ప్రకృతి ప్రసాదించిన పంచభూతాల్లో ఒకటి భూమి. మనిషి తన స్వార్థం కోసం ఆ భూమిని ఎన్నోరకాలుగా వాడుకుంటూ భూ కాలుష్యం చేస్తున్నాడు. ఇది మానవ మనుగడకే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. అభివృద్ధి పేరుతో విధ్వంసం చేస్తూ ఆహార కొరతను సృష్టిస్తున్నాడు. దీంతో దేశంలో ఆకలి కేకలు రాజ్యమేలుతున్నాయి. అన్నం పెట్టే భూమిని నాశనం చేస్తూ మనిషి పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నాడు. తద్వారా భూ కాలుష్యం అప్రతిహతంగా కొనసాగుతున్నది.
గృహ వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో భూసా రం దెబ్బతింటుంది. మన దేశంలో ప్రతి రోజూ 15 వేల టన్నుల కంటే ఎక్కువ చెత్త ఉత్పత్తి అవుతున్నట్లు అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. మార్కెట్లో ప్లాస్టిక్ వినియోగం పెరిగింది. వస్తువుల నిల్వ, రవాణాలో ప్లాస్టిక్‌ను అధికంగా ఉపయోగిస్తున్నారు. పలురకాల ప్లాస్టిక్ వ్యర్థాలు వందల ఏండ్ల తరబడి భూమిలో కలిసిపోకుండా ఉండటం వల్ల భూమి ఉత్పాదకత శక్తి తగ్గుతుంది. జాతీయ ఉత్పత్తి ఉత్పాదకత తగ్గి ప్రజల ఆదాదయం, జీవన ప్రమాణాలు, కొనుగోలుశక్తి ఆశించిన మేర పెరగడం లేదు. పశువులు, పక్షులు ప్లాస్టిక్ వ్యర్థాలను తినడం వల్ల చనిపోతున్నాయి. ప్లాస్టిక్ కాలుష్యం పర్యావరణానికి ప్రమాదకరంగా పరిణమించింది. భారత్‌లో ఏటా 56 లక్షల టన్నుల చెత్త పోగుపడుతున్నది. ఈ స్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి దేశంలో వచ్చే 12 బిలియన్ టన్నుల చెత్తను శుభ్రపరచడానికి వందల సంవత్సరాలు పడుతుందని ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం’ తన నివేదికలో వెల్లడించింది. అందుకే పెరుగుతున్న భూ కాలుష్యాన్ని అరికట్టాలి. అందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్రమైన విధానాలను అమలుచేయాలి.
జనాభాను అరికట్టాలి. భూమి ఉత్పాదకతను పెంచాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ప్లాస్టిక్ వినియోగంపై జరిమానా విధించాలి. (ఐర్లాండ్‌ను ఆదర్శంగా తీసుకొని ప్లాస్టిక్ వినియోగంపై భారీ జరిమానాలు విధించాలి. మలేషియాలో జరిమానాల మూలంగా ప్లాస్టిక్ వినియోగం 94 శాతం తగ్గింది.), చిత్తడి నేలలు పెంచాలి. సామాజిక వనాలను పెంచాలి. చిట్టడవులను సంరక్షించాలి. ఉద్యానవనాలు, పబ్లిక్ పార్కుల ద్వారా ప్రజలకు రీక్రియేషన్ సౌకర్యాలు కల్పించాలి. పబ్లిక్ పార్కుల నిర్వహణ పాలనలో నగరాల్లో రెసిడెన్షియల్ అసోసియేషన్లకు భాగస్వామ్యం కలిగించాలి. ‘పచ్చదనం-పరిశుభ్రత’ ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాల్లో పౌరులు స్వచ్ఛందంగా పాల్గొనాలి. భూమి, నీరు, సహజ వనరుల సంరక్షణ ఉద్యమం కొనసాగాలి. జీవావరణం-పర్యావరణం కాలుష్య నియంత్రణ సమన్వయంతో ఏక (ఒకే) కాలంలో జరగాలి. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహననా సదస్సులు ఏర్పాటు చేయాలి. పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థ, యువత సామాజిక, సాంస్కృతిక సంస్థలు సంయుక్తంగా నిర్వహించాలి. సమాజంలో భూ రక్షణ పట్ల స్పృహను, స్ఫూర్తిని పెంచాలి. ‘రండి భూమిని కాపాడదాం-భూమికి ప్రత్యామ్నాయం లేదు’ వంటి నినాదాలను ప్రచార, ప్రసార సాధనాల ద్వారా విస్తృతపర్చాలి.
భూ రక్షణ సమాజ సామాజిక బాధ్యతగా గుర్తెరిగి మసులుకుందాం. ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయ విధానాలను గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతస్థాయిలో ప్రచారం చెయ్యాలి. పంటల అధికోత్పత్తి కోసం భూమిని కాలుష్యం చేసే రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. నీటి నిల్వ, భూమి కోత ‘నివారణ నీటి కాలువల’ నిర్వహణా విధానాల మీద వ్యవసాయదారులతో వ్యవసాయ కూలీలతో అవగాహనా సదస్సులు నిర్వహించాలి. భూ కాలుష్యానికి కారణమయ్యే పరిశ్రమల స్థాపనకు అనుమతులను నిరాకరించాలి. చెత్త, వ్యర్థాల శుద్ధి తగినంత రీ సైక్లింగ్ పునరుత్పాదకశక్తుల అమలు పారిశ్రామిక, దేశీయ వ్యర్థాలను శుద్ధి చేయడం ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సాహించాలి. తద్వారా భూ కాలుష్యాన్ని అరికట్టాలి. వర్షాల వల్ల వచ్చే వరదల తాకిడి నుంచయి భూమి కోతకు గురికాకుండా వరద నీటినిలువ నిర్వహణ ను మెరుగుపరచాలి. భూమిపై జనాభాను పెంచగలం, కాని భూమిని పెంచలేమనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తెరగాలి. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగం పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలి.
సోలార్ విద్యుత్ శక్తి, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించే కార్యాచరణతో ప్రభుత్వాలు ముందుకురావాలి. భూ రక్షణే-జన రక్షణ అన్న స్పృహను సమాజంలో కలిగించాలి. ప్రకృతి రక్షణే లక్ష్యంగా సమగ్ర ధరిత్రి విధానాన్ని ప్రభుత్వం రూపొందించాలి. పర్యావరణ సానుకూల ఉత్పత్తులను ఉపయోగించాలి. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలి. పునర్వినియోగానికి ఉపయోగపడే వాటర్ బాటిళ్లను, బ్యాగులను మాత్రమే వాడాలి. అవసరం లేనప్పుడు విద్యుత్తు బల్బులను వినియోగించకూడదు. మనుషులు, పరిశ్రమలు చేసే కాలుష్యం వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతున్నది. సమస్త భూగోళం వినాశం దిశగా అడుగులు వేస్తున్న ది. మన భవిష్యత్ తరాలకు సిరిసంపదలు, ఆహ్లాదకరమైన భూమిని కాకుండా కలుషిత వాతావరణాన్ని వారసత్వ ఆస్తిగా ఇచ్చే దుస్థితి రాకుండా జాగ్రత్త పడాలి. ప్రభుత్వాలు ‘భూ రక్షణే జన సంరక్షణ’ లక్ష్యంగా సమగ్రమైన భూ రక్షణ విధానాలను అమలుచేయాలి.
(వ్యాసకర్త: నేదునూరి కనకయ్య 94402 45771, తెలంగాణ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు)