ఒక ఆలోచనకు మొదట సానుకూల వాతావరణం అంటూ ఏర్పడితే సగం యుద్ధం గెలిచినట్లే అంటారు. కేసీఆర్ ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి పేరుకు ఎన్నికల సంఘం ఆమోదం ఇంకా లభించవలసి ఉన్నప్పటికీ, ఆ పేరు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రచారమైంది. వివిధ రాష్ర్టాలు, వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి, కేసీఆర్ పార్టీ పట్ల అమితమైన ఆసక్తి, గణనీయమైన సానుకూలత క్రమంగా ఏర్పడుతున్నాయి. అన్నింటికన్న ముఖ్యంగా, బీఆర్ఎస్ అజెండా ఇంతవరకు గల అన్ని పార్టీల కన్న భిన్నంగా ఉండబోతున్నదనే మాట వారి ఆసక్తిని పెంచుతున్నది.
ఆర్థికాభివృద్ధి, మానవాభివృద్ధి, వివిధ వర్గాల అభివృద్ధి, సంక్షేమం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం అనే ఐదు అంశాలు భారతదేశపు వర్తమాన చరిత్రలో ఎందువల్ల అతి కీలకం కాగలవు? వాటికి సమాధానాలు కనుగొన్నవారు ఏ విధంగా దేశమంతటా జన హృదయాలను జయించగలరు? ఒక నిర్దిష్టమైన ఉదాహరణ చూద్దాం. అది బిహార్ రాష్ట్రం. ఒక విధంగా అది అన్నింటికన్న కొరకరాని కొయ్య అని నాయకులు, నిపుణుల అభిప్రాయం. బిహార్ నేపథ్యాన్ని క్లుప్తంగా చెప్పుకొందాం. చారిత్రకంగా దానికి అనేక గొప్పలు ఉన్నప్పటికీ మధ్యయుగాలు, వలస పాలనల కాలం నుంచి, చెప్పాలంటే స్వాతంత్య్రానంతరం కూడా ఠాకూర్లు, భూమి హార్లు, బ్రాహ్మలు, కాయస్థుల ఫ్యూడల్, ఉన్నత వర్గాల చేతిలో ఆర్థికం, సామాజికం, రాజకీయం అన్నీ బిగుసుకుపోయి ఉండేవి. దీనిపట్ల నిరసనలు, ఉద్యమాల నుంచి 1930ల నుంచే మొదలుకొని వివిధ బీసీ, ఇతర అణగారిన కులాల నేపథ్యంతో సోషలిస్టు పార్టీలు పుట్టుకువచ్చాయి. జయప్రకాశ్ నారాయణ, నరేంద్ర దేవ్, రాం మనోహర్ లోహియా, కర్పూరీ ఠాకూర్ తదితర హేమాహేమీల నుంచి లాలూ ప్రసాద్, నితీశ్ కుమార్ వంటివారి దాకా అందరూ ఆ విధంగా వచ్చి చక్రాలు తిప్పినవారే. మరొక స్థాయిలో దళితులూ స్వయంగా ఉద్యమించారు.
సంప్రదాయిక కమ్యూనిస్టులు, నక్సలైట్లూ తమ ప్రాబల్యం చూపారు. కాంగ్రెస్, ఇటీవల బీజేపీ సరేసరి. విషయం ఏమంటే, ఇటువంటి పరిస్థితుల మధ్య బిహార్‌లోని పైన పేర్కొన్న ఫ్యూడల్ తరగతి బాగా బలహీన పడింది. ప్రధానంగా వీరిపైన ఆధారపడి దళితులను, ముస్లింలను కో ఆప్ట్ చేసుకున్న కాంగ్రెస్ అభివృద్ధి రాహిత్యం, అసమర్థ పాలనతో దెబ్బతినిపోయింది. ఒక స్థాయిలో ఉండిన కమ్యూనిస్టులు, నక్సలైట్లకు పురోగతి లేదు. ఇక మిగిలింది 1930 నుంచి వేర్వేరు సోషలిస్టు పార్టీలతో, తర్వాత కాంగ్రెస్ సోషలిస్టులతో, జనతాదళ్‌తో, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్లతో ప్రస్తుతం జనతాదళ్ పేరు గల వేర్వేరు ముక్కలతో నడుస్తున్న బీసీలు, దళితులు, గిరిజనులు, ముస్లింలు, వీరిలో వేర్వేరు వృత్తులవారు, గ్రామీణులు, పట్టణవాసులు. వీరంతా ఇన్నేండ్లలో సోషలిస్టులను, కాంగ్రెస్‌ను, ఫ్రంట్లను, దళ్లను, కమ్యూనిస్టులు, బీజేపీని గెలిపించారు, ఓడించారు. మనుముందు ఏమి చేయవచ్చునన్నది ఎవరూ చెప్పలేని సమాధానం.
ఇప్పుడు అసలు సిసలైన ప్రశ్న ముందుకు వస్తుంది. అది కూడా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు సందర్భంలో. 1947కు ముందు బిహార్ ఆర్థిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఏమిటో, ఆ నేపథ్యంలో పలువురు ఉద్ధండ సోషలిస్టు సిద్ధాంతకారులు, ఉద్యమ నాయకులు, 1930ల నుంచే మొదలుకొని ఏ విధంగా సోషలిస్టు పార్టీలను స్థాపిస్తూ వచ్చారో, అవి చీలినా వేర్వేరు పేర్లతో ఏ విధంగా నేటికీ కొనసాగుతున్నాయో పైన చెప్పుకొన్నాము. ఇటువంటి పరిణామాలు మొత్తం దేశంలోనే మరే రాష్ట్రంలోనూ జరగలేదన్నది మనం ప్రత్యేకంగా గుర్తించవలసిన విషయం. అటువంటి స్థితిలో బిహార్ వంటిచోట, సోషలిస్టులు, వారి పార్టీలకు అత్యధిక ప్రజాదరణ అన్నది లభించాలి. సుస్థిరంగా, సుదీర్ఘంగా ఉండాలి. కాంగ్రెస్, బీజేపీ వంటివారికి అవకాశం లభించకూడదు. తాము వారితో పొత్తు పెట్టుకోవలసిన అగత్యం కూడా ఏర్పడరాదు.
కాని తరచూ అట్లా ఎందుకు జరుగుతున్నది? ఇందుకు ఏకైక సమాధానం, వారికి 1930ల నుంచి ఇప్పటివరకు కూడా సిద్ధాంతం అనదగ్గదయితే ఉంది గాని అందులో రాజకీయం ఎక్కువ, ఒక పద్ధతి ప్రకారపు ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం, మానవాభివృద్ధి, వివిధ వర్గాల అభివృద్ధి, అణగారిన వర్గాల ఆత్మగౌరవం అనే అంశాలు వారి అజెండాలో లేవు. అప్పుడప్పుడు అరకొరగా కొన్ని వచ్చినా వాటికి దార్శనికత గాని సమగ్రత గాని లేవు. ఉన్న అజెండాలూ అమలుకాలేదు. ఇందుకు తోడు ఈ నాయకులలో అధికులు అవినీతిపరులు, సొంత కులాలకు మేలు చేసినవారూ, గ్రూపు రాజకీయాలవారు అయ్యారు. ఇటీవల నితీశ్‌కుమార్ తన మొదటి విడత పాలనతో కొంత తేడా చూపి ఆ తర్వాత ఇంచుమించు చేతులెత్తేశారు. నేడు బిహార్ అనేక సూచీల్లో వెనుకబడి ఉన్నది. అక్కడ సామాజికంగా తీవ్రమైన అసంతృప్తి, అశాంతి ఉన్నాయి.
ప్రముఖ సోషలిస్టు నేపథ్యాల వారిలో ప్రస్తుతం లాలూప్రసాద్ చివరి దశలో ఉన్నారు. నితీశ్ క్రమంగా అక్కడకు చేరుతున్నారు. తక్కినవారిలో ఎవరైనా ముందుకువచ్చి వారి స్థాయికి వెళ్లేది తెలియదు. ఆ విధంగా, మౌలిక స్థాయిలో చిరకాలపు అజెండా శూన్యాన్ని పూరించటమే గాక, నాయకత్వపు కొరతను అధిగమించవలసిన అవసరం బిహార్ వంటి డైనమిక్ రాష్ర్టానికి, అటువంటి చారిత్రక, ఆర్థిక, సామాజిక నేపథ్యాలు గల ప్రాంతానికి ఉంది. వారికి తోడ్పాటునివ్వటం, నాయకత్వం వహించటం కేసీఆర్ జాతీయ బాధ్యత.
-టంకశాల అశోక్