‘అద్భుతం జరుగుతున్నప్పడు ఎవరూ గుర్తించరు! జరిగిన తర్వాత గుర్తించడం అనవసరం!’. కేసీఆర్ సబ్బండ వర్గాల మద్దతులో తెలంగాణ పోరాటానికి సారథ్యం వహించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించడం, దళిత బంధు పథకంతో సత్ఫలితాలు సాధించడం ఇలాంటివే. ఒకప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఎదుగు బొదుగు లేకుండా ఉన్న దళితులు నేడు తమ కాళ్ల మీద తాము నిలబడ్డారు. చిన్న తరహా పరిశ్రమలు నిర్వహిస్తూ నలుగురికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. దళితుల సాధికారతకు ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుంది?
గతంలోని ప్రభుత్వాలన్నీ దళితులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తక్కువ మొత్తంలో రుణాలు ఇచ్చేవి. ఆ రుణాలు పొందడానికి, తీర్చడానికి అనేక ఇబ్బందులు, ఒత్తిళ్లు అనుభవించాల్సి వచ్చేది. వ్యాపారం చేసే సత్తా ఉన్నా డబ్బుల్లేక అవకాశాలకు దూరంగా సామాజిక వివక్ష అనుభవిస్తూ దళితులు ఎదగలేకపోయేవారు. దళితుల దుస్థితి దగ్గరగా చూసిన కేసీఆర్ వారిని అభివృద్ధి పథంలో నడిపించాలని సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే సంకల్పించుకున్నారు. దాన్నే ఇప్పుడు దళిత బంధుగా అమలు చేస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి పూచీకత్తు, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు గ్రాంట్‌గా ఇస్తున్నది. మొదట హుజూరాబాద్ నియోజకవర్గం వాసాల మర్రిలో ప్రారంభమైన ఈ పథకం ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అమలవుతున్నది. రాష్ట్రంలో 8.40 లక్షల కుటుంబాలకు దళిత బంధు సాయం అందుతున్నది. ఈ పథకం అమలును గ్రామ స్థాయిలో వార్డు సభ్యులు, రాష్ట్ర స్థాయిలో మంత్రులతో పాటు 25 వేల మంది ప్రజా ప్రతినిధులు, డిక్కీ సంస్థ వివిధ దశల్లో పర్యవేక్షిస్తున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఓట్ల కోసమే దళిత బంధు పథకం తెచ్చిందని ప్రతిపక్షాలు విమర్శించడం అర్థ రహితం. ఒక రాజకీయ పార్టీ పేదల సంక్షేమం కోసం విప్లవాత్మక పథకాలు అమలు చేస్తూ ఓట్లు అడగడం తప్పా? గతంలో పేదలకు ఏ ప్రభుత్వమూ అమలు చేయని పథకాలను టీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తూ తమకు మద్దతు ఇవ్వమని వారిని అడగడం తప్పా? దళితుల్లో చైతన్యం పెరిగితే తమ ఉనికి ఎక్కడ ప్రశ్నార్థకంగా మారుతుందోనని ప్రతి పక్షాలు భయపడుతున్నాయి. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలోనూ, బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ దళిత బంధు లాంటి పథకం అమలు చేయించాలి. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ విషయంలోనూ ప్రతిపక్షాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాయి. తెలంగాణలో సర్కారు భూములు చాలా తక్కువగా ఉన్నాయి. వాటిలోనే16,800 ఎకరాలను 7 వేల దళిత కుటుంబాలకు ప్రభుత్వం పంచింది. అందరికీ భూమి పంపిణీ సాధ్యం కాదనే కేసీఆర్ దళిత బంధు ద్వారా దళితుల బతుకులను మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఈ పథకాన్ని అడ్డుకోవడమంటే.. దళితులను వంచించడమే.
దళిత బంధుకు నిధులు కేటాయించడం లేదని కొన్ని వార్తా పత్రికలు పని గట్టుకొని విష ప్రచారం చేస్తున్నాయి. కానీ అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దశల వారీగా ప్రభుత్వం సాయం అందిస్తూ వస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గంలో 100 కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపచేసిన ప్రభుత్వం తర్వాత ఒక్కో నియోజకవర్గంలో 1500 కుటుంబాలకు అమలు చేయాలని నిర్ణయించింది. దళిత బంధు పథకానికి అనుబంధంగా దళిత రక్షణ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దళితులు ఎవరైనా దురదృష్టవశాత్తు ఇబ్బందుల పాలైతే వారికి అండగా నిలవడానికి ఈ నిధి ఉపయోగపడుతుంది. దళితుల కుటుంబాలకు దళిత బంధు కింద ఇచ్చే రూ.10 లక్షల నుంచి రూ.10 వేలు మినహాయించి, ప్రభుత్వం మరో రూ.10 వేలు కలిపి మొత్తం రూ.20 వేల చొప్పున…ఈ రక్షణ నిధికి జమ చేస్తుంది.
కొన్ని నెలల క్రితం నుంచి అమలు చేస్తున్న దళిత బంధు పథకం సత్ఫలితాలను ఇస్తున్నది. ప్రభుత్వం అందించిన సాయంతో దళితులు స్వయం ఉపాధి కల్పించుకోవడంతో వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం సిద్ధిస్తున్నది. దళితుల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం -2013 లోని లోపాలను సరిదిద్ది 2017లో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి పథకం తీసుకు వచ్చింది. టీ – ప్రైడ్ ద్వారా రూ.75 లక్షల వరకు రాయితీ, పావలా వడ్డీ రుణాలు, పారిశ్రామిక పార్కులలో స్థలాలు కేటాయిస్తున్నది. జీవో 59 ద్వారా ఎస్సీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వ కాంట్రాక్టులు, మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి కోసం లక్షలాది మంది యువతకు రుణాలు అందిస్తూనే ఉన్నది. దళిత విద్యార్థుల విదేశీ విద్యాభ్యాసం కోసం ఓవర్సీస్ విద్యా నిధి పథకం ద్వారా ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షలు సాయం చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో రూ.10 లక్షలు ఉన్న ఈ సాయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం రెట్టింపు చేయడం దళితుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. ఎస్సీ బాలురు, బాలికలు చదువుకోవడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున గురుకులాలు నెలకొల్పి ఉచితంగా విద్య అందిస్తున్నది. ఆయా గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.లక్ష వరకు ఖర్చు చేస్తున్నది. దళితుల కోసం ఇలాంటి పథకాలు అమలు చేసిన ప్రభుత్వం ఏదీ లేదు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలను మొదట దళితుల కోసం ప్రారంభించి క్రమంగా మిగతా సామాజిక వర్గాలకు విస్తరించారు సీఎం కేసీఆర్. దళితుల జీవితాల్లో వెలుగులు పూయిస్తున్న దళిత బంధు లాంటి పథకాలు మిగతా సామాజిక వర్గాల ప్రజలకూ అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో కండ్లు మూసుకున్న ప్రతిపక్షాలు ఇకనైనా వాస్తవాలు గుర్తించాలి. లేదంటే దళిత బిడ్డలు రేపు మీకు ఓట్లతో సరైన బుద్ధి చెబుతారు.
(వ్యాసకర్త: రాహుల్ కిరణ్ చంటి 99599 70514, వైస్ ప్రెసిడెంట్, డిక్కీ సౌత్ ఇండియా)