‘ముఖం బాగా లేక అద్దాన్ని నేలకేసి కొట్టినట్టుగా’ ఉంది కేంద్రంలోని మోదీ సర్కారు వైఖరి. ప్రపంచ ఆకలి సూచీలో భారత్ స్థానం పతనోన్ముఖంగా సాగిపోవటం చూసి, స్వీయవిమర్శ చేసుకోవాల్సింది పోయి, ఆ సూచీపైనే రాళ్లేయటం బీజేపీ ప్రభుత్వ మానసిక స్థితిని వెల్లడిస్తున్నది. తాజాగా విడుదలైన ఆకలి సూచీలో మొత్తం 121 దేశాలకుగాను భారత్ 107వ స్థానంలో నిలిచింది. మన పొరుగు దేశాలైన శ్రీలంక (64), నేపాల్ (81), బంగ్లాదేశ్ (84), పాకిస్థాన్ (99) మెరుగ్గా ఉండగా, అంతర్యుద్ధంతో అతలాకుతలమైన ఆఫ్ఘనిస్థాన్ మాత్రమే 109వ ర్యాంకుతో మన వెనుక ఉంది. ఈ నివేదిక విడుదల కాగానే, కేంద్ర ప్రభుత్వం ఇది భారత్ ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నమని దుయ్యబట్టింది. ఈ నివేదికను తయారు చేసిన ప్రాతిపదికలు, విధానం తప్పుల తడకలా ఉన్నాయని విమర్శించింది.
మోదీ అధికారం చేపట్టిన తర్వాత భారత్లో మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయని ‘అంతర్జాతీయ మత స్వేచ్ఛ నివేదిక’ 2018లో వెల్లడించింది. వెంటనే భారత విదేశాంగ శాఖ ఈ నివేదికను ఖండిస్తూ, భారత రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులను ఇచ్చిందని, లౌకిక ప్రజాస్వామ్య విలువలకు తాము నిబద్ధులమని, ఒక విదేశీ సంస్థ ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. మోదీ భారత్లో పత్రికా స్వేచ్ఛ రోజురోజుకీ హరించుకుపోతున్నదని ‘వరల్డ్ ప్రెస్ ఫ్రీడం ఇండెక్స్’ నిరుడు కుండబద్దలు కొట్టింది. దీనిపై టీఆర్ఎస్ ఎంపీ పార్లమెంటులో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. ఆ నివేదిక రూపకల్పనలో అనుసరించిన పద్ధతులపై అభ్యంతరాలున్నాయని, కాబట్టి నివేదిక అంశాల్ని అంగీకరించమని ప్రభుత్వం చెప్పింది. పర్యావరణ పరిరక్షణలో భారతదేశం 180 దేశాల్లో అట్టడుగున ఉన్నదని ‘పర్యావరణ పనితీరు సూచీ’ ఈ ఏడాది జూన్లో తెలియజేసింది. దీనిని కూడా కేంద్రం తిరస్కరించింది.
ఈ నివేదికలను వెలువరిస్తున్న సంస్థలు మోదీ ప్రధాని అయిన తర్వాత పుట్టినవి కావు. దశాబ్దాలుగా, నిష్పక్షపాతంగా ఆయా రంగాల్లో పని చేస్తూ గౌరవాభిమానాల్ని సంపాదించుకున్న స్వతంత్ర సంస్థలవి. వాటిని తప్పు పట్టడం వల్ల అపహాస్యం పాలు కావడం తప్ప ఫలితం ఉండదు. మోదీ ప్రభుత్వ విధానాలు నచ్చక పలువురు ఆర్థిక వేత్తలు దూరమయ్యారు. బీజేపీలోని అనుభవజ్ఞులైన నాయకులు కూడా హితబోధ చేసే పరిస్థితి లేదు. రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఇతర పార్టీల నాయకులు చేసే సూచనలను స్వీకరించే ప్రజాస్వామిక స్ఫూర్తి కేంద్రప్రభుత్వంలో లోపించింది. ఈ పర్యవసానమే దేశం అన్ని రంగాలలో ఎదుర్కొంటున్న సంక్షోభం. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం విమర్శలను హుందాగా స్వీకరించాలి. దేశవ్యాప్తంగా అన్ని పక్షాల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలి.