పహల్గాంలో చిందిన రక్తం ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వ పటిమ మీద అనేక ప్రశ్నలకు అంకురమైంది. 11 ఏండ్లుగా కప్పుకొన్న ముసుగు తొలగిపోయింది. సంఘ్ పరివార్ వీరభక్తులు సైతం పెదవి విరుస్తూ, నిట్టూర్పు విడుస్తున్నారు. పార్లమెంటు సాక్షిగా విపక్షాలు సంధించిన ప్రశ్నలు, మోదీ ఇజం వెనుకున్న అసలు నిజాన్ని వెలికితీస్తున్నాయనే చెప్పాలి. దశాబ్దకాలం తర్వాత మొదటిసారి భారతీయ సమాజంలో, సామాజిక మాధ్యమాల్లో మోదీని కీర్తించేవారి సంఖ్య కన్నా ప్రశ్నించేవారి సంఖ్య పెరిగిపోయింది.
బాలాకోట్ దాడుల తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు. ఉరి సర్జికల్ స్ట్రైక్స్ అన్నారు. పుల్వామాకు ప్రతీకార దాడి అన్నారు. ఉగ్రవాదుల పీచమణిచామన్నారు. పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లి ఉగ్రస్థావరాలను భస్మీపటలం చేశామన్నారు. అయినా పహల్గాం మారణకాండ ఆగలేదు. ఉగ్రవాదులు ఆయుధాలతో దర్జాగా వచ్చారు. భారతీయులను చంపి దర్జాగా వెళ్లిపోయారు. సర్జికల్‌స్ట్రైక్ స్థానంలో ఆపరేషన్ సిందూర్ వచ్చి చేరింది. పేరు మారిందే తప్ప, పాలకుల తీరు మాత్రం మారలేదు. మారణకాండకు నైతిక బాధ్యత వహించే దమ్ములేదు, మారణకాండలను నిరోధించే ఇంటెలిజెన్స్ లేదు. అయినాసరే తమది దమ్మున్న ప్రభుత్వమని రొమ్ము విరుచుకుని తిరుగుతారు. ఇది నా మాట కాదు, పహల్గాంలో చిందిన అమాయకుల రక్తాన్ని చూసిన సగటు భారతీయుడి మాట. పార్లమెంటు సాక్షిగా జవాబు దొరకని ఎన్నో ప్రశ్నలను చర్చించుకోవలసిన సమయమిది. విశ్వగురూ.. వింటున్నారా!
చరిత్ర లోతుల్లోకి వెళ్లి నెహ్రూ, ఇందిరా వైఫల్యాలను ప్రశ్నించడం మినహాయించి వర్తమానంలో మీ పాలనలో జరిగిన, జరుగుతున్న వైఫల్యాలకు ఒక్కసారైనా నైతికబాధ్యత వహించారా! కాందహార్ నుంచి పహల్గాం వరకూ చెప్పుకొంటూపొతే అంతులేని వైఫల్యాలు. గల్వాన్, బాలాకోట్, పఠాన్‌కోట్, ఢిల్లీ, అనంతనాగ్, పార్లమెంటుపై దాడి, చివరికి పహల్గాం ఒకటా, రెండా. ఏండ్లు గడుస్తున్నా మణిపూర్ మంటలు ఆరడమే లేదు. స్వీయ ప్రచారంలో ముందుంటారు, విజయాలన్నీ మీ ఖాతాలో వేసుకుంటారు, వైఫల్యాలకు మాత్రం బాధ్యత తీసుకోరు. మీది రాజకీయమా.. పలాయనవాదమా? నిజంగా పాకిస్థాన్ శరణువేడితే, మెడలు వంచాలి, కండిషన్లు పెట్టాలి. కానీ, పాకిస్థాన్‌ను ఎండగడుతూ ప్రపంచ యాత్రలు చేయడమెందుకు? పోనీ ఇంతా కష్టపడి ప్రపంచయాత్రలు చేసొస్తే ఒక్కటంటే ఒక్క దేశం కూడా పాకిస్థాన్‌ను బహిరంగంగా ఖండించిన పాపానపోలేదు. జీ8 దేశాలు, కామన్వెల్త్ దేశాలు, నేపాల్, భూటాన్ లాంటి అతిచిన్న దేశాలు సైతం మౌనంగా ఉండిపోయాయి. ఇదేనా విశ్వగురు దౌత్య నీతి? వందల కోట్ల రూపాయల ప్రపంచ యాత్రలు ఉత్త విహార యాత్రలేనా? ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఊతమిస్తుందని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం తప్పించి ఆ దేశాన్ని ఉగ్రదేశంగా ప్రపంచం ముందు నిలబెట్టింది లేదు. పాకిస్థాన్‌ను వ్యతిరేకిస్తూ తీర్మానాలు ప్రవేశపెట్టింది లేదు.
ప్రపంచ బ్యాంకు పాకిస్థాన్‌కు ఉదారంగా రుణాలిస్తుంటే చోద్యం చూడటం మినహా చేసిందేమున్నది? శరణుజొచ్చిన పాకిస్థాన్ నుంచి పీవోకేను డిమాండ్ చేయకుండా ఏకపక్షంగా కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించారో మోదీ-షా ద్వయం సమాధానం చెప్పాలి? యుద్ధంలో నిర్ణయాలను తీసుకునే సంపూర్ణ స్వేచ్ఛను భారత సైన్యానికి ఇచ్చామని ఘనంగా ప్రకటించిన మోదీ.. కాల్పుల విరమణ నిర్ణయం సైన్యం సమ్మతితోనే తీసుకున్నారా? ప్రతిపక్షాలే కాదు, ఇవ్వాళ దేశమంతా ఇదే ప్రశ్నిస్తున్నది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రమేయం లేకుండానే కాల్పుల విరమణ జరిగిందా? ఆయన అబద్ధాలు చెబుతున్నాడా? మరెందుకు విశ్వగురువు నోటి నుంచి ట్రంప్ ప్రేలాపనలను ఖండిస్తూ ఒక్క మాటైనా రావడం లేదు. ఆపరేషన్ సిందూర్ లక్ష్యం పాకిస్థాన్‌లోకి ప్రవేశించడం, ఆక్రమించడం కానేకాదని రక్షణ శాఖ మంత్రి చెప్పారు. పాక్ మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం లేదని ముందుగానే ఆ దేశానికి చెప్పామని విదేశాంగ శాఖ మంత్రి ప్రకటించారు. రాజకీయ నిర్ణయాల వల్లనే విమానాలను కోల్పోవాల్సి వచ్చిందని మిలిటరీ అధికారులు చెప్పుకొచ్చారు. ఇది నిజమైతే మొత్తం వ్యవహారంలో బలైంది ఎవరు? సామాన్యులు, సైనికులే కదా! సరిహద్దు వెంబడి పాకిస్థాన్ దుశ్చర్యలకు బలైన సామాన్యులకు, ఆపరేషన్ సిందూర్‌లో అసువులు బాసిన వీర జవాన్లకు జవాబుదారీ ఎవరు?
పదకొండేండ్ల దృఢమైన నాయకత్వం నీడలో సేద తీరుతున్న దేశంలోకి 40 మంది జవాన్ల ఊపిరితీసిన 200 టన్నుల ఆర్డీఎక్స్ ఎలా వచ్చింది? పహల్గాంలోకి ఆయుధాలతో ముష్కరులు ఎలా రాగలిగారు? 26 మంది ఉసురుతీసి అంతే దర్జాగా ఎలా వెళ్లగలిగారు? మూడు నెలలపాటు దొరక్కుండా ఎలా తప్పించుకోగలిగారు? మీది వైఫల్యమని ప్రకటించుకునే దమ్ము ఎలాగూ లేదు. కనీసం ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని కూడా అంగీకరించరా? పహల్గాం దురాగతం వెనుక దాగిన మాస్టర్ మైండ్ ‘పాక్ మిలిటరీ జనరల్’ మునీర్‌తో ట్రంప్ విందు ఆరగిస్తుంటే విస్తుపోయి చుశారే తప్ప, కనీసం ప్రశ్నించలేదు.
పై పెచ్చు నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్టు ట్రంప్‌ను పలకరించి వచ్చారు. బలమైన దేశం బలహీనమైన నాయకత్వం చేతిలో విలవిలలాడుతున్నది నిజం కాదా? కూలిపోయిన ఆర్థిక వ్యవస్థ అంటూ దూషించినా, 50%అదనపు సుంకాలతో శిక్షించినా ట్రంప్‌ను నిలదీయలేని నాయకత్వాన్ని ఏమని పిలవాలి విశ్వగురూజీ?
నాటి ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతున్నారు సరే, మరి మీ 11 ఏండ్ల వైఫల్యాలకు బాధ్యులెవరు? పాకిస్థాన్‌ను ఆక్రమించడం, ఓడించడం మన లక్ష్యాలు కానప్పుడు ఆపరేషన్ సిందూర్ ఎందుకు చేపట్టినట్టు? పహల్గాం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికా? ప్రజల చీత్కారాల నుంచి తప్పించుకోవడానికా? యుద్ధం పేరుతో మీరు ఆడింది ఉత్త నాటకమేనా? మన దేశంలోకి చొచ్చుకొచ్చిన, అమాయక పర్యాటకులను క్రూరంగా చంపిన హంతకుల జాడైనా అడక్కుండా, పీవోకే గురించి మాటమాత్రమైనా చర్చించకుండా ఎందుకు అంతలా కరుణించారు? దాయాదుల మీద అంత దయ దేనికీ? మారణహోమాలు జరిగినంక ఘనంగా స్పందిస్తున్నారు.. అసలు ముందే పసిగట్టే బలమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఎందుకు నిర్మించలేకపోతున్నారు? ‘రా’కు మీరందించిన అదనపు బలం ఏమైనా ఉందని చెప్పగలరా? ఉండుంటే పుల్వామా దాడి జరిగేదా? మణిపూర్ రగిలేదా? పహల్గాం గుండె పగిలేదా? పహల్గాం నిందితుల్లో ఒక్కడిని కూడా పట్టుకోకుండానే, పాకిస్థాన్ ప్రపంచం ముందు చేతులు కట్టుకోకుండానే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని సంబురా లు చేసుకోవడం మీకు మాత్రమే చెల్లింది.
ప్రశ్నిస్తే దేశద్రోహి అని ముద్రవేయడం, పాకిస్థాన్ తొత్తు అని వెక్కిరించడం, అంతా వారి వల్లనే అని తప్పించుకోవడం కాకుండా నిజమైన భారతీయ ఆత్మను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది మోదీజీ. ఆసేతు హిమాచలం అసంతృప్తితో రగిలిపోతున్నది. విపక్షాల అనైక్యత కావచ్చు, సామాన్యుల గుండెల్లోని భయం కావచ్చు, మీ భక్తుల గుండెల్లో పేరుకుపోయిన భక్తిభావన కావచ్చు, ఇన్నాళ్లు తెరలుగా మీ వైఫల్యాలను దాచిపెడుతూ వచ్చాయి. ఇప్పుడా పరదాలు ఒక్కటొక్కటిగా తొలగిపోతున్నాయి. నివురుగప్పిన నిప్పు కార్చిచ్చులా రగిలిపోతున్నది.. తస్మాత్ జాగ్రత్త.
(వ్యాసకర్త: న్యాయవాది)
-చందుపట్ల
రమణ కుమార్ రెడ్డి