వలె
సుద్దాల హనుమంతు కవి పాట
యుద్ధ నౌక
గద్దరన్న జన గీతిక
విశ్వంభర జ్ఞానపీఠి సినారె
వల్లంకి తాళమై
వొలికె నీ కవనాలు
అపర మేధావి మన పీవీరా
భూమి స్వప్నాల కవి తావిరా
వేల గొంతుకల ధ్వని గానము
మన వేణు మాధువుడి
శిష్య గణము
సాహితీ సంద్రము
సురవరం గ్రంథము
ఉద్యమానికి గురువు
జయశంకరు సారు
మారోజు వీరన్న
సర్వాయి పాపన్న
ఉప్పల మన్సూరు
భాగ్యరెడ్డి వర్మ
ఈ మట్టి సృష్టించిన
ఉత్తమోత్తమ పుత్రులు
బందగీ నెత్తుటి
సింధూరమీ నేల
బరిగీసి నిలిచెరా
భీమిరెడ్డి భళా
ఆరుట్ల రావి నారాయణుని త్యాగాల
కొమరం భీముడి
సమరంపు గర్జన
కమలమ్మ, ఐలమ్మ,
మల్లు స్వరాజ్యాల
కదనాల మగువల
తెగువరా తెలగాణ
మలిపోరు తొలిపొద్దు
మన చంద్రశేఖరుడు
కల నిజము చేసిన
మన కథానాయకుడు
ఎన్ని ఘనతలు ఇచ్చట!
తెలగాణ ఎన్నడొడవని ముచ్చట!
గోరటి వెంకన్న