దేశంలో ఉద్యమాల గడ్డ తెలంగాణ పొద్దు ఉదయించింది. జయ జయధ్వానాల మధ్య తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా(బీఆర్ఎస్) రూపాంతరం చెందింది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో, అదే పట్టుదలతో, అదే ధైర్యంతో భారత దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి బీఆర్ఎస్ పయనమైంది. దేశానికి పట్టిన చెదలును వదిలించడానికి తెలంగాణ పోరాట యోధుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రణ నినాదం చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడినట్టే భారత దేశ ఔన్నత్యాన్ని, ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు హస్తిన దిశగా కదిలారు.భారతీయుల హృదయాలను తట్టి లేపి దేశ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నారు కేసీఆర్.
చరిత్ర సృష్టించటం, చరిత్రను తిరగరాయడం రెండూ తెలంగాణ మట్టికే సాధ్యం. ఒకప్పుడు రాదు రాదన్న తెలంగాణను పట్టుబట్టి సాధించుకున్న మొండితనం ఈ నేలది. ఈ నేలమీద పుట్టిన కేసీఆర్ అదే మొండితనంతో దేశ రాజకీయాల్లోకి అడుగు పెడుతుండడాన్ని దేశం యావత్తు గమనిస్తున్నది.
దేశాన్ని సక్కని తోవలో పెడతారని ఆశించి బీజేపీ చేతిలో అధికారాన్ని పెడితే దేశ సంపదను ఊడ్చేసి కార్పొరేట్ గద్దలకు అమ్మేస్తున్నా రు. ఇదేమని ప్రశ్నిస్తున్న వారిపై ఈడీ, సీబీఐ లతో దాడులు చేపిస్తున్నారు. జాతి సంపద కొందరి దగ్గరే పోగు పడటం శ్రేయస్కరం కాదు. కానీ కేంద్రం కార్పొరేట్లకే రుణాలు మాఫీ చేస్తూ వారిని మరింత ధనికులుగా మారుస్తున్నది. బ్యాంకులకు వందల కోట్ల రూపాయలు ఎగగొట్టినా వారిని అడిగే దిక్కు ఉండదు. అదే ఒక రైతు తీసుకొన్న కొన్ని వేల రూపాయల రుణాన్ని తీర్చకపోతే ఇంటికి తాళం వేసి పరువు తీస్తారు. ఇలా ఉంది కేంద్ర ప్రభుత్వ తీరు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సమస్యలను పట్టించుకోవడం లేదు. ఆ పార్టీకి అభివృద్ధి చేయడం చేతగాక మత విద్వేషాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నది. దేశంలో నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నది. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నది.
రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ, దేశ ప్రజల జీవన ప్రమాణాలను దిగజార్చిన కేంద్రంలోని బీజేపీ సర్కారుపై దేశ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీసి, దేశానికి మతమనే క్యాన్సర్‌ను అంటించిన బీజేపీ హిందుత్వ వాదాన్ని అసహ్యించుకుంటున్నారు. దేశ భవితను మార్చే పార్టీ కోసం, నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ సమస్యలపై మేధో మథనం జరగాలి. బీజేపీ పాలనకు చరమ గీతం పాడి ప్రజా సంక్షేమాన్ని అందించే పాలన కావాలి. ఈ సమయంలోనే కేంద్రంలోని బీజేపీ దుర్మార్గ పాలనను అంతం చేసి దేశాన్ని కాపాడేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుకు వచ్చారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో..ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైంది. దీన్ని సహించలేని కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా చేసుకున్నారు. ఇందు కోసం ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి పదవికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని(టీఆర్ఎస్) స్థాపించారు. మేధావులు, సామాన్యులు, సబ్బండ వర్గాలను తన ప్రసంగాలతో చైతన్య పరిచారు. అందరితో కలిసి నిరంతర ఉద్యమం సాగించారు. తెలంగాణ ప్రజల ఉద్యమానికి కేంద్రం దిగి వచ్చింది. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు స్పందించి 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేసింది. కానీ ఆ తర్వాత ఆ నిర్ణయం నుంచి వెనక్కి మళ్లేందుకు శతవిధాల ప్రయత్నించింది. కానీ తెలంగాణ ప్రజల చైతన్యం, కేసీఆర్ వ్యూహాలు కేంద్రం మెడలు వంచాయి. టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ సారథ్యంలో ప్రజల నిర్విరామ పోరాటం ఫలితంగా ఐదేండ్ల తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రజలు ముఖ్యమంత్రిగా పట్టం కట్టారు.
ఈ ఎనిమిదేండ్లలో కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేసింది. ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించింది. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపైనా, బీఆర్ఎస్ పార్టీపైనా కక్ష గట్టింది. విభజన హామీలు నెరవేర్చకుండా, ఇవ్వాల్సిన నిధులు, ప్రాజెక్టులు ఇవ్వకుండా రాష్ర్టాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నది. మరోవైపు దేశంలోని బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రయత్నిస్తున్నది. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. అస్తవ్యస్త పరిపాలనతో దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించింది. మత విద్వేషాలను ఎగదోస్తూ ప్రజల మనస్సుల్లో విద్వేష బీజాలు నాటుతున్నది. ఇలాంటి దుర్భర పరిస్థితులను రూపు మాపి భారతావని భవితను తీర్చిదిద్దడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. రాజకీయాలనేవి అధికారం కేంద్రంగా కాకుండా ప్రజలు కేంద్రంగా సాగాలని రాజకీయ పార్టీలు, ప్రజలకు తెలిపారు. దేశాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చి దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.
బీజేపీ పాలనతో ఇబ్బంది పడుతున్న దేశ ప్రజలకు విముక్తి కల్పించేందుకు, మోదీ-షా ద్వయం నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా కేసీఆర్ సమర శంఖం పూరించారు. దేశం కోసం, రైతుల కోసం బీజేపీని, మోదీని తరిమి కొట్టాలని పొలి కేక పెట్టారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినట్టే ఉద్యమ పంథాలో దేశం కోసం అందరూ కలిసి నడవాలని కోరుతున్నారు. బీజేపీ ముక్త్ భారత్‌ను సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.
ఇందులో భాగంగానే ఇటీవల 26 రాష్ర్టాల రైతులతో, మేధావులతో, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కేసీఆర్ సమాలోచనలు చేశారు. దేశంలో జరుగుతున్న పరిణామాలను నిశీతంగా పరిశీలిస్తున్న కేసీఆర్ దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను రూపొందించారు. వాటి గురించి దేశ ప్రజలకు వివరించి వారిని చైతన్య వంతులను చేసేందుకు దేశ వ్యాప్త ంగా పర్యటిస్తున్నారు. భారత రాష్ట్ర సమితికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర తెలిపిన నేపథ్యం లో డిసెంబర్ 9న బీఆర్ఎస్ లక్ష్యాలను దేశ ప్రజలకు వివరించారు.
చరిత్ర సృష్టించటం, చరిత్రను తిరగరాయడం రెండూ తెలంగాణ మట్టికే సాధ్యం. ఒకప్పుడు రాదురాదన్న తెలంగాణను పట్టుబట్టి సాధించుకున్న మొండితనం ఈ నేలది. ఈ నేలమీద పుట్టిన కేసీఆర్ అదే మొండితనంతో దేశ రాజకీయాల్లోకి అడుగు పెడుతుండడాన్ని దేశం యావత్తు గమనిస్తున్నది. అనతికాలంలో తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపడంతోపాటు అభివృద్ధిని పరుగు పెట్టిస్తున్న కేసీఆర్ పాలన తీరును ప్రజలు గమ నిస్తు న్నారు. అలాంటి సంక్షేమ పాలన కావాలని దేశం యావత్తు కోరుకొంటున్నది.
ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, పోరాటం ఫలితంగా నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం. కానీ వారు నిలబెట్టిన భారత దేశం నేడు బీజేపీ వల్ల కష్టాల పాలవుతున్నది. బడు గు, బలహీన వర్గాలు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నాయి. దీని గురించి దేశ ప్రజలందరూ ఆలోచించాలి. ఇప్పుడు మనం మేల్కోకపోతే దేశం పూర్తిగా నష్ట పోతుందని గ్రహించాలి. బీజేపీ సృష్టించిన మత విద్వేషాలు, ద్వేషం, వివక్షత అనే మంటలను ఆర్పేయాలి. మేధావులు, యువత, విద్యావంతులు, ప్రగతిశీల శక్తులన్నీ దేశాభివృ ద్ధి గురించి ఆలోచనలు చేయా లి. దేశంలో గుణాత్మక మార్పు కోసం జరుగుతున్న ఈ పోరాటంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కి అండగా నిలిచి ఆయన వెంట నడవాలి.
జై భారత్… జై బీఅర్ఎస్(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-చిటుకుల మైసారెడ్డి
94905 24724