‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో’.. ధర్మం పేరు చెప్పుకొంటూ బీజేపీ విశృంఖలంగా చేస్తున్న ప్రజాస్వామ్య హననాన్ని చూసి భరతమాత విలపిస్తున్నది. విదేశీ పాలకుల చెర నుంచి విముక్తి సాధించి 75 ఏండ్లయిన తర్వాత మళ్లీ తనను చెర పడుతున్న స్వదేశీ పాలకుల నుంచి విముక్తి ఎప్పుడా అని ఎదురు చూస్తున్నది. వందల కోట్లు పోసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం కోసం వచ్చినవారి మాటలు వింటే.. ఈ దేశ చట్టాల పట్ల గానీ, ప్రజాస్వామిక సంప్రదాయాల పట్లగానీ పాలకపార్టీకి కించిత్తు గౌరవం, భయం అన్నది లేనివారి వ్యవహారశైలి చూస్తే.. దేశంలో ప్రజాస్వామ్యం అసలున్నదా అన్న అనుమానం కలుగుతున్నది. ఈ దారుణాన్ని ఆపకపోతే, దీనికి అడ్డుకట్ట వేయకపోతే మనల్ని మనమే కాదు, భవిష్యత్తుతరాలు కూడా క్షమించలేని రోజు వస్తుంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనటానికి వచ్చినవారు ‘వింటే గోడి (మాతో సఖ్యత) లేదంటే ఈడీ’ అంటూ నిస్సిగ్గుగా తమ విధానాన్ని ప్రకటించారు. దేశంలో అక్రమ ధన ప్రవాహాన్ని అరికట్టే సమున్నత లక్ష్యంతో ఏర్పాటైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను తమ జేబు సంస్థగా ప్రకటించేశారు. కాంగ్రెస్ హయాం కొనసాగుతున్న కాలంలో, సీబీఐని పంజరంలో చిలుకగా న్యాయస్థానం అభివర్ణించింది. కానీ, ఇప్పుడు మోదీ పాలనలో ఆ దుర్గతి సకల దర్యాప్తు సంస్థలకూ పట్టిందని తేటతెల్లమవుతున్నది. ఈడీ, సీబీఐ, ఐటీ అన్నీ ఇప్పుడు దొంగ స్వాముల చేతుల్లో, ధర్మాన్ని రక్షిస్తామని పదే పదే చెప్పుకొనే వారి చేతుల్లో, తెల్లారి లేస్తే దేశభక్తి గురించి మాట్లాడే వాళ్ల చేతుల్లో బందీలై ఉన్నాయని వీడియోలు చూస్తే తెలుస్తున్నది.
తమకు దగ్గరివారైన ఒకరిద్దరు వ్యాపారులకు దేశ, విదేశాల్లోని బడా బడా కాంట్రాక్టులు వచ్చేలా ప్రభుత్వాన్ని ఉపయోగించటం, వారి సంపదను అతి స్వల్పకాలంలో అనేక రెట్లు పెరిగేటట్లు చేయటం తొలి దశ (సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రే అదానీకి కాంట్రాక్టు కోసం తమపై ఒత్తిడి తెచ్చారని శ్రీలంక విద్యుత్ విభాగం అధికారి వెల్లడించిన విషయం ఈ సందర్భంగా గమనార్హం). ప్రభుత్వ అండతో లక్షల కోట్లు వెనకేసుకున్న ఆ వ్యాపారులు అధికార పార్టీకి వేల కోట్ల కప్పం కట్టడం రెండో దశ. ఆ సొమ్ముతో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న ప్రతీ రాష్ట్రంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం, అక్కడి ప్రభుత్వాలను కూల్చటం, బీజేపీని గద్దె మీద కూర్చోపెట్టడం మూడో దశ. జనం వీటిగురించి ప్రశ్నించకుండా, మేధావులు ఇదేమని నిలదీయకుండా హిందూ భావోద్వేగాలు రెచ్చగొట్టడం, హిందూ మతానికి ఛాంపియన్లమని తమకు తామే ప్రకటించుకోవటం, తమను విమర్శించటం అంటే హిందూ మతాన్ని, దేశాన్ని విమర్శించటం అనే భ్రమను కల్పించటం నాలుగో దశ. ఈ భ్రమల నడుమ దేశంలోని సకల వ్యవస్థలను చెర పట్టడం, ప్రత్యర్థులను భయపెట్టడం, అసమ్మతిని అణచివేయటం ఐదో దశ. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని పీఠం చేపట్టిన తర్వాత ఈ ఐదు దశలూ ఏకకాలంలో అమలవుతున్నాయి. కాబట్టే, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రజాస్వామ్యం దీనావస్థలోకి దిగజారిపోయింది.
ప్రజాస్వామ్యాన్ని తొక్కేసుకుంటూ వెళ్తున్న బీజేపీ రథానికి దేశ తూర్పు, పశ్చిమ, ఉత్తర దిశల్లో ఎక్కడా ఎటువంటి అడ్డంకి ఎదురు కాలేదు. మొన్నటి ప్రెస్ కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా.. అందరూ ఆ ఓటమిని, ఆ రాక్షసదాడిని మౌనంగానే భరిస్తూ వచ్చారు. అందువల్లే, మరాఠా బెబ్బులి బాల్‌థాకరే స్థాపించిన శివసేన నేడు చీలికలు పేలికలై పోయింది. అందువల్లే, పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ అంతర్గత కుమ్ములాటలతో సతమతమైపోయి, అసెంబ్లీ ఎన్నికల్లో ఉనికి చాటుకోలేని స్థితికి చేరుకున్నది. అందువల్లే, తమిళనాడులో అన్నాడీఎంకే వర్గపోరుతో కుదేలైపోయింది. బీజేపీతో కొన్నేండ్ల కిందటి వరకూ సఖ్యతగా ఉన్న పార్టీల పరిస్థితి ఇది. స్నేహం ముసుగులో బీజేపీ నుంచి వచ్చే ముప్పును తప్పించుకునేందుకే నితీశ్‌కుమార్, నవీన్ పట్నాయక్ వంటి ‘దశాబ్దాల స్నేహితులు’ ఆ పార్టీకి దూరంగా జరిగారు. ఇక కాంగ్రెస్ తదితర విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో చెప్పాల్సిన పనేలేదు.
రాత్రికి రాత్రి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తారు. గవర్నర్ ఆమోదిస్తారు. ప్రభుత్వం కూలుతుంది. కమలం గద్దెనెక్కుతుంది. ఈశాన్య రాష్ర్టాల్లో బీజేపీకి కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేనిచోట కూడా ఇటువంటి ప్రజాస్వామ్య హత్యాకాండలు చోటు చేసుకున్నాయి. కాబట్టే, ఆ పార్టీ అగ్ర ద్వయానికి ఇక తమకు ఎదురులేదన్న అతిశయం వచ్చేసింది. ఏ రాష్ట్రంలోనైనా ఏక్నాథ్ షిండేలను సృష్టించగలమని, ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలను కూల్చగలమని ప్రగల్భాలు పలుకుతున్నది అందుకే. నియంతలకు కాలం ఏ గతి పట్టించిందో చరిత్రే సాక్ష్యం. ప్రకృతి ఎన్నడూ ఒకే వైపుండదు. అది ఎల్లప్పుడూ సమతుల్యతను కాపాడుతూనే ఉంటుంది.
చెడు వీర విహారం చేస్తున్నప్పుడు, మంచి.. నిప్పులు చిమ్మే ఖడ్గమై వచ్చి తీరుతుంది. దుష్టత్వాన్ని తుదముట్టిస్తుంది. మన దేశ చరిత్ర, ప్రపంచదేశాల చరిత్ర అనేకమార్లు దీన్ని రుజువు చేసింది. నేడు కూడా అది మరోసారి రుజువవుతున్నది. తూర్పు, పశ్చిమ, ఉత్తరాన నిర్నిరోధంగా ఊరేగిన బీజేపీ ఇప్పుడు దక్షిణాదిన, అందులోనూ పోరుగడ్డ తెలంగాణతో పెట్టుకుంది. వేల వేల విషనాగులతో తలపడి, కలబడి, నిలబడిన తెలంగాణ ఇది. ఎన్ని కుట్రలను ఎదుర్కొని, ఎన్ని యుద్ధాలలో పాల్గొని ఈ తెలంగాణ నిలబడింది. ఇటువంటి తెలంగాణతో బీజేపీ పెట్టుకొని ఒక విధంగా మంచిపనే చేసింది. దేశానికి బీజేపీ నుంచి విముక్తి కల్పించటం కోసం భరతమాతనే తన తెలంగాణ బిడ్డను ఎంచుకున్నట్లుంది.
ప్రజాస్వామ్య హత్యలు చేయటానికి అలవాటుపడిన హంతకుడు మొట్టమొదటిసారిగా తన పీకను ఎవరో పట్టుకున్నట్లుగా ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. తెలంగాణ తెగువ బీజేపీకి తొలి అడుగులోనే వణుకు పుట్టించి ఉంటుం ది. ఎమ్మెల్యేల కొనుగోలు వీడియోలు, ఆడియోలు ఇప్పటికే దేశమంతటా వ్యాపించాయి. ప్రజాస్వామ్య హంతకుల కుట్రలను తెలంగాణ యోధుడు కేసీఆర్ యావత్‌దేశం ముందుపెట్టారు.
ఇదొక చారిత్రక సందర్భం. విభేదాలన్నీ పక్కనబెట్టి మాతృభూమి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో అందరమూ కలిసి నడువాల్సిన తరుణమిది. తెలంగాణ కోసం నాడు ముక్కోటి జనం ఒక్కటైనట్లుగా, నేడు ప్రజాస్వామ్య భారత్ కోసం యావత్ భరతజాతి ఒక్కటై, ఒక్క గొంతుకై ముందడుగు వేయాలి.
భారతీయ సహోదరులారా!
ప్రజాస్వామ్య పునఃప్రతిష్ఠాపక రథం తెలంగాణ నుంచి బయల్దేరింది. భరతమాతకు మనం విముక్తి కల్పిస్తాం. మళ్లీ మనమందరం స్వేచ్ఛా వాయువులు పీల్చుకొనే రోజు త్వరలోనే వస్తుంది. హమ్ హోంగే కామ్యాబ్.
-కె.వి.రవికుమార్