ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయనే పాత సామెత కొత్తగా గుర్తుకు వస్తున్నది. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నది, విదేశీ ప్రయాణాలు మానుకోవాలని దేశ ప్రజలకు హితవు చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ అట్టహాసంగా ఐదు దేశాల పర్యటన జరిపారు. ఒక్క మనదేశమే కాదు, ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధం పుణ్యమా అని ప్రపంచమే సంక్షోభంలో కూరుకుపోయింది. త్వరలో తీవ్రమైన ఆర్థిక సమస్యలు చుట్టుముట్టబోతున్నాయనే హెచ్చరికలు అంతకంతకూ తీక్షణమవుతున్నాయి. పొదుపు చర్యలు అనివార్యమవుతున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన విహారయాత్రలా సాగటం ఒక ఎత్తయితే, వివిధ రకాలైన వివాదాలు తలెత్తటం మరొక ఎత్తు. ఇంధన భద్రత, సంప్రదాయేతర ఇంధ న వనరుల అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన ఈ పర్యటనలో భాగంగా ప్రధాని యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీల్లో తిరిగారు. భారీగా పెట్టుబడులు, గ్రీన్ టెక్నాలజీ బదిలీపై ఒప్పందాలు కుదిరినట్టు అధికార వర్గాలు చెప్తున్నా, పర్యటనలో గాంభీర్యం లోపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. మరోవైపు భారత ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తితే ప్రధాని సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
మోదీ రాకకు కొద్ది ముందుగా నెదర్లాండ్స్ ప్రధాని మీడియా సమక్షంలో భారత్ లో మైనారిటీల అణచివేతపై చేసిన విమర్శలు చిన్నవేమీ కావు. వాటికి సమాధానం చెప్పేందుకు మోదీ ప్రయత్నించలేదు. ఆ తదుపరి నార్వేలో మీడియా సమావేశంలో ఓ మహిళా జర్నలిస్టు వేసిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా వేదిక దిగిపోవటం అంతర్జాతీయంగా చర్చాంశమైంది. ఇప్పుడామె ఓ అంతర్జాతీయ సెలబ్రిటీ అయిపోయారు. బీజేపీ సోషల్ మీడియా సెల్స్ ఆమెను ట్రోలింగ్ చేస్తున్నప్పటికీ ఇండియాలో హక్కుల గురించి ప్రశ్నించిన కలం యోధురాలిగా ఆమెకు గుర్తింపు వచ్చింది. మోదీ హ యాంలో భారత్లో పత్రికా స్వేచ్ఛ దిగజారటంపై, మీడియాతో మోదీ ముఖం చాటేయటంపై విమర్శలు ఉండటం తెలిసిందే. విమర్శలకు తగిన సమాధానమిచ్చే అవకాశాన్ని వదులుకోవటం వల్ల ప్రజాసంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే సంగతి తెలిసిందే.
ఇక రెండో అంశం 43 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని నార్వే సందర్శించటం ఇదే ప్రథమం. వ్యాపారవేత్త గౌతం అదానీకి చెందిన కంపెనీలను 1.2 లక్షల కోట్ల డాలర్ల సావరీన్ వెల్త్ ఫండ్ అవినీతి ఆరోపణలపై బ్లాక్ లిస్టు చేసిన నేపథ్యంలో ఈ పర్యటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2024 మే 15న అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కంపెనీని, ఈ ఏడాది ఫిబ్రవరి ఏడున అదానీ గ్రీన్ ఎనర్జీని ఫండ్ పెట్టుబడులకు అర్హమైన కంపెనీల జాబితా నుంచి తొలగించారు. అదానీని ఈ సమస్య నుంచి బైటపడేసేందుకే మోదీ నార్వే వెళ్లారనే విమర్శలు ఇంటాబయటా మిన్నుముట్టటం గమనార్హం.
అంతిమంగా ఈ వివాదం భారత విదేశాంగ విధానం దేశ ప్రయోజనాలు కాపాడటానికా? కార్పొరేట్ల కొమ్ముకాయటానికా? అనే విచికిత్సకు ఇది దారితీసింది. మూడో వివాదం చాకొలెట్ల ప్రహసనం చుట్టూ అల్లుకున్నది. పర్యటన చివరి మజిలీగా ఇటలీ వెళ్లిన మోదీ అక్కడ కుదుర్చుకున్న ఒప్పందాల కన్నా ఇటలీ ప్రధాని మెలోనీకి మెలోడీ చాకొలెట్లు బహూకరించటం గురించి ఎక్కువ చర్చ జరిగింది. దౌత్యపర్యటనల్లో చిన్నచిన్న సరదాలు, విహారాలు, లాంఛనంగా ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయనేది తెలిసిందే. కానీ ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో చేపట్టిన ఉన్నతస్థాయి దౌత్యంలో ఈ చాకొలెట్ల ఉదంతం కొంచెం చవకబారుగా అనిపించింది. ఇలాంటి తలనొప్పులు తప్పించుకోవాలంటే ప్రధాని పౌరసంబంధాల యంత్రాంగం మరికొంత శ్రద్ధ పెట్ట టం ఎంతైనా అవసరమేనని చెప్పకతప్పదు.