మన దేశాన్ని ఆంగ్లేయులు సుమారు రెండు శతాబ్దాలు పాలించారు. అనన్య పోరాటాలు, ఎంతోమంది యోధుల త్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. తద్వారా ఆంగ్లేయులు తరిమివేయబడ్డారు. నేడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాధినేతలు సామ్రాజ్యవాదులకు ఎర్రతివాచీ పరిచి మరీ ఆహ్వానిస్తున్నారు. దేశాన్ని, దేశ సంపదను వారికి భోజ్యం చేస్తున్నారు. ఇప్పటికే భారతదేశంతన అస్తిత్వాన్ని క్రమంగా కోల్పోతున్నది. సంస్కరణల పేరుతో, సరళీకృత ఆర్థిక విధానాల అమలు పేరుతో ప్రజల భవిష్యత్తును సామ్రాజ్యవాదులకు తాకట్టు పెడుతున్నది.
మన దేశంలో 1947లో 75 శాతంగా ఉన్న రైతుల సంఖ్య 2022 నాటికి 52 శాతానికి తగ్గింది. ఇందులో 20 శాతం వ్యవసాయ కార్మికులు కాగా మిగిలిన 32 శాతం మాత్రమే రైతులు. 14.57 కోట్ల రైతు కుటుంబాలు భూమినే నమ్ముకొని బతుకుతున్నాయి. వీరిని భూములనుంచి దూరం చేయాలని, ఆ భూములు కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని మోదీ ప్రభుత్వానికి జీ-7 దేశాలు, డబ్ల్యూటీవో ఆదేశాలు జారీచేసి అమలుచేయాలని ఒత్తిడి చేస్తున్నాయి. డబ్ల్యూటీవోకు కొత్తగా ఎన్నికైన డైరెక్టర్ జనరల్ నగోజీ ఒకంజీ లవీలా మోదీ అమలుచేస్తున్న విధానాలను ప్రశంసించి మూడు రైతు నల్లచట్టాలను తేవాల్సిందిగా సూచిం చింది. భారత వ్యవసాయ సబ్సిడీలు తగ్గించాలని సలహా ఇచ్చింది. గ్రీన్‌బాక్స్ పేర అమెరికాకు వ్యవసాయ సబ్సిడీలు ఇవ్వాలని చెప్పిన డబ్ల్యూటీవో డైరెక్టర్ జనరల్ భారతదేశానికి మాత్రం సబ్సిడీ నిధుల కోత పెట్టమన్నారు. దేశంలోని రూ.18 లక్షల కోట్ల విలువ చేసే వ్యవసాయ మార్కెట్లను 3, 4 కంపెనీలకు అప్పగించాలని ఆదేశించారు. వీటిని అమలు చేయడానికి మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రైతు వ్యతిరేక నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు 11 నెలల పాటు పోరాడారు. 750 మంది ప్రాణాలు కోల్పోయి సాగించిన ఉద్యమ ఫలితంగా ఆ నల్లచట్టాలను ఉపసంహరించుకున్నారు. జీ-7 దేశాల ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్న మోదీ ప్రభుత్వం ఆరు విమానాశ్రయాలను అదానీ వశం చేసింది.
మోదీ ఎన్ని ప్రకటనలు చేసినా అమెరికా జూనియర్ భాగస్వామిగానే భారత్ కొనసాగుతున్నది. బ్రిక్స్ గ్రూపు (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) నుంచి భారతదేశాన్ని బయటకు లాగాలని జీ-7 దేశాలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయి. ఆ గ్రూపునకు పోటీగా పశ్చిమాసియా క్వాడ్ పేరుతో (ఆస్ట్రేలియా, అమెరికా, భారత్) కమిటీ ఏర్పాటు చేశారు. భారత ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి చెందిన దేశాలు గైడ్ చేస్తున్నాయి. వ్యవసాయరంగాన్ని పూర్తిగా దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగా 2022-23 ఏడాదిలో ఆహారధాన్యాల కొరతను సృష్టిస్తున్నారు. సాధారణ ఉత్పత్తి కన్నా (30.5 కోట్ల టన్నులు) 2 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు తక్కువ ఉత్పత్తి అయ్యేలా కోటి ఎకరాల్లో పంటల సాగును నియంత్రించారు. ఇప్పటికే ఆహారధాన్యాల ధరలను కార్పొరేట్ సంస్థలు భారీగా పెంచేశాయి. పారిశ్రామిక, సేవారంగాల్లో కూడా ఉత్పత్తి, ఉత్పాదకత తగ్గింది. ఆ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి రాయితీలు ఇవ్వకుండా చేయడంతో 20 కోట్ల మంది ఉపాధి కోల్పోయి పట్టణాల నుంచి పల్లెలకు వలసలు వెళ్లారు.
ముఖ్యంగా దేశాభివృద్ధి కోసం పరిశోధనలు నిరంతరం సాగాలి. దేశంలోని 660 జిల్లాలకు గాను 450 జిల్లాల్లో మాత్రమే పరిశోధనా కేంద్రాలున్నాయి. అవి 1965-1985 మధ్య చేసిన పరిశోధనల వల్ల కొత్త విత్తనాలు ఆవిష్కరించబడి మన ఉత్పత్తి, ఉత్పాదకత 4 రెట్లు పెరిగింది. 1991 నాటికి మిగులు ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేశాం. అలాంటి దేశంలో 1995 నుంచి సంస్కరణల ఫలితంగా మన ఉత్పాదకత తగ్గుతూ వచ్చింది. చివరికి 2014 తర్వాత మన పరిశోధనా కేంద్రాలన్నీ మూసివేయడంతో విదేశీ టెక్నాలజీని దిగుమతి చేసుకుంటున్నాం. మనది సమశీతోష్ణ దేశం. అందువల్ల ఇక్కడి ఉత్పత్తులు నాణ్యమైనవి. మాన్‌శాంటో బీటీ టెక్నాలజీని అన్ని పంటల్లో ప్రవేశపెట్టి దెబ్బతిన్నాం. ముఖ్యంగా నూనె గింజలు, పంచదార, జొన్న పంటల్లో దిగుబడులు బాగా తగ్గాయి. ఫలితంగా 1.36 లక్షల టన్నుల వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం. వీటి విలువ రూ.82,123 కోట్లుగా ఉన్నది. 2.31 లక్షల టన్నుల పత్తి, 0.82 లక్షల టన్నుల ముడి ఉన్ని, 2.53 లక్షల టన్నుల ముతక ధాన్యాలు, 8.34 లక్షల టన్నుల జీడి పప్పు, 8.92 లక్షల టన్నుల క్రూడ్ రబ్బర్తోపాటు పంచదార 50 లక్షల టన్నులు, పప్పుధాన్యాలు 60 లక్షల టన్నులు దిగుమతులు చేసుకుంటున్నాం. ఈ దిగుమతులకు రూ.2.5 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యం వినియోగిస్తున్నాం. చివరికి హార్టికల్చర్ ఉత్పత్తులను కూడా దెబ్బతీసి రూ.55 వేల కోట్ల పండ్లు దిగుమతి చేసుకుంటున్నాం. 140 కోట్ల జనాభా కలిగి, ప్రపంచంలో 2వ అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ ఆహారధాన్యాలు, పారిశ్రామిక, సేవారంగం ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించడంతోపాటు విదేశాలకు ఎగుమతులు చేయగలగాలి.
2000లో ఎగుమతులు చేసే దశ నుంచి 2022 నాటికి దిగుమతులు చేసుకొనే దశకు దిగజారిపోయాం. నేడు 35 లక్షల కోట్ల దిగుమతులుండగా, 23 లక్షల కోట్ల ఎగుమతులు చేస్తున్నాం. ఏటా ఎగుమతులు, దిగుమతుల తేడా భర్తీకి అప్పులు చేస్తున్నాం. ఆ విధంగా విదేశీ అప్పులు 2022 నాటికి రూ.140 లక్షల కోట్లకు చేరాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ పడిపోవడం వల్ల అప్పు తీసుకోకున్నా రుణం పెరుగుతూనే ఉంటుంది. 1947లో డాలర్ రూపాయితో సమానంగా ఉండేది. దీనర్థం 1947తో పోలిస్తే సరుకు ధర 82 శాతం పెరిగినట్లే కదా?
(వ్యాసకర్త: సారంపల్లి మల్లారెడ్డి , 94900 98666 అఖిల భారతకిసాన్ సభ ఉపాధ్యక్షులు)