మెదక్ జిల్లా వర్గల్ మండలం అంతగిరిపల్లె. 2017, మే 7 ఐతారం రోజు మాపటీలి ఐదున్నర గొడ్తున్నది. ‘రేనవ్వా.. ఎందుకు జాం జేస్తున్నరె? పొల్లకు ఒడిబియ్యం వోసి అత్తగారింటికి సాగదోలుదామా, అద్దా? కలెల్గున పంపాలె గని, ఐతారం పూట శీకటైనంక పంపుతారె ఆడివిల్లను’ బియ్యంల పసుపూ, నూనె కలుపుకొంటనే మొత్తుకుంటున్నది యాదవ్వ పెద్దమ్మ. ఆ మాటలిన్న రేనవ్వ (అమ్మ) కండ్లు ఎర్రగైనయి, మొకం శిన్నగైంది. అప్పటిదాన్క నవ్వుకుంటున్న అమ్మ ఒక్కసారిగా మొఖమెందుకో శిన్నగ జేస్కున్నది. ‘ఇగో, ఈ ఆడి పుట్కే ఇంతనే… ఎన్నటికున్నా అవ్వగారింటి గడ్ప దాటి, అత్తగారింటి గడ్ప దొక్కాల్సిందే. జల్దిన రార్రి, తలో శేతెయ్యిర్రి’ అని పిలుస్తే.. అక్కడున్న ఆడోళ్లందరూ వొయి ఒడిబియ్యంల శెయ్యేసిర్రు. ఐదుగురు ముత్తైదువలు మా ఇద్దరాలుమొగలకు ఒడిబియ్యం వోసినంక అప్పగింతల కార్యం షురువైంది.
2017, ఫిబ్రవరి 10వ తారీకు అనుకుంటా! నాయిన దార నర్సింలు హోటళ్ల వంట పన్జేస్తడు. నాయిన ఇట్ల ఇంట్లకెళ్లి హోటల్ బాట వడుతుండనంగనే చిగురు రాజయ్య మావొచ్చిండు. ‘నర్సయ్యా.. తల్లిదండ్రి లేకున్నా మంచిదేగని మ్యాన మామ ఉండాల్నంటరు. ఇప్పుడు మా స్వామిగాని విషయంల ఆ శాత్రం నిజమే అనిస్తున్నది. ఆనికి నువ్వే తల్లిదండ్రివి, నువ్వే మ్యానమామవు. ఇగ నువ్వే ఆనికి పిల్లనియ్యకుంటే తల్లిదండ్రి లేని పోరనికి పిల్లనెవ్వలిత్తరే?’ అని రాజయ్య మామ ఒక్కతీరుగ బతిమిలాడవట్టిండు. స్వామి బావతో నా పెండ్లికి నాయిన ఒప్పుకొంటే నేను నై అంటనా? నై అన్లేదు, సై అన్న. 1999 నవంబర్ 5న పుట్టిన నాది అప్పుడే పదో తర్గతైపోయింది. పై సద్వు కోసం పట్నం బోవాల్సిన నేను జీవిత పాఠాలు నేర్సుకోవడానికో ఏమో.. అత్తగారింట్ల కాలువెట్టిన.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం, బంగ్లా వెంకటాపూర్. 2017, మే 7 ఐతారం నాత్రి పదిన్నర గొడ్తున్నది. అత్తామామ లేరు కావట్టి ఇద్దరాడిబిడ్డలే నాకు అత్తమామలైర్రు. ఆ ఇద్దరాడిబిడ్డలు మా ఇద్దరాలుమొగలకు ఆరతిచ్చి లోపలికి రమ్మంటే కుడికాలు వెట్టి లోపల్కి వోయినం. పెద్దాడిబిడ్డకు అప్పటికే లగ్గమైంది. మాకు లగ్గమైనంక ఏడాదినర్దానికి సిన్నాడిబిడ్డగ్గూడ లగ్గం జేసినం. మేమిద్దరం, మాకో ఇద్దరు మగ పిల్లగాండ్లయిండ్లు. పెండ్లిళ్లు, పేరంటాలు. పురుళ్లు, పుట్టెంటికలు. అప్పొ సొప్పో.. అత్తామామ లేరు కావట్టి అన్నీ మేమే ఎల్లదీస్కుంటొచ్చినం. మాకు, తప్పితే మందికి.. పెండ్లయిన గుత్త ఇద్దరాలుమొగలం ఒక్కరోజు ఇంటిపట్టున ఉన్నది లేదు. తెల్లారి లేస్తే శేనుకో కైకిలి శెయ్యాల్సిందే. లేకుంటే మాకు తెల్లారది.
ఔను.. మీకు జెప్పలే కదా? బంగ్లా వెంకటాపూర్లనే మాకో ఎకరం ఇరవై నాలుగు గుంటల భూమున్నది. తాతల కాన్నుంచి కాస్తుల మేమే ఉంటున్నం. తాతల నాడు పట్టా కాయిదాలున్నయి గనీ, మా కాడికొచ్చేసరికే అవి మాయమైనయట! పట్టా కాయిదాలుంటెనేమో పెట్టువడికి అకౌంట్ల రైతుబంధు పైసలు వడుతుండె. మాకో ఆ కాయిదాలు గతిలెవ్వాయె? పెట్టువడికి మూడు పైసల మిత్తికి అప్పుదెచ్చి ఎవుసం జేస్తే.. దబన అది కిందిమీదైతే ఒర్రిసచ్చే కాలమని భయపడి మా భూమిని పడావుంచేటోళ్లం. భూమి పడావు వడ్డా కొద్దీ పాత అప్పు మలెవడుతనే ఉన్నది. ఇగ లాభం లేదు, ఇంత కర్సయినా మంచిదే అప్పుజేద్దాం గనీ, మన కాయిదాలు మనం మాత్రం తప్పకుండా జేస్కోవాల్నని మా ఆయనతోని మస్తు సార్ల మొత్తుకున్న. మొత్తుకుంటే ఏం ఫాయిదా? ఆయన శేతిలుంటదా పట్టా కాయిదాలు జేస్కునే పని? అందుకే, ఇద్దరం గల్సి ఎమ్మార్వో ఆఫీసు సుట్టూరా మస్తు సార్ల తిర్గినం. మస్తు మంది ఎమ్మార్వోలు తాబదలైర్రు గనీ మా భూమి మాత్రం మా పేరు మీన గాలె.
ఇన్ని రైతుబంధు పైసలో, ఇంత క్రాప్లోనో తీసుకొని అప్పులు దగ్గరవడగొడ్దామనుకునే మా ఆశలు ఎమ్మార్వో ఆఫీసుకు వోయినప్పుడల్లా నీళ్లే అయినయి. తిర్గీ తిర్గీ మా ఇద్దరికి యాష్టకొచ్చింది. ఎంత తిర్గినా.. ఇగ ఆ భూమి మన పేరు మీన కాదు గని, ఇంకెన్ని రోజులు ఆ భూమిని పడావుంచుదామని ఓ రోజు ఇద్దరాలుమొగలం ఒక తాటిమీదికొచ్చినం. మూడు కాడ నాల్గు లచ్చలైద్ది అప్పు. అయినా పర్లేదు గనీ ఎకరన్నర భూమిని సాగుజేసి, అచ్చుగట్టిపిచ్చి, బోర్ ఏసినోళ్లమే గావాల్నని ధైర్నం జేసినం. ఇంకో లచ్చరూపాల అప్పు దూసుకొచ్చినం. అదాతుకు అప్పు మా వుట్టింది గనీ, ఆ బోరు పాడు వడ.. ఆ బోర్లనే సుక్క నీళ్లు వల్లె. భూమి అద్దమోలె నున్నగ తయారైతేం లాభం? నీళ్ల పార్కం ఉండాలె గదా? నీళ్ల పార్కం లేక అచ్చుగట్టిపిచ్చిన భూమిని గూడ పసళ్ల కమాన పడావే ఉంచినం.
2024, ఫిబ్రవరి 25 నాత్రి తొమ్మిదిన్నర గొడ్తున్నది. మాది అసలే గూనె పెంకల ఇళ్లంటే, దానికి దర్వాజలు లెవ్వు. ఇసురుకుంటా అచ్చే ఈదరకు పాపం పోరగాండ్లు గజగజా అణుకుతున్నరు. కుర్సీలున్న శెద్దర్లు దెచ్చి ఆళ్లమీన గప్పి వాళ్లపక్కకే నేన్గూడ ఒర్గిన. బైటికి వోయిన నా పెనిమిటి రానే అచ్చిండు. మనిషి శిన్నవోయి ఉన్నడు. ‘ఏమైందుల్లా అంత ఎటో ఉన్నవ్?’ అంటే.. ‘ఏం లేదే.. ఆకలైతున్నది ఇంత బువ్వెయ్ సల్లవడుతా’ అంటే పళ్లెంల అన్నమేసిన. రెండు బుక్కలు ఇట్ల మల్శిండో లేదో అప్పుల జోలి అచ్చింది. ‘గీ తినేటప్పుడే నీకు అప్పులు మతికొస్తున్నయా?. నువ్వు ముందైతే అన్నం దిను, ఏమన్నుంటే రేపు జూస్కుందాం’ అని అంటే మనిషి అన్నం మా తిన్నడు గని ఆయన జ్యాసంతా అప్పుల మీదనే ఉన్నది. ఆ నాత్రి పడుకున్నంక గూడ అదే ఆలాపన.
2024, ఫిబ్రవరి 26 సోమారం మబ్బుల మూడున్నర గొడ్తున్నది. ఏదో అలికిడైతే లేసి కూసున్న. బనీన్ మీన ఉన్న మనిషి అంగియి శేతులు మీదికి మలుస్తున్నడు. ‘గింత మబ్బుల ఎటు వోతున్నవుల్లా?’ అనడిగితే… ‘పొలంకాడికి వొయ్యొస్తా’ అనవట్టిండు. మనిషికి నిద్రవడ్తలేదు, అటుమొకాన వొయ్యొస్తడు గావచ్చునని శెద్దరి గప్పుకొని మళ్లా నడుమాల్శిన. అటే కన్నంటుకున్నది. ఆ యాళ్ల ఐదో, ఐదున్నరనో గొడ్తున్నది. ‘ఓ పిల్ల బైటికి రాయే.. ఓ పిల్ల బైటికి రాయే..’ అని బైటికెళ్లి కేకలినవడ్తున్నయి? అదే నిర్ద మబ్బుల బైటికొచ్చిజూస్తే.. ‘స్వామి గానికి ఏమో ఐందట. ముందుగాళ్లనైతే నువ్వు రా, పోరగాండ్లు ఎన్కసీరొస్తరు గని’ అని పిల్వవట్టిండు సైకిల్ మీదొచ్చిన రాజయ్య మావ.
ఆడికి నాకు డౌటు గొడ్తనే ఉన్నది. అనుకున్నట్టే.. శెర్వు కట్టకు మస్తుమంది కనవడ్తున్నరు గని మా మనిషి మాత్రం కనవడ్తలేడు. సైకిల్ దున్కి ఆత్రంగా కట్టమొకాన ఉరుకుతా ఉన్న. నా ఎన్కనే అచ్చిన నా పిల్లగాండ్లిద్దరు గూడ నా ఎన్క ఉరికొస్తనే ఉన్నరు. ఎంతురికితేం లాభం… కట్టకున్న వేపచెట్టుకు ఉరేసుకొని ఏలాడుతా ఉన్నడు నా పెనిమిటి చిగురు స్వామి. ఏలాడుతా ఉన్న ఆ మనిషిని జూసేసరికి అంత సలిల గూడ శెమ్టలు వుట్టినయి. ఇద్దరు పసివోరగాండ్లను వట్టుకొని… ‘నీ ఈడుల సగం ఉన్నా జోడైన గదా బావో.. బావా…? నన్నెందుకు నట్టేట్ల ముంచివోయినవ్ బావో… బావా’ అని ఏడుస్తా ఉన్న. నా ఏడ్పు ఏ దేవునికినవల్లేదు.
నా పెనిమిటి కాలం జేసి యాడాదెళ్లింది. దగ్గెర దగ్గెర రెండేండ్లు కావొస్తున్నయి. ‘సారూ.. మేం రైతుబంధుకు నోసుకోలె, కనీసం ఈ రైతు బీమానన్న అచ్చేటట్టు సూడుర్రి. అప్పులు ముట్టజెప్తా’ అని కాళ్లుమొక్కని సారు లేడు. ఎంత మొక్కితేం లాభం? ఆళ్ల దగ్గర్నుంచి ‘సూడమ్మా, చిగురు స్రవంతీ… నీ పెనిమిటి పేరు మీద మూడు గుంటల భూమే ఉన్నది. ఎక్కడికెళ్లి అస్తదమ్మా రైతుబీమా..’ అని గద్మాయిస్తున్నరు. ‘మేం మాలొల్లం గదా సారు? మాకు సర్కారు సొమ్ము బాకీ లేదు గని, నా భూమైనా నా పేరు మీదికెక్కియ్యిర్రి. రేపు రేపు నేన్జత్తెనన్న రైతుబీమా పైసలు నా పోరగాండ్లకు అక్కెరకొస్తయి’ అని కలెక్టర్ సారు కాళ్ల మీద వడ్డా. నా భూమికన్న నేను నోసుకున్ననో లేదో..!
-గడ్డం సతీష్
99590 59041