శంషాబాద్ రూరల్, మార్చి 19: శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలో కొందరు అక్రమార్కులు పట్టా భూమికి అనుకొని ఉన్న చెరువు అలుగు (ప్రభుత్వ) భూమిని దర్జాగా కబ్జాచేసి అంతటితో ఆగకుండా.. అలుగు భూమిలో ఉన్న ఈత చెట్లను తొలగించి పట్టాభూమిలో కలుపుకొని చుట్టూ భారీ ప్రహరీ (ఫ్రికాస్ట్) నిర్మించారు. వివరాలు.. శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామ రెవెన్యూ పరిధిలోని హైదరాబాద్-బెంగుళూరు పాత జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 115 నుంచి 122 వరకు పట్టాభూమి 5ఎకరాల 3 గుంటల భూమి ఉంది.
దానికి అనుకొని ఉన్న పాలమాకుల మైసమ్మ చెరువు అలుగుకు అనుకొని ఉన్న దాదాపు ఎకర ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేసి అక్కడ ఉన్న ఈత చెట్లను తొలగించి అలుగును పూర్తిగా పూడ్చివేసి కబ్జాకు పాల్పడిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గత డిసెంబర్ 30వ తేదీన గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌తో పాటు, శంషాబాద్ తహసీల్దార్‌కు వినతిపత్రాలు అందజేశారు. స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే శంషాబాద్ తహసీల్దార్‌కు ఆదేశాలు జారీచేశారు. అయితే కలెక్టర్ ఆదేశాలను శంషాబాద్ రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో కబ్జాదారులు స్థానిక ప్రజాప్రతినిధుల అండతో మరింత రెచ్చిపోయి కబ్జాచేసిన స్థలం చుట్టూ దాదాపు పదిఫీట్లు ఎత్తువరకు గోడ నిర్మాణం చేపట్టారు. దీంతో పాటు హైదరబాద్-బెంగుళూరు పాత జాతీయ రహదారిలో కొంత భూమిని కూడా వారి అధీనంలోకి తీసుకొని గోడ నిర్మాణం చేశారు.
కలెక్టర్ చెప్పినా లెక్కచేయని అధికారులు..
వందల ఏండ్ల చరిత్ర కలిగిన పాలమాకుల మైసమ్మ చెరువు అలుగును(ప్రభుత్వ) పూడ్చివేస్తున్నారని లిఖితపూర్వకంగా గత డిసెంబర్ 30 తేదీన స్థానిక రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పందిచిన జిల్లా కలెక్టర్ కబ్జా విషయమై పరిశీలించాలని ఆదేశించినా శంషాబాద్ రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో కబ్జాదారులు అలుగు కాల్వ భూమిని పూడ్చవేసి దర్జాగా కబ్జా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇంతటితో ఆగకుండా పట్టా భూమితో పాటు కబ్జా చేసిన భూమిలో జీవో 111ను తుంగలో తొక్కి వెంచర్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పాలమాకుల గ్రామ సర్పంచ్ కోటేశ్గౌడ్ అండతోనే కబ్జా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడాలని, కబ్జాలకు పాల్పడేవారిపై అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.