భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించింది. కేసీఆర్ మళ్ళీ శంఖం పూరించారు. ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఎన్నో అడ్డంకులు ఎదురైనా పట్టుదలగా ప్రయత్నించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు కేసీఆర్. ఎనిమిదేండ్లలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శంగా నిలిపారు. ఇప్పుడు అదే పట్టుదలతో తెలంగాణ మాడల్‌ను దేశమంతా అమలు చేయాలని జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.
ఆనాడు చట్ట సభల్లో బలం, అధికారులు, మీడియా మద్దతు, ఆర్థిక వనరులు కలిగి ఉన్న ఆంధ్రా పరిపాలకుల జిత్తులకు ఎదురొడ్డి నిలిచిన కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని సంఘటితం చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాల్లో ప్రవేశించారు. అయితే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించగలరా అని కొందరికి అనుమానాలున్నాయి. ముఖ్యంగా కొందరు మేధావులు ఇది హాస్యాస్పదం అని అంటున్నారు. 330 ఎంపీ సీట్లున్న బీజేపీతో తొమ్మిది ఎంపీ సీట్లున్న బీఆర్ఎస్ తలపడటం ఏమిటని వెక్కిరిస్తున్నారు. కానీ వీరందరి అభిప్రాయాలను తలకిందులు చేస్తూ బీఆర్ఎస్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఎన్నో విజయాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో ఎన్నో సాధించారు. బలమైన నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడుని ఎదుర్కొని, తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి తెలంగాణ సాధనకు ఢంకా మోగించి విజయం సాధించిన ఘనత కేసీఆర్‌ది. బీజేపీకి ఒకప్పుడు పార్లమెంటులో రెండు సీట్లు మాత్రమే ఉండేవి. నేడు ఆ పార్టీ 303 స్థానాలు కలిగి ఉంది. అలాంటప్పుడు 9 సీట్లు కలిగిన బీఆర్ఎస్ తన సీట్ల సంఖ్యను పెంచుకోలేదా?
బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ముఖ్యంగా దక్షిణ భారత దేశంలోని రాష్ర్టాల్లో కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నది. ఈడీ, ఐటీ, సీబీఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయడానికి వినియోగించుకుంటున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చాక సీబీఐ 115 మందికి పైగా ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 120 మందికి పైగా రాజకీయ నేతలపై కేసులు పెట్టింది. ఇందులో 115 మంది ప్రతిపక్ష నేతలే. దేశ ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి కార్పొరేట్ల సంపద పెరగడానికి సహాయం చేస్తున్నది. బీజేపీ అనుసరిస్తున్న కక్ష సాధింపు విధానాలను, అభివృద్ధి వ్యతిరేక చర్యలను చూసి ఆ పార్టీ అంటే ప్రజలకు ఏవగింపు వచ్చింది.
మరోవైపు కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దింది. కేంద్రం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వివిధ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని ప్రశంసించి పురస్కారాలు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. ఆర్థికాభివృద్ధిలోనే కాకుండా మానవాభివృద్ధిలోనూ తెలంగాణ ముందంజ వేసింది. వివిధ రాష్ర్టాల మేధావులు, రైతు సంఘాల నాయకులు, ప్రభుత్వ అధికారులు తెలంగాణలో అమలవుతున్న పథకాలను పరిశీలించి ప్రశంసిస్తున్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ పథకాలను ఆదర్శంగా తీసుకుని వాటిని తమ రాష్ర్టాల్లో అమలు చేస్తున్నాయి.
బీజేపీ ప్రతిపక్ష ముక్త్ భారత్‌ను కోరుకుంటున్నది. నియంతృత్వాన్ని పెంచి పోషిస్తున్నది. ఈ నేపథ్యంలో దేశాభివృద్ధి కోరుకునే రాజకీయ పార్టీలు, మేధావులు బీఆర్ఎస్కు మద్దతుగా నిలిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని సమర్థంగా ఎదిరించవచ్చు. వ్యవసాయం, ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల కల్పనపై బీఆర్ఎస్ స్పష్టమైన ప్రణాళిక వెలువరించాలి. వీటిని దేశ ప్రజల్లోకి బలంగా తీసుకెళితే బీఆర్ఎస్కు దేశ ప్రజల మద్దతు మరింత పెరుగుతుంది.
దేశంలో 70 వేల టీఎంసీల నీరు వృథాగా పోతున్నదని, ఈ నీటిని సమర్థంగా వ్యవసాయానికి వినియోగించుకుంటే దేశం అభివృద్ధి సాధిస్తుందని చెప్పి దేశం దృష్టిని ఆకర్షించారు కేసీఆర్. దేశాభివృద్ధి కోసం కొత్త ప్రణాళికలు రూపొందించడంలో, కొత్త నినాదాలు సృష్టించడంలో కేసీఆర్‌ను మించినవారు లేరు. ఒకప్పుడు ఎడారిలా ఉన్న, వలసలు పెరిగిన, మంచి నీరు కూడా దొరకని తెలంగాణను ఎనిమిదేండ్లలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారు కేసీఆర్.
మన దేశం రత్న గర్భ. అద్భుతమైన, అపారమైన మానవ సంపద, సహజ వనరులు కలిగిన దేశం. ప్రపంచంలోనే ఏ దేశానికీ లేని అనుకూలతలు మన దేశానికి ఉన్నా యి. అలాంటి దేశాన్ని అందరం కలిసి సమిష్టి కృషితో ఎంతో అభివృద్ధి చేయవచ్చని కేసీఆర్ అంటున్నారు. ఆయనకు మద్దతుగా నిలవడం మనందరి కర్తవ్యం.
భారత రాష్ట్ర సమితి పార్టీ పేరులోనే ఒక విశిష్టత ఉన్నది. అన్ని రాష్ర్టాలు కలిస్తేనే భారత దేశం అవుతుంది. దీన్ని బీఆర్ఎస్ ప్రతిఫలిస్తున్నది. జాతీయవాదం, మత వాదం మాటున రాష్ట్ర ప్రభుత్వాల ఉనికిని నిర్వీర్యం చేసే బీజేపీ విధానానికి విరుద్ధంగా సమాఖ్య స్ఫూర్తికి బీఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యమిస్తున్నది. మత రాజకీయాలను, ప్రతీకార రాజకీయాలను ప్రోత్సహించి ప్రజాస్వామ్యాన్ని సంక్షోభంలోకి నెడుతున్న బీజేపీని నిలువరించి దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ప్రజాస్వామ్య విలువలు కలిగిన, ఉద్యమ భావాలు కలిగిన, ప్రజా సంక్షేమాన్ని కోరుకునే బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని అప్పగించాలి.
(వ్యాసకర్త: రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు,తెలంగాణ వికాస సమితి)
-ఫణి రాజారావు రామినేని
94406 40006