కొండమల్లేపల్లి, మార్చి 6: యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. వరి పొట్టదశలో ఉన్న తరుణంలో ఎరువులు దొరకకపోవడంతో రైతులు ఆగమవుతున్నారు. యూరియా స్టాక్ అందుబాటులో లేకపోవడంతో అక్కడక్కడా అన్నదాతలు ధర్నాలు, ఆందోళనలకు దిగుతున్నా అధికారులు సమస్యను అధిగమించడానికి చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. యూరియా కోసం రైతులు అధికారులు, సొసైటీ సిబ్బందిని నిలదీస్తున్నారు. శుక్రవారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని రైతు సహకార సేవా సంఘం వద్ద రైతులు యూరియా కోసం ఆందోళనకు దిగారు. 440 బస్తాల యూరియా స్టాక్ వచ్చిందని తెలిసిన వెంటనే మండలంలోని పలు గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో శుక్రవారం ఉదయం సొసైటీ వద్దకు తరలివచ్చారు. అధికారులు 10.30 గంటలకు యూరియా బుకింగ్ యాప్ ఓపెన్ చేస్తే.. ఒకే నిమిషంలో స్టాక్ ఖాళీ అయినట్లు యాప్లో చూపించడంతో రైతులు అవాక్కయ్యారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి మండల వ్యసాయాధికారి జానకిరాములుతో వాగ్వాదానికి దిగి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొండమల్లేపల్లి సొసైటీకీ 440 బస్తాల యూరియా రావడంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యాప్లో బుకింగ్ చేసుకుందామని ప్రయత్నంచగా నిమిషంలోనే స్టాక్ అయిపోయినట్లు చూపించడంతో అన్నదాతలు అయోమయానికి గురయ్యారు. కొందరు రైతులకు మాత్రమే యూరియా లభించింది. ఎక్కువ శాతం మందికి యూరియా లభించకపోవడంతో వారంతా ఆగ్రహానికిలోనై సొసైటీలోకి వెళ్లి అధికారులను నిలదీశారు. పొట్టదశలో ఉన్న పైరుకు యూరియా తప్పనిసరి అని. ఇప్పుడు ఎరువు దొరకకపోతే తమ పంట పరిస్థితి ఏంటని వ్యవసాయ అధికారులతో పాటు సొసైటీ సిబ్బందిని నిలదీశారు. రైతులు వాగ్వాదానికి దిగడంతో కొద్ది సేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చాలా మంది రైతులకు స్మార్ట్ ఫోన్ లేదని, తమ పరిస్థితి ఏంటని మరికొందరు రైతులు ప్రశ్నించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు యూరియా కోసం రైతులు సొసైటీ వద్ద పడిగాపులు కాసినా ఫలితం లేకుండా పోయింది. ‘మీకు దండం పెడతాం. యూరియా ఇవ్వండి’ అని మరికొందరు బతిమాలారు. ఎరువు వేయకపోతే పంట దిగుబడి రాదని చెప్పారు. పోలీసులు వచ్చి రైతులకు నచ్చజెప్పారు.
గుడిపల్లి, మార్చి 6: ఉమ్మడి పీఏపల్లి, గుడిపల్లి మండలాల్లో యూరియా ఆన్లైన్ బుకింగ్ ప్రక్రియలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. యూరియా బుకింగ్ కోసం ఫర్టిలైజర్ ఆన్లైన్ యాప్ ఉదయం 11.30 గంటలకు ప్రారంభమవుతుందని వ్యవసాయాధికారులు ముందుగా రైతులకు మెసేజ్ పంపారు. ఆ యాప్ 11.25 గంటలకే ఓపెన్ కావడంతో రైతుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. అధికారులు చెప్పిన సమయానికి ముందుగానే యాప్ ప్రారంభమవుతుండటంతో చాలా మంది రైతులు బుకింగ్ చేసే అవకాశాన్ని కోల్పోయారు. ఈ పరిణామాలపై స్పష్టమైన సమాధానం లేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫర్టిలైజర్ షాపుల యజమానులతో వ్యవసాయ శాఖ అధికారులు కుమ్మక్కై ఈ వ్యవహారం నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించి యాప్ ముందుగానే ఎలా ఓపెన్ అయ్యిందో వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎకరంలో వరి సాగు చేసి రెండు నెలలు కావస్తున్నది. ప్రస్తుతం వరి పుట్టదశలో ఉంది. యారియా అవసరం. కొండమల్లేపల్లెకి యూరియా బస్తాలు కొనేందుకు వస్తే యాప్లో బుక్ చేసుకోవాలంటున్నారు. మాకు చదువు రాదు. వారం రోజులగా యూరియా కోసం సొసైటీ చుట్టు భార్యాభర్తలం తిరుగుతున్నాం. ఈ రోజు యూరియి వచ్చిందని తెల్వడంతో యాప్లో బుక్ చేయడానికి చదువుతున్న నా మనవాళ్లను తీసుకొచ్చాం. 10 గంటలకు బుకింగ్ ఉందని చెప్పారు. నిమిషంలోనే యూరియా నో స్టాక్ చూపుతున్నది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూరియా కోసం ఇబ్బంది పడలేదు. యూరియా కోసం ఇలాంటివి పెడితే చదువు రానివారు ఎలా బుక్ చేసుకుంటారు.
మాకు స్మార్ట్ ఫోన్ లేదు. యాప్లో బుకింగ్ చేసుకునుడు ఎట్లనో తెల్వదు. మా పరిస్థితి ఏంటో అర్థమైతలేదు. యూరియా బుకింగ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. చిన్న ఫోన్ ఉన్న మాలాంటి వారికి యూరియా దొరుకుతలేదు. ఎవరో సాయం తీసుకుని బుకింగ్ చేసుకుంటే నిమిషాల్లోనే యూరియా యాప్లో నోస్టాక్ సమాచారం దర్శనిమిసున్నది. మాలాంటి వారి గురించి అధికారులు ఆలోచించాలి. కొందరికి మొదటి దఫా యూరియానే దొరకలేదు. కేసీఆర్ సారు ఉన్నప్పుడు యూరియా కొరత లేదు.
యూరియా బుకింగ్ చిన్న, సన్నకారు రైతులకు ఇబ్బందిగా మారింది. వ్యవసాయ పనులు వదులుకొని యూరి యా కోసం ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఎక్కువ మంది సామాన్య రైతులకు స్మార్ట్ఫోన్లు లేవు. సామాన్య రైతులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం యూరియా యాప్ను రద్దు చేసి దుకాణాల వద్దనే యూరియా పంపిణీ చేయాలి. యూరియా సమస్య పరిష్కరించకుంటే పంటలు సాగు చేయడం అసాధ్యమవుతుంది.