‘కేసీఆర్…’ మొన్న ఉద్యమ నేత. నిన్న తెలంగాణ అభివృద్ధి ప్రదాత. నేడు దేశానికి కావలసిన మార్గదర్శి. ‘ఉన్నతమైన లక్ష్యానికి ఉన్నతమైన మార్గం ఉండాలి’ అన్నారు మహాత్మా గాంధీజీ. ఆయన చూపిన శాంతిమార్గంలో నడిచి తెలంగాణ సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్. గాంధీజీ ఆలోచనా సరళిలోనే ‘సబ్కో సన్మతి’ వలె సమాజంలో అన్నివర్గాల వారి అభివృద్ధిని రాష్ట్రంలో సాధించి చూపెట్టారు. ఇది దేశవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ప్ర స్తుతం దేశంలో కొంతమందికే లబ్ధి చేకూర్చే నాయకులున్నారు. ఈ తరుణంలో దేశ సమగ్రాభివృద్ధిని ఆకాంక్షించే నాయకుడు కావాలి. నలుగురు పారిశ్రామికవేత్తలకో లేదా సొంత ప్రాంతాలకో లబ్ధి చేకూరుస్తున్న స్వార్థ రాజకీయాలు నడుస్తున్న చోట కొత్త ఆశయం మొలకెత్తాల్సిన సమయం ఆసన్నమైంది. అది కేసీఆర్‌తోనే సాధ్యం. దానికి సాధనమే ‘భారత్ రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్). విద్వేషం దేశాన్ని ఉక్కపోతలో ముంచిన ప్రస్తుత పరిస్థితుల్లో సమభావన, సెక్యులర్ థాట్స్, అన్నివర్గాలు అలాయి బలాయి చేసుకునే సంస్కృతి కావాలి. ఒక అసంతృప్తి భావన విద్వేష విధ్వంస రచన సాగిస్తున్నది. దీన్ని మూలంలోనే తుంచివేయాలంటే మనలో ‘అందరం సమానం’ అనే సమభావన రావాలి. అన్ని మతాలు ఆదరించబడాలి. అన్ని జాతులు అభివృద్ధి ఫలాలు అందుకోవాలి. ఇదీ కొత్త నాయకుడితోనే మొదలుకావాలి. ఎందుకంటే ఇప్పుడున్న నాయకులను ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు. కేసీఆర్ దేశ ప్రజలకు ఈ నమ్మకం కలిగించ సమర్థులు.
దేశంలోని ఐఏఎస్‌లు తెలంగాణలోని ‘మిషన్ భగీరథ’, ‘రైతుబంధు’, ‘మిషన్ కాకతీయ’ లాంటి పథకాలను పరిశీలించారు. ‘నీతి ఆయోగ్’ కూడా ‘మిషన్ భగీరథ’కు నిధులు సమకూర్చాలని సిఫారసు చేసిందంటే అది ఎంతటి గొప్ప పథకమో ఆలోచించవచ్చు. కేంద్రం తెలంగాణలోని ‘రైతుబంధు’ను మరో పేరుతోనైనా స్వల్ప ప్రయోజనంతో అమలు పరుస్తున్నదంటేనే తెలంగాణను ‘రోల్ మోడల్’గా ఒప్పుకొన్నట్లు కదా? అందుకే ఇన్ని పథకాల సృష్టికర్త కేసీఆర్‌ను ఉత్తమ పథక రచకుడిగా పేర్కొనవచ్చు. మరి ఇవన్నీ దేశానికి చేరవేయాలంటే… దేశ ప్రజలు తెలంగాణ వలె అభివృద్ధి ఫలాలు అందుకోవాంటే పకడ్బందీగా అమలుపరిచే కేసీఆర్ నాయకత్వంలో అయితేనే సాధ్యమవుతుంది.
రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్‌తో సరిపడా నీళ్లు, ‘రైతుబంధు’తో పెట్టుబడి అందించటం ఏ రాష్ట్రంలోనూ లేదు. నిజంగా ‘రైతే రాజు’ అని పొగిడినవాళ్లకు కూడా రాని ఆలోచన కేసీఆర్‌కు తట్టింది. మరి దేశ రైతుకు, తెలంగాణ రైతు వలె ప్రభుత్వ చేయూతనందుకునే హక్కు లేదా? దేశ రైతు ప్రపంచ మార్కెట్లో నిలవాలంటే కేసీఆర్ ఈ దేశానికి ప్రధాని అయితేనే సాధ్యమవుతుంది. అందుకు దేశ రైతులు బీఆర్ఎస్ను తమ పార్టీ వలె స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు.
గతంలో లేనివిధంగా రూపాయి విలువ రోజురోజుకూ పాతాళానికి పడిపోతున్నది. దేశాన్ని ఆకలి కేకల రాజ్యంగా ప్రపంచ సంస్థలు వేలెత్తి చూపెడుతున్నాయి. ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ సంస్థలను, రంగాలను తన మిత్ర వ్యాపారవేత్తలకు ధారాదత్తం చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం దేశ ఆర్థికవ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నది. బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చడం, ఈడీ, ఐటీ లాంటి కేంద్రసంస్థల బూచి చూపించి శిఖండి రాజకీయాలు చేయడం మోదీ ప్రభుత్వానికి నిత్యకృత్యమైపోయింది. ఇంతటి దిగజారుడు రాజకీయాల అసమర్థపాలన నుంచి దేశానికి విముక్తి కావాలంటే ‘బీజేపీ ముక్త్ భారత్’ ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అది కేవలం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ వల్లే సాధ్యమవుతుంది. ప్రస్తుతం దేశానికి కేసీఆర్ లాంటి కమిట్మెంట్, ముందుచూపు, జాతీయభావన ఉన్న వ్యక్తి నాయకత్వం కావాలి. అందుకే ‘బీఆర్ఎస్’ ఆవిర్భావాన్ని ఇప్పుడు దేశ ప్రజలంతా ఆహ్వానించాల్సిన అవసరం ఎంతో ఉన్నది.
(వ్యాసకర్త:డాక్టర్ హరి రమాదేవి 90322 33390, WeCare Society for Social Service స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు, రాష్ట్ర సరోగసి బోర్డు సభ్యురాలు)