గత సంవత్సరం వరకు ఢిల్లీలోని 5 సర్దార్ పటేల్ మార్గ్‌లో ఒక ఇల్లు ఖాళీగా ఉండేది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆ ఇంటిని భారత్ రాష్ట్ర సమితి లీజుకు తీసుకుని టీఆర్ఎస్ను దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు శ్రీకారం చుట్టింది. ఇటీవల ఢిల్లీలోని పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు. వసంత్ విహార్‌లో తమ పార్టీకి కేంద్రం కేటాయించిన స్థలాన్నీ పరిశీలించారు. అక్కడ పార్టీ శాశ్వత కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. టీఆర్ఎస్ పేరు మార్పు, గుర్తు, ఆఫీస్ బేరర్స్‌కు సంబంధించిన వివరాలను టీఆర్ఎస్ నాయకులు భారత ఎన్నికల సంఘానికి సమర్పించారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు బాగా పరిపాలిస్తున్నది. పరిస్థితులు అనుకూలించకపోయినా అభివృద్ధి సాధించే అవకాశాలున్నాయని ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ తెలియజేస్తున్నది. 2021-22 సవరించిన అంచనాల కన్నా 24 శాతం ఎక్కువగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1.93 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఇందులో రూ.1.33 లక్షల కోట్లకు పైగా ఆదాయం(69 శాతం) సొంతంగా పన్ను, పన్నేతర ఆదాయం ద్వారా సమకూర్చుకోవాలని, మిగతాది కేంద్రం నుంచి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. 2021-22 సవరించిన అంచనాలతో పోలిస్తే 2022-23లో పన్నేతర ఆదాయం 13 శాతానికి పెరుగుతుందని రాష్ట్ర సర్కారు భావిస్తున్నది. కానీ బడ్జెట్ అంచనాలు, 2021-22లో సవరించిన అంచనాల మధ్య 33 శాతం ఆదాయ క్షీణత ఉంది. కొవిడ్ కారణంగానే ఆదాయం తగ్గిందని ప్రభుత్వం భావిస్తున్నది.
పిల్లల దుస్తుల తయారీలో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద తయారీ సంస్థ అయిన కైటెక్స్ 2020-21 ఉత్పత్తిని ప్రారంభించకపోవడం వల్ల కొంత క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. కేరళలో వేధింపులు ఎదురవడం వల్ల ఆ సంస్థ తన ఫ్యాక్టరీని వరంగల్ జిల్లాకు తరలించింది. కైటెక్స్ ఛైర్మన్, ఎండీ సబు జాకబ్స్ బృందం కోచి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రోజు సాయంత్రమే ఆ కంపెనీ తెలంగాణలో రూ.1000 కోట్ల ప్రారంభ పెట్టుబడులు పెడుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో కేరళకు చెందిన మలబార్ గ్రూప్ రూ.7500 కోట్ల పెట్టుబడితో బంగారు నగల తయారీ యూనిట్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్ శివారులో 19 వేల ఎకరాల్లో నెలకొల్పబోతున్న ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మాసూటికల్ పార్క్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఔషధ పరిశ్రమల స్థాపన సంక్లిష్టమైన ప్రక్రియ. అనేక అనుమతులు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలోనే జాప్యం లేకుండా అనుమతులు వచ్చేలా రాష్ట్ర ప్రభు త్వం అన్ని ప్రక్రియలు పూర్తి చేసింది. ఇక్కడ ఫ్యాక్టరీ స్థాపించాలనుకునే ప్రతి పరిశ్రమ చేయాల్సిందల్లా స్థలాన్ని ఎంపిక చేసుకుని పరిశ్రమ నిర్మాణాన్ని ప్రారంభించడమే! కొవిడ్ కారణంగా వూహాన్(చైనా) నుంచి ఔషధాల తయారీలో వాడే ముడి పదార్థాల సరఫరా ఆగిపోయింది. భవిష్యత్తులో ఈ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండటానికి, ఔషధ తయారీ ముడి పదార్థాలు, ప్రత్యేక రసాయనాల ఉత్పత్తికి ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తెలివైన నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలుగు దేశం పార్టీకి, శాసనసభ ఉప సభాపతి పదవికి 2001లో కేసీఆర్ రాజీనామా చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ను స్థాపించారు. అదే సంవత్సరం ఉమ్మడి ఏపీలో టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య 20 జిల్లా పరిషత్తులకు జరిగిన త్రిముఖ పోరులో టీడీపీ కేవలం 10 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రాబల్యాన్ని గమనించిన కాంగ్రెస్ వెంటనే లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ నిర్వహించిన ర్యాలీలు బాగా విజయవంతమయ్యాయి. లోక్ సభ, శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జట్టు కట్టి ఎన్నికల బరిలో దిగిన టీఆర్ఎస్ పార్టీ 26 అసెంబ్లీ సీట్లు, 5 లోక్‌సభ సీట్లను గెలుచుకుంది. ఆనాటి నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ కోరుతూనే ఉన్నారు. కానీ కాంగ్రెస్ ఆ విషయాన్ని దాటవేస్తూ వచ్చింది. చివరికి తెలంగాణ కోసం కేసీఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి కూటమి నుంచి బయటకు వచ్చారు.
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ప్రధాన ప్రత్యర్థిగా మారారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. కానీ అప్పటి నుంచే టీఆర్ఎస్కు కొన్ని ఒడిదొడుకులు ఎదురయ్యాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో 4 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. 2021లో జరిగిన ఉప ఎన్నికలో హుజూరాబాద్ స్థానాన్ని బీజేపీకి కోల్పోవడం టీఆర్ఎస్కు ఇబ్బందికరమైన విషయమే! మొదట్లో కేసీఆర్ బీజేపీతో సఖ్యతగానే ఉండేవారు. కానీ ఇప్పుడు వారిద్దరూ బద్ధ శత్రువులు. నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలో రాజకీయ పవనాలు ఎటు వీస్తున్నాయో తెలుసుకోవడానికి ఉత్తమమైన తాజా ఉదాహరణ.
ఈ మధ్యలో కాంగ్రెస్ తప్పించి మిగతా అన్ని ప్రతిపక్షాలతో కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు. ‘నేడు నవ భారత నిర్మాణం జరగాల్సి ఉంది. దేశంలోని వనరులను సద్వినియోగం చేసుకుంటే అమెరికా కన్నా మిన్నగా భారత్ అభివృద్ధి సాధిస్తుంది. బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది’ అని బీఆర్ఎస్ ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర, ముఖ్యంగా అక్కడి వ్యవసాయ సంఘాలు బీఆర్ఎస్ మొదటి లక్ష్యం. దాని తర్వాత హైదరాబాద్‌లో అఖిల భారత దళిత సమ్మేళనం నిర్వహించనున్నారు. నేడు దేశంలో ప్రతిపక్షాల రాజకీయాలు మరో ఆశ్చర్యకరమైన మలుపు తీసుకోబోతున్నాయి.
-అదితి ఫడ్నిస్
(బిజినెస్ స్టాండర్డ్ సౌజన్యంతో)