సంస్కృతంలో ‘ఋతము’ అంటే సత్యం. అందుకే అబద్ధాన్ని ‘అనృతము’ అంటారు. అక్షరమాలలో ‘ఋ,ౠ’ తీసేసినప్పటి నుంచి సత్యం చెప్పటం కూడా తగ్గిపోయింది. గత పదేండ్లలో ఇంకా తగ్గిపోయింది మన దేశంలో!
Mahatma Gandhi | ఏమిటో అంత అలవోకగా అబద్ధాలు ఎలా నోటి నుంచి జాలువారుతాయో అర్థం కాదు. తెలిసి చెప్తారో, తెలియక చెప్తారో ఇంకా అయోమయం! ఆరో క్లాసు పిల్లవాడు ఆరొందల ఏండ్ల కింద జరిగిన మొదటి పానిపట్ యుద్ధం 1526 బదులు 1527 అని రాస్తే ఉపాధ్యాయుడు సున్నా పెట్టడమే కాకుండా దెబ్బలు కూడా కొడతాడు. అయితే స్కూల్లో దెబ్బలు తిన్నవాళ్లకే సరైన సమాచారం గుర్తుంటుంది. స్కూలుకే వెళ్లని వాళ్లను ఏమనగలం? అందుకే మేధావి అంబేద్కర్ రాజకీయ పదవులకు పోటీ చేసేవారికి వయస్సు నిబంధనతో పాటు, ఓటు వేసేవారికి కూడా కనీస విద్యార్హత ఉండాలని రాజ్యాంగంలో రాయాలని నెహ్రూతో వాదించారు. తన వారసుల సంగతి ముందే ఊహించారేమో, నెహ్రూ ఆ నిబంధనలను ఒప్పుకోలేదు. ఫలితంగా మన ప్రస్తుత ప్రధానమంత్రికి పాపం సెప్టెంబర్ 11, 1906లో దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్‌లో మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ (ఈ పేరు ఆయనకు అసలు తెలియకపోవచ్చు) తన అహింసాత్మక నిరసనను మొదలుపెట్టారని ఎలా తెలుస్తుంది? అయినా పుస్తకాల్లో చదువుకోనివారికి తను పుట్టడానికి అర్ధ శతాబ్దం ముందు జరిగిన విషయాలు తెలియాలనుకోవడం అత్యాశ కదా?
ఒకవేళ లౌకికవాదాన్ని నమ్మిన విశ్వ మానవుడు గాంధీ కేవలం కాంగ్రెస్ పార్టీకే చెందుతాడని పొరపాటు పడి అన్నీ తెలిసే ప్రధానమంత్రి గాంధీ 1982 తర్వాతే జనానికి తెలిశారని అన్నాడనుకోండి. అది రాజకీయ అబద్ధం అవుతుంది. అయినా మనకేమన్నా కొత్తా ఇటువంటివి వినడం! ఈ పదేండ్లలో దాదాపు 743 కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి విన్నాం. ఒక్కటైనా పట్టుమని ఏడాది నిలబడిందా? మరి అన్న మాట నిలబెట్టుకోనివాడిని హిందీలో, గుజరాతీలో ఏమంటారో కానీ, అచ్చ తెలుగులో మాత్రం ‘అబద్ధాలకోరు’ అని అంటారు. ఒక్కసారి గరుడ పురాణం చదివితే ఎవ్వడూ పొరపాటునైనా అబద్ధం చెప్పడు. అయినా ఖర్మ, ఆ చదవటం లేకే కదా ఇన్ని అబద్ధాల పునాదుల మీద రాజకీయ నిచ్చెనలు నిలబడుతున్నాయి!
అజ్ఞానం ఉన్నవాళ్లకు కొద్దిగానైనా నమ్రత ఉంటే వాళ్లకు కొందరైనా మిత్రులవుతారు. కానీ అజ్ఞానానికి అహంకారం తోడైతే, దానికి పక్షపాత ధోరణి, అధికార దాహం, ప్రతీకారేచ్ఛలు కలిస్తే అది వ్యక్తికే ప్రమాదం. మొదటి ఎన్నికలలో (2014) ఉత్సాహంతో, రెండో ఎన్నికలలో (2019) మత మౌఢ్యంతోనూ గెలిపించినవాళ్లే ఇప్పుడు సందిగ్ధంలో పడ్డారు. ప్రమాణం చేసి చెప్పిన 15 లక్షల రూపాయల కోసమే కాకుండా, మన దేశంలో పురాతన సంస్కృతిని ఉద్ధరిస్తాడనీ, సంస్కృతం వేదాలు పునరుద్ధరిస్తాడనీ మొదటిసారి గెలిపించారు. ‘యత్ర నార్యస్థు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా’ అని వేదికలెక్కి ఆర్ఎస్ఎస్, బీజేపీ అధికారంలోకి వస్తేనే భారత మహిళలకు ముక్తి, మోక్షం అన్న ఉపన్యాసకులే కాక, పీఠాధిపతులు కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. అయితే బిల్కిస్ బానో, అంతర్జాతీయ పతకాలు సంపాదించిన మహిళా యోధులే కాదు, దేశంలో ఆడవారి మీద అత్యాచారాలు ఎక్కువయ్యాయి.
బీజేపీ రాజకీయ నాయకులే స్త్రీల గురించి అసభ్యంగా మాట్లాడిన సందర్భాలు కోకొల్లలు. మరి వీటన్నింటికీ నాయకత్వ స్థానంలో ఉన్నవారిది బాధ్యత కాదా? ఏం కాలేదు, 2014 తర్వాత స్త్రీ గౌరవం దేశంలో అఖండంగా పెరిగిందని అబద్ధం చెప్పేసుకొని సంతోషపడదామా? మరి ప్రపంచ ర్యాంకుల్లో స్త్రీల మీద అత్యాచారాలు జరిగే దేశాల్లో భారతదేశం ప్రమాదకరమైనది అన్న సత్యాన్ని దాచగలమా? గ్రీకు దేశ తత్తవేత్త ప్లేటో రాజకీయ నాయకుడు విజ్ఞానవేత్త, తత్వవేత్త కావాలని ఆదేశించాడు. ఇప్పుడు మన దేశంలో అజ్ఞానవేత్త (తెలియక మాట్లాడితే), లేక అనృతమూర్తి (తెలిసి అబద్ధాలు చెప్తే) ప్రధానమంత్రిగా ఉన్నాడు. మూడోసారి గెలవడమే కాదు, ఇంకో రెండుసార్లు గెలిచి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో దిగదుడుపు చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
2014లో రాజకీయ నాయకుల పదవీ విరమణ వయస్సు 75 సంవత్సరాలైతే, ఇప్పుడు సొంత రాజ్యాంగం రాసి దాన్ని 90 ఏండ్లు చేశాడు. ఇక తత్వవేత్త సంగతంటారా? మన ప్రధానమంత్రి తత్వానికంటే ఆర్థికానికి ఎక్కువ గౌరవం ఇస్తాడు. సంపదను అందరూ సరిగ్గా ఉపయోగించుకోలేరు కాబట్టి దేశంలో ఒకళ్లిద్దరి దగ్గర దేశ సంపద అంతా ఉంటే మంచిదని అనుకుంటాడు. భూస్వామ్య వ్యవస్థలో పది మంది కొడుకులు కొట్టుకు చస్తున్నా, ఆస్తి అంతా తండ్రి పేరు మీదే ఉండే పద్ధతి అన్నమాట!
అనుభవించినవాడికే కష్టం తెలుస్తుంది అన్న సామెత కూడా తప్పవుతుంది అప్పుడప్పుడు. లేమి నుంచి పైకి వచ్చి అత్యున్నత స్థానం అధిరోహించినవాడికి పేదవాడి కష్టాల గురించి ఎక్కువ అవగాహన ఉండాలి కదా! సంపన్న కుటుంబంలో పుట్టిన రతన్‌టాటా వితరణశీలి అవడం ఏమిటి, అష్ట దరిద్రంలో పెరిగానని చెప్పిన మనిషికి పేదవాళ్ల పట్ల ఈ ద్వేషం ఏమిటి? ఎంత ఆలోచించినా అర్థం కాని విషయం ఇది. ఏం చేస్తాం ఎన్నుకుంటే అనుభవిద్దాం, లేకపోతే తోసి రాజు అందాం!
-కనకదుర్గ దంటు
89772 43484