జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయం అనుకున్న రాజకీయపార్టీలు కుదేలైపోయాయి. దేశ రాజకీయ యవనికపై ఆ ఆవశ్యకత కనిపిస్తున్న దశ ఇది. ఈ ప్రత్యేక స్థితిలో సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చగలదనే విశ్వాసం ప్రజల్లో కనిపిస్తున్నది.
దేశంలోని మెజారిటీ రాష్ర్టాల్లో ఇప్పుడు స్థానిక, ప్రాంతీయ పార్టీల ప్రభావం అమితంగా ఉన్నది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ పార్టీల పాలనలో ఉన్న రాష్ర్టాలు సగానికే పరిమితమయ్యాయి. స్థానిక అంశాల ప్రాతిపదికన రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ స్థితిని అధ్యయనం చేసిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు ఉపక్రమించారు. ప్రతిపక్షంగా కొనసాగడంలోనూ విఫలమవుతున్న ఇత ర జాతీయస్థాయి పార్టీలకు దీటుగా ఒక ప్రధాన రాజకీయ పార్టీ నిర్మాణం అవసరమని భావించా రు. రైతులు, దళిత బహుజనులు, ఆదివాసీలను ప్రధాన భూమికగా స్వీకరిస్తూ కొత్త రాజకీయ పార్టీ ఉద్భవించింది. ఇదీ జాతీయ ప్రత్యామ్నాయం.
కనీస అవసరాల ప్రాతిపదికగా కొత్త నీరు వచ్చింది. ‘సుజలాం, సుఫలాం, మలయజ శీతలాం, సస్యశ్యామలాం’ అని మనం మననం చేసుకున్న పుడమిలో కొత్త ఆకాంక్షలకు తెర లేచింది. పుడమితల్లి తల్లడిల్లుతూ పరితపిస్తున్న వేళ దసరా నాడు జమ్మిచెట్టు పైనుంచి దించిన ఆయుధంలా బీఆర్ఎస్ ఆవిర్భవించింది. వ్యూహా లు, ఎత్తుగడలు, సిద్ధాంతాలు, ఆచరణాత్మక కార్యాచరణలతో 75 ఏండ్ల స్వతంత్ర భారతాన్ని ప్రపంచ పటంలో అగ్రస్థానాన నిలపగలిగే రాజకీయం, దాన్ని అమలుపరిచే రాజనీతి ఇప్పటి తక్షణావసరం. ఆ అవసరం తీర్చే తొలి అడుగు బీఆర్ఎస్ ప్రకటన.
దేశంలోని సాధారణ ప్రజానీకానికి, రైతాంగానికి, దళిత, గిరిజనులకు, మహిళలకు ఇక్కడ తెలంగాణలో అమలవుతున్న పథకాలు, సంక్షేమం, అభివృద్ధిని హామీనిస్తూ వారిని అభివృద్ధి బాటన తీసుకెళ్తుందన్న నమ్మకం నెలకొన్నది. రైతుబంధు, కాళేశ్వరం, నిరంతర విద్యుత్ వంటి పథకాలతో కూడిన తెలంగాణ మాడల్‌ను బీఆర్ఎస్ పలు రాష్ర్టాలకు విస్తరించనున్నది. మన దేశం వ్యవసాయ ప్రధానమైనది. ఇక్కడి వనరుల వినియోగాన్ని వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా రూపొందించుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఆ దిశలో సాధించిన ప్రగతి దేశవ్యాప్త ప్రగతి సాధనకు దిశా నిర్దేశం చేసింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నాటినుంచి కూడా ఇక్కడి కార్యాచరణ దేశానికి ఒక రోల్‌మాడల్. ఉద్యమాన్ని నిరాఘాటంగా లక్ష్య సాధన వరకూ తీసుకెళ్లకలిగిన నాయకత్వ పటిమ గాంధీజీ అహింసా ఉద్యమానికి కొత్త ఊపిరులూదింది.
తెలంగాణలో వివిధ రంగాల్లో జరిగిన అభివృద్ధిని దేశాభివృద్ధికి పైలట్ ప్రాజెక్టుగా చెప్పుకోవచ్చు. పల్లెలు పట్టణాల సమగ్ర ప్రగతికి అమలుచేసిన పథకాలు దేశానికి మార్గదర్శకాలు. ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు ఇస్తున్న మిషన్ భగీరథ ప్రపంచానికే ఒక రోల్‌మాడల్. రైతుబంధు, రైతు బీమా పథకాలు వ్యవసాయ ప్రధాన భారతదేశానికి అత్యంత అవసరమైనవి. దళిత, గిరిజన, మైనారిటీ, మహిళల సంక్షేమానికి చేపట్టిన పథకాలు దేశానికి మార్గదర్శకాల వంటివి. సంక్షేమం, అభివృద్ధితో కూడిన కార్యాచరణలో తెలంగాణ నమూనా బీఆర్ఎస్ ఊతంగా దేశంలో అన్ని రాష్ర్టాలకు విస్తరిస్తుంది. తెలంగాణ భావి భారత దిక్సూచిగా నిలువబోతున్నది.
(వ్యాసకర్త: డాక్టర్ , కడియం కావ్య, కడియం ఫౌండేషన్ చైర్ పర్సన్)