తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ‘నేను వస్త కొడుకో సర్కారు దవాఖానకు..’ అనే విధంగా ప్రభుత్వ దవాఖానల పరిస్థితి మారిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి వల్ల సర్కారీ దవాఖానల్లో వైద్య సేవలు, సౌకర్యాలు మెరుగయ్యాయి. వైద్య కళాశాలలు, బోధనాసుపత్రులు పెరిగాయి. కార్పొరేట్ హస్పిటళ్లలో మాత్రమే జరిగే శస్త్ర చికిత్సలు ప్రభుత్వ దవాఖానల్లో జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితో కృషి చేస్తున్నప్పుడు అత్యుత్తమ ప్రజారోగ్య సేవలు అందించడం వైద్య సిబ్బంది విధి.
ఒకప్పుడు వైద్యం అంటే నిధులు కేటాయించి కొన్ని వసతులు కల్పిస్తే అదే మహా భాగ్యం అనుకునేవారు. కానీ ముఖ్య మంత్రి కేసీఆర్ వైద్యశాఖ సమస్యలను మూలాల నుంచి పరిష్కరిస్తున్నారు. నూటికి తొంభై రోగాలు నీళ్ల వల్ల వస్తాయని గ్రహించి మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన మంచి నీళ్లు అందించి వ్యాధులను అరికడుతున్నారు. ప్రజల హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తున్నారు. దీని వల్ల చికిత్స సులభమవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ దవాఖానలలో ప్రసవాలు పెరిగాయి. 2014తో పోలిస్తే ఆరోగ్యశ్రీ క్లెయిమ్స్‌లో సర్కారు దవాఖానల వాటా 30 నుంచి 50 శాతానికి పెరిగింది. ప్రభుత్వ దవాఖానల పట్ల ప్రజల నమ్మకం ఎంతగా పెరిగిందో, సౌకర్యాలు ఎంతగా మెరుగుపడ్డాయో దీన్ని బట్టి తెలుస్తున్నది. కరోనా కాలంలో ఇంటింటికీ జరిపిన జ్వర సర్వే దేశ చరిత్రలోనే వినూత్నం. రాష్ట్రమంతా కంటి పరీక్షలు నిర్వహించి ఉచిత కళ్లద్దాలు ఇవ్వడం వల్ల పేదలకు ఎంతో లబ్ధి చేకూరింది.
రాష్ట్ర ప్రభుత్వం మూడంచెల వైద్య చికిత్స వ్యవస్థను ఐదంచెలుగా మార్చింది. పట్టణాల్లో బస్తీ దవాఖానలు, గ్రామాల్లో పల్లె దవాఖానలు, జిల్లాకో మెడికల్ కాలేజీ- బోధనాసుపత్రి నెలకొల్పుతున్నది. దీంతో మన విద్యార్థులు విదేశాల్లో వైద్య విద్య అభ్యసించాల్సిన అవసరం లేకుండా ఇక్కడే బోలెడు సీట్లు లభిస్తున్నాయి. ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడానికి వరంగల్‌లో హెల్త్ సిటీ, హైదరాబాద్ నాలుగు మూలలా సూపర్ స్పెషాలిటీ దవాఖనలను ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఉచిత రోగ నిర్ధారణ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేసింది. ప్రాథమిక స్థాయిలో వైద్య ఆరోగ్య సేవలను బలోపేతం చేసిన ప్రభుత్వం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి వైద్య మౌలిక వసతుల కోసం కృషి చేస్తున్నది.
కేంద్రం నుంచి సరైన సహకారం లేనప్పటికీ ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా బోధనాసుపత్రిని నెలకొల్పడం వల్ల రోగులకు హైదరాబాద్‌లోని ప్రభుత్వ దవాఖాన లకు వెళ్లి వచ్చే వ్యయ ప్రయాస తగ్గింది. మహబూబ్ నగర్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ, సంగారెడ్డి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, రామగుండం, జగిత్యాల, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కొత్తగా మెడికల్ కళాశాలలు, వాటికి అనుబంధంగా బోధనాసుపత్రులు ఏర్పాటయ్యాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలను వైద్య మంత్రి హరీశ్ రావు సమర్థంగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో సాయంత్రం వేళల్లోనూ అవుట్ పేషెంట్ సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. కీలు మార్పిడి శస్త్ర చికిత్సలను ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో విరివిగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కోఠిలోని ప్రభు త్వ ఇ.ఎన్.టి దవాఖానకు తగినంత బడ్జెట్ కేటాయించి పెండింగ్‌లో ఉన్న కోక్లియార్ ఇంప్లాంట్ (పుట్టుకతో మూగ, చెవుడు కలిగిన పిల్లలకు వినికిడి తెప్పించే శస్త్ర చికిత్స) ఆపరేషన్లను పూర్తి చేయించారు. సర్కారు దవాఖానలలో సౌకర్యాలు నెలకొల్పడంతో పాటు ఎటువంటి లోపాలు లేకుండా సేవలు అందించే విధంగా ఆరోగ్యశాఖ మంత్రి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి నెలా ఠంచనుగా వైద్య శాఖలోని అన్ని విభాగాలతో జూమ్ మీటింగులు నిర్వహిస్తూ అన్ని స్పెషాలిటీ వైద్య విభాగాల్లోనూ వైద్య సేవలు విస్తరించడంతో పాటు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించడానికి ప్రభు త్వం ఇంత చిత్తశుద్ధితో కృషి చేస్తున్నప్పుడు అందుకు సహకరించడం వైద్య సిబ్బంది అందరి విధి. కరోనా కాలంలో వైద్యుల సేవలకు తగిన గుర్తింపు వచ్చింది. ఇప్పుడూ అదే నిబద్ధతతో ద్విగుణీకృత కృషి సాగిద్దాం. ప్రపంచం మన వైపు చూసే విధంగా వైద్య రంగాన్ని తీర్చిదిద్దుకుందాం.
(వ్యాసకర్త : ఇ.ఎన్.టి స్పెషలిస్ట్, ప్రభుత్వ చెవి, ముక్కు, గొంతు వైద్యశాల, కోఠి)
-డాక్టర్ రవిశంకర్ ప్రజాపతి