రాజకీయ నాయకులు, విశ్లేషకులను 2024 సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్ విస్మయానికి గురిచేశాయి. అనైతిక ఆలోచలనతో ఎలాంటి విధివిధానాలు పాటించకుండా అసంబద్ధమైన లెక్కలతో ఎగ్జిట్‌పోల్స్‌ను ప్రకటించిన సర్వే సంస్థలు డీలా పడ్డాయి. వాటిని నమ్మిన స్టాక్‌మార్కెట్ కూడా ఒడుదుడుకులకు లోనైంది. అయితే వివిధ సంస్థలు సర్వే చేస్తున్న తీరుపై, వాటి విశ్వసనీయత, పారదర్శకతపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
మన దేశంలో ఎన్నికలు చాలా భిన్నంగా ఉంటాయి. వివిధ రాష్ర్టాల్లో, వివిధ అంశాలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. సాంకేతికత పెరిగిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ రూపంలో ఎన్నికల ప్రక్రియలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రచార శైలి మారింది. ఐవీఆర్ఎస్ పద్ధతిలో ప్రజల నాడిని రాజకీయ పార్టీలు తెలుసుకుంటున్నాయి. యూట్యూబ్ చానళ్ల ద్వారా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం సులభతరమైంది. ఈ నేపథ్యంలో సర్వేల రూపంలో కొత్త వ్యాపారం ప్రారంభమైంది. ప్రీ-పోల్, ఎగ్జిట్‌పోల్ పేరిట ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటిని రాజకీయ పార్టీలకు, నాయకులకు చేరవేయడం పరిపాటిగా మారింది. ఇక్కడే అసలు సమస్య వస్తున్నది. ఒక పార్టీకి లబ్ధి చేకూర్చేలా, మరో పార్టీకి నష్టం జరిగేలా ఈ సంస్థలు సర్వే చేస్తున్నాయనే అనుమానం కలుగుతున్నది. ప్రజల నాడిని ఈ సంస్థలు నిజంగానే తెలుసుకుంటున్నాయా? నియోజకవర్గ, రాష్ట్ర, దేశ సమస్యలను ప్రస్తావించి ప్రజ ల అభిప్రాయాలను తీసుకుంటున్నాయా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్ని శాంపిళ్లను తీసుకుంటున్నారనేది కూడా సందేహమే.
ప్రజల అభిప్రాయ సేకరణ అనేది నిబద్ధతతో జరగాలి. అనేక అంశాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించాల్సిన అవసరం ఉన్నది. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (సీపీఆర్) లాంటి సంస్థలు ఈ సర్వే సంస్థలకు దీనిపై గతంలో ఆదేశాలు జారీ చేశాయి. అయితే అందుకు భిన్నంగా కొన్ని అంశాలపైనే సర్వే సంస్థలు దృష్టి పెట్టడంతో ఎగ్జిట్‌పోల్స్‌కు, వాస్తవ ఫలితాలకు మధ్య చాలా వ్యత్యాసం కనిపించింది. ప్రాంతీయ పార్టీల ప్రస్తావనే లేకుండా, రెండు జాతీయ పార్టీలే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు సర్వే సంస్థలు పరిస్థితులను సృష్టించినప్పటికీ ప్రజలు ప్రాంతీయ పార్టీలను అక్కున చేర్చుకున్నారు.
లోక్‌నీతి, ఇండియా టీవీ, రిపబ్లిక్, సీ-ఓటర్ లాంటి ప్రఖ్యాత సర్వే సంస్థలు కూడా ఈ ఎన్నికల్లో ప్రజల నాడిని తెలుసుకోలేకపోవడం గమనార్హం. యూట్యూబ్ చానళ్లు, ఆన్లైన్ పోల్స్‌పై ఆధారపడటం, అతి తక్కువ శాంపిళ్లను సేకరించడమే అందుకు కారణం. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అవి తెలుసుకోలేకపోయాయి. అందుకే దాదాపు అన్ని సంస్థలు ఎన్డీయే కూటమి 370-390 సీట్లు గెలుస్తుందని ప్రకటించాయి. కానీ, వాస్తవ ఫలితాలు పూర్తి భిన్నంగా వచ్చిన విషయం విదితమే.
సర్వే అంటేనే ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించాలి. అందుకు కనీసం నియోజకవర్గానికి 50 వేల నుంచి లక్ష వరకు శాంపిళ్లను సేకరించాలి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, స్థానిక సమస్యలు, పర్యావరణం లాంటి అంశాలపై అభిప్రాయాలను సేకరించాలి. కేవలం ఏక నాయకత్వంపై కాకుండా నేతలు, కిందిస్థాయి కార్యకర్తల పని తీరు గురించి అడిగి తెలుసుకోవాలి. సర్వే గణాంకాలను మార్చకుండా వాస్తవ ఫలితాలను ప్రకటించాలి. తప్పుడు నివేదికలు ఇవ్వడం వల్ల స్టాక్‌మార్కెట్ నష్టాల రూపంలో దేశానికి నష్టం జరుగుతుం దనడంలో ఎలాంటి సందేహం లేదు.
కన్నోజు శ్రీహర్ష